
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘లింగా’ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేస్తుందంటూ తెలుగు, తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. 10 ఏళ్ళ నుండి తెలుగు తమిళ ప్రేక్షకులను అలరిస్తుంది త్రిష. సమంత, శృతి హాసన్, కాజల్ అగర్వాల్ వంటి తారలు హవా పెరగడంతో త్రిషకు అవకాశాలు తగ్గిన మాట వాస్తవం. అందువల్ల స్పెషల్ సాంగ్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వ్యాఖ్యలు వినిపించాయి.
రజినీకాంత్ ‘లింగా’లో స్పెషల్ సాంగ్ చేస్తున్నారట కదా అని త్రిషను ప్రశ్నించగా.. నేను ఆ సినిమాలో నటించడం లేదు అని చెప్పారు. ‘తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోల సరసన నేను నటించాను. రజిని సర్ సినిమాలో నటించే అవకాశం రాలేదు. ఎప్పటి నుండో రజినీకాంత్ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను. ‘లింగా’ మూవీ యూనిట్ సభ్యులు స్పెషల్ సాంగ్ కోసం నన్ను సంప్రదించారు అని వస్తున్న వార్తలలో నిజం లేదు. నన్నెవరూ కలవలేదు. అని త్రిష చెప్పారు.
తెలుగులో బాలకృష్ణ 98వ సినిమాతో పాటు మరో రెండు తమిళ సినిమాలలో త్రిష నటిస్తుంది. కన్నడలో త్రిష తొలిసినిమా ‘పవర్’ త్వరలో విడుదల కానుంది.