బస్సే క్షేమం అంటున్న “రాధేశ్యామ్‌”.. సజ్జనార్ ట్వీట్ వైరల్..!

Published on Mar 10, 2022 10:50 pm IST

టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పలు సంస్కరణలకు శ్రీకారంచుడుతూ ప్రజారవాణాను ప్రజలకు మరింత దగ్గర చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను కూడా బాగానే వాడుకుంటూ ఆర్టీసీ ప్రయాణంపై, ఆర్టీసీ సేవలపై ప్రజల్లో అవగాహనను పెంచుతున్నారు. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “రాధేశ్యామ్‌”ని కూడా సజ్జనార్ ఆర్టీసీ ప్రమోషన్‌ కోసం వాడుకున్నారు.

ఈ మేరకు ఓ పోస్టర్‌ని ట్వీట్ చేయగా.. “అందులో ప్రభాస్ చాలా రోజుల తర్వాత కలిశాం.. ఏదైనా టూర్‌ వెళదామా?” అని పూజాహెగ్ధేని అడగ్గ, “వెళదాం కానీ.. ఆర్టీసీ బస్సులోనే వెళదాం” అని పూజాహెగ్డే బదులిస్తుంది. “ఎందుకు?” అని ప్రభాస్‌ అడగ్గా “ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం-సుఖమయం” అని పూజా సమాధానం చెబుతున్నట్టు అందులో ఉంది. అంతేకాదు దానికి “బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్‌” అని టైటిల్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇకపోతే భారీ అంచనాల మధ్య “రాధేశ్యామ్‌” రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :