విడుదల తేదీ : ఏప్రిల్ 24, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ తదితరులు
దర్శకుడు : సావిన్ ఎస్ఏ
నిర్మాత : విపిన్ దాస్
సంగీతం : ఏ టీమ్
సినిమాటోగ్రఫీ : అఖిల్ లైలాసురన్
ఎడిటర్ : కన్నన్ మోహన్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మలయాళంలో సంచలన విజయం సాధించి, ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ‘వాలా 2’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియా స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యూత్ ఫుల్ డ్రామా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
హషీర్ (హషీర్), అలన్ (అలన్ బిన్ సిరాజ్), వినాయక్ (వినాయక్ వి), మరియు అజిన్ (అజిన్ జాయ్) చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. కాలేజీ రోజుల్లో వీరు చేసే అల్లరి, తీసుకునే కొన్ని నిర్ణయాలు వీరిని ఫ్యామిలీతో పాటు పోలీసుల దృష్టిలో కూడా ‘లూజర్స్’గా నిలబెడతాయి. ఆ ముద్రను చెరిపేసుకోవడానికి, విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని ఈ నలుగురు నిర్ణయించుకుంటారు. మరి ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? తమ గమ్యాన్ని చేరుకున్నారా లేదా? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇందులోని సహజత్వం. ఎక్కడా అతిగా అనిపించకుండా, చాలా గ్రౌండెడ్ గా కథను నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్ లోని తీపి గుర్తులను, చేసే తప్పులను చాలా ఫన్నీగా చూపించారు.
లీడ్ రోల్స్ చేసిన హషీర్, అలన్, వినాయక్, అజిన్ తమ పాత్రల్లో జీవించేశారు. వారి మధ్య కెమిస్ట్రీ సినిమాను నిలబెట్టింది. కొత్త వారైనప్పటికీ ఎక్కడా తడబడకుండా నేచురల్ గా నటించారు.
ఫస్టాఫ్ అంతా హై-ఎనర్జీ కామెడీతో చాలా వేగంగా సాగిపోతుంది. సెకండాఫ్ లో విదేశాల్లో వీరు పడే ఇబ్బందులను నవ్విస్తూనే, ఒక పెయిన్ ని కూడా టచ్ చేశారు. ముగింపులో వచ్చే ఎమోషన్ హార్ట్ టచింగ్ గా ఉంది.
డబ్బింగ్ వెర్షన్ లో మన యూత్ కు కనెక్ట్ అయ్యేలా అనిల్ రావిపూడి రిఫరెన్సులు, ‘జయ జానకి నాయక’ డైలాగులు, క్యాష్ అనుదీప్ ప్రస్తావనలు చేర్చడం విశేషం. ఇవి లోకల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి.
ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ మరియు అల్ఫోన్స్ పుత్రేన్ గెస్ట్ రోల్ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చాయి.
మైనస్ పాయింట్స్ :
ఇది ఒక ‘స్లైస్ ఆఫ్ లైఫ్’ డ్రామా కావడంతో, కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి అక్కడక్కడా బోర్ కొట్టవచ్చు.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కాబట్టి రొమాంటిక్ ట్రాక్స్ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రేమకథలు అంతగా పండలేదు.
తీవ్రమైన జీవిత సమస్యలను కూడా దర్శకుడు సెటైరికల్ గా చూపించారు. అయితే ఇలాంటి సీరియస్ ఇష్యూస్ ని మరీ సింపుల్ గా డీల్ చేశారేమో అని కొందరికి అనిపించవచ్చు. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ, కొన్ని చిన్న పాత్రలకు వాయిస్ సింక్ సరిగ్గా కుదరలేదు.
సాంకేతిక విభాగం:
దర్శకుడు సావిన్ ఎస్ఏ, విపిన్ దాస్ రాసుకున్న కథను తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. కన్నన్ మోహన్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. అఖిల్ లైలాసురన్ విజువల్స్ రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. ఇక ‘ఏ టీమ్’ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా బాగున్నాయి.
తీర్పు:
ఓవరాల్ గా చూసుకుంటే, ‘వాలా 2’ అనేది ప్రతి ఒక్కరూ తమ కాలేజీ రోజులను గుర్తు చేసుకునేలా చేసే ఒక మంచి కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. నేచురల్ పెర్ఫార్మెన్స్, రిలేటబుల్ కామెడీ, మరియు ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడా సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, మీ స్నేహితులతో కలిసి ఈ వీకెండ్ కి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
