‘టాక్సిక్’ వాయిదా వార్తలపై మేకర్స్ ఫైర్

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలకు చిత్ర బృందం తెరదించింది. మొదట మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా, మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా జూన్ 4వ తేదీకి వాయిదా పడింది. అయితే మళ్లీ ఈ చిత్రం వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ముందుగా ప్రకటించినట్టుగానే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు.

ఈ సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర యూనిట్ ఒక భారీ ప్లాన్‌ను సిద్ధం చేసింది. యశ్ మరియు నిర్మాత నమిత్ మల్హోత్రా లాస్ వెగాస్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘సినిమాకాన్’ కు వెళ్లనున్నారు. అక్కడ యశ్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అయిన ‘రామాయణ’ మరియు ‘టాక్సిక్’ గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చించనున్నాడు. ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్ ఇప్పటికే దాని గ్రాండియర్ మరియు స్టైలిష్ మేకింగ్‌తో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ మరియు తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ భాషల్లోకి డబ్ కానుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించబోతోంది.

Exit mobile version