ఎట్టకేలకూ చైతన్య పాస్.. మరి మిగతా హీరోలూ ?

Published on Apr 8, 2019 5:00 pm IST

తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏప్రిల్.. అటు ఐపీఎల్ ఉత్సాహంతో, ఇటు ఎన్నికల హడావుడితో హీట్ ఎక్కుతుంటే.. మరో పక్క అత్యవసరంగా హిట్ కావాల్సిన నలుగురు హీరోలు కూడా ఈ ఏప్రిల్ లోనే బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇప్పటికే మజిలీతో మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య ఊహించని హిట్ తో సూపర్ హిట్ అందుకుని, చాలా సంవత్సరాల తరువాత అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నేంతలా చైతు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయాడు, మరి మిగతా ముగ్గురు హీరోల పరిస్థితి ఏమిటి ?

వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది. మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో ‘సాయి ధరమ్ తేజ్’ గురించే. ఇండస్ట్రీలోకి హిట్ మూవీతోనే ఎంట్రీ ఇచ్చి, కొన్ని సినిమాలు వరకు వరుస హిట్లతో దూసుకెళ్లిన తేజ్.. ఆ తరువాత మాత్రం ప్లాప్ ల పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు’ ఇలా చేసిన సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌లే. ఇలా డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో సతమతమౌతున్న సాయి ధరమ్ తేజ్.. ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని ‘చిత్రలహరి’తో ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం మీద బాగానే అంచనాలు ఉన్నాయి. మరి తేజ్ ఈ చిత్రంతోనైనా తన ప్లాప్ ల పరంపరకు బ్రేక్ వేస్తాడేమో చూడాలి.

ఇక తేజ్ తరువాత ఈ నెల మూడో వారంలో ‘జెర్సీ’తో రాబోతున్న మరో హీరో ‘నాని’. ఒకప్పుడు వరుస హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన నాని, గత రెండు సినిమాలు నుండి మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతున్నాడు. మరి స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో నాని విన్ అవుతాడో లేక మళ్లీ సక్సెస్ వెనుకపడిపోతాడో చూడాలి. అయితే ‘జెర్సీ’ ప్రోమోస్ టీజర్ చూస్తుంటే.. మంచి ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తోంది. దాంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై బాగా ఆసక్తి నెలకొంది.

ఇక చివరగా ఈ నెల నాలుగో వారంలో రాబోతున్న మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఏప్రిల్ 25 ను బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ హీరో హీరోయిన్లుగా తేజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’ సినిమా విడుదల కాబోతుంది. ఎప్పటినుంచో ఓ భారీ హిట్ కోసం బాక్సాఫీస్ మీద యుద్ధం చేస్తూ వస్తోన్న బెల్లంకొండకు కనీసం ‘సీత’ అయినా హిట్ ఇస్తోంది అంటారా ?

ఏమైనా మొత్తానికి చాలా కాలంగా హిట్ కోసం బాక్సాఫీస్ వద్ద పడిగాపులు కాస్తూ.. అత్యవసరంగా హిట్ కావాల్సిన ఈ నలుగురు హీరోల్లో చైతన్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. మరి మిగతా హీరోలు అదృష్టం ఎలా ఉందో..? ఎంత వరకు సక్సెస్ అవుతారో..? ఈ ఏప్రిల్ డిసైడ్ చేయనుంది.

సంబంధిత సమాచారం :