‘బాహుబలి 2’ నైజాం హక్కులు ఎంత పలికాయంటే..!
Published on Oct 11, 2016 9:21 am IST

baahubali-2
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చనడంలో సందేహం లేదన్న విషయం తెలిసిందే. గతేడాది జూలై నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఇక ఇప్పటికే క్లైమాక్స్‌తో పాటు చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కళ్ళు చెదిరే స్థాయిలో జరుగుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. బాహుబలికి కొనసాగింపు కావడంతో బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 కూడా ప్రభంజనం సృష్టిస్తుందన్న ఆలోచనతో డిస్ట్రిబ్యూటర్స్ కోట్ల రూపాయలకు రైట్స్ సొంతం చేసుకుంటున్నారు.

తాజాగా నైజాం ప్రాంత హక్కులను ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సునీల్ నారంగ్, నారాయణ దాస్ సొంతం చేసుకున్నారు. సుమారు 45 కోట్ల రూపాయలకు ఈ హక్కులు అమ్ముడవ్వడం అతిపెద్ద విశేషంగా చెప్పుకోవాలి. ఇక మొదటి భాగానికి సంబంధించిన నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సొంతం చేసుకొని అప్పట్లో భారీ లాభాలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ కూడా బాహుబలితో తమకు లాభాల పంట పండుతుందని భావిస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న బాహుబలిని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తోంది.

 
Like us on Facebook