దీపావళికైనా పవన్ కరుణిస్తాడా !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 25వ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సినిమా విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అంతకంటే ముందుగా ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడెప్పుడు ఉంటుందా అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్లను దీపావళి కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పటి నుండే సోషల్ మీడియాలో హడావుడి కూడా మొదలైపోయింది. అయితే ఈ విషయంపై నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఇన్నాళ్ల నుండి ఊరిస్తూ వస్తున్న పవన్ ఈసారైనా అభిమానుల్ని కరుణిస్తాడేమో చూడాలి. ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తుండగా బోమన్ ఇరానీ, కుష్బు వంటి సీనియర్ స్టార్ నటులు పలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే చిత్ర టీమ్ ఈ నెల 3వ వారంలో 15 రోజుల షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది.