ఇప్పుడు మన టాలీవుడ్ లో ఓ సినిమా రిలీజ్ అనగానే మన దగ్గర ముందుగా వినిపించే మాట.. “టికెట్ రేట్లు పెంచుతున్నారా? జీవో వచ్చిందా?”. ఈ ఒక్క కారణం వల్లే చాలా పెద్ద సినిమాలు ఓపెనింగ్స్ పరంగా తీవ్రంగా నష్టపోతున్నాయి. కరెక్ట్‌గా రిలీజ్‌కు ముందు రోజు రాత్రి బుకింగ్స్ ఓపెన్ చేస్తే, వీరాభిమానులు తప్ప సాధారణ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు. సరిగ్గా ఇక్కడే హిందీ చిత్రం ‘దురంధర్-2’ మన మేకర్స్‌కు ఓ పెద్ద పాఠం నేర్పుతోంది.
రిలీజ్‌కు ఏకంగా 10 రోజుల ముందే ‘దురంధర్-2’ మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మార్చి 18 సాయంత్రం పడే ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లను అందుబాటులోకి తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రేట్ల పెంపు లేకుండానే బుకింగ్స్ ఓపెన్ చేయడంతో, ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ తో వచ్చిన హైప్ అంతా అడ్వాన్స్ కలెక్షన్ల రూపంలోకి మారుతోంది. ప్రేక్షకులు కూడా ముందుగానే తమ వీకెండ్‌ను ప్లాన్ చేసుకుంటూ ఫాస్ట్‌గా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
‘ది రాజా సాబ్’ చేసిన తప్పు అదేనా?
మన టాలీవుడ్ నిర్మాతలు కూడా ఈ ట్రెండ్‌ను గమనించాలి. సంక్రాంతి రేస్ లో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమానే తీసుకుంటే, కేవలం టికెట్ రేట్ల పెంపు జీవో కోసం చివరి నిమిషం వరకు ఎదురుచూశారు. తీరా ప్రభుత్వ ఆమోదం వచ్చి బుకింగ్స్ ఓపెన్ చేసేసరికి సమయం మించిపోయింది. ముందుగా రావాల్సిన అడ్వాన్స్ బుకింగ్స్ రాబడి భారీగా చేజారింది. హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఎమోషన్‌ను క్యాష్ చేసుకుందామని ఇష్టానుసారం రేట్లు పెంచేస్తూ.. సామాన్య ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారనే విమర్శలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ ముందున్న టార్గెట్
ఇక ఇండస్ట్రీ కళ్లన్నీ మార్చి 19న థియేటర్లలోకి రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) పైనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ‘దురంధర్-2’ లాగా పది రోజుల ముందు కాకపోయినా, కనీసం మూడు రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఈ సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తమ వీకెండ్ ప్లాన్స్ ముందుగానే సెట్ చేసుకుంటారు. క్రేజ్ పీక్స్‌లో ఉన్నప్పుడే బుకింగ్స్ పడిపోతే, మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేయొచ్చు.
చివరి నిమిషం టెన్షన్ల కంటే, ముందస్తు ప్లానింగ్ ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. ఫ్యాన్స్ వీక్‌నెస్‌తో పాటు రేట్ల పెంపు కోసం చూసుకుని మొదటి రోజు ఓపెనింగ్స్ దెబ్బతీసుకోవడం కన్నా, ‘దురంధర్-2’ తరహాలో రెగ్యులర్ ఆడియన్స్‌కు సైతం అందుబాటులో ఉండేలా ముందే టికెట్స్ ఓపెన్ చేయడమే అసలైన బాక్సాఫీస్ ఫార్ములా అని మన ఇండస్ట్రీ పెద్దలు గుర్తించాలి.
