‘మిస్టర్’ షెడ్యూల్ పూర్తి చేసిన వరుణ్.. ‘ఫిదా’కు రెడీ!

varun-tej
యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్‌ను చకచకా ప్లాన్ చేసుకుంటూ, ప్రస్తుతం రెండు వరుస సినిమాలను చేసుకుపోతున్నారు. ఇందులో మొదటిదైన శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మిస్టర్’, గత నెల్లోనే మొదలై అప్పుడే విజయవంతంగా స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో పలు కీలకమైన సన్నివేశాలతో పాటు కొన్ని పాటలను కూడా చిత్రీకరించిన టీమ్, తిరిగి హైద్రాబాద్‌కు వచ్చేసింది. ఇక ‘మిస్టర్’ షెడ్యూల్ పూర్తైన మూడు రోజులకే వరుణ్ మరో సినిమా ‘ఫిదా’ షూటింగ్‌కు కూడా సిద్ధమైపోవడం అశ్చర్యకరంగా చెప్పుకోవాలి.

సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించనున్న ‘ఫిదా’ అనే సినిమా షూటింగ్‌ను వరుణ్ ఈనెల 10 నుంచి మొదలుపెడుతున్నారు. వరుణ్ తేజ్ ఓ ఎన్నారైగా నటిస్తోన్న ఈ ప్రేమకథలో ‘ప్రేమమ్‌’తో సౌతిండియాలో సంచలనం సృష్టించిన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక రెండు సినిమాలతో పూర్తిగా బిజీగా మారిపోయానని, ప్రస్తుతం వర్క్‌తో పూర్తిగా ప్రేమలో పడిపోయానని వరుణ్ ఈ సందర్భంగా తెలిపారు. ఫిదా సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు.