విభిన్న చిత్రాల ద్వారా, విభిన్న పాత్రల ద్వారా దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా నిలిచే నటుడు కమల్ హాసన్. ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ఉత్తమ్ విలన్. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా విడుదల తేదీలు మారిపోగా తాజాగా ఏప్రిల్ 17ను విడుదల తేదీగా ఖరారు చేశారు. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ విషయంలో కమల్‌కు, సెన్సార్ సభ్యులకు చిన్న వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. అందువల్లే సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తున్నట్టు తెలుస్తోంది
ఇక ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, దర్శకుడు లింగుస్వామి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే కమల్ హాసనే సమకూర్చడం విశేషం. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ విభిన్నంగా కనిపిస్తున్నారు.
