మరో నెలరోజులు విశ్రాంతి తప్పదన్న మెగా హీరో!
Published on Oct 24, 2016 3:31 pm IST

varun-tej
యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టి ఆ రెండు సినిమాలనూ ఒకేసారి పూర్తి చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో ఈ రెండు సినిమాల్లో ఒకటైన ‘మిస్టర్’ షూటింగ్‌లో గాయపడ్డప్పటి నుంచీ వరుణ్ తేజ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఓ ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ కాలుకి ఫ్రాక్చర్ అవ్వడంతో వరుణ్ ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇక ప్రస్తుతం ఆయన మెల్లిమెల్లిగా ఇంట్లో నడుస్తూనే ఉన్నా, పూర్తిగా లేచి, నడవడానికి మరో నెలరోజులకు పైనే పడుతుందట.

ఇదే విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా తెలియజేస్తూ మరో నాలుగు వారాలు ఇంటికే పరిమితం కానున్నట్లు తెలిపారు. ఇక వరుణ్ తేజ్‌కు గాయం అవ్వడంతో ప్రస్తుతానికి శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మిస్టర్’, శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ‘ఫిదా’ రెండూ కొన్నాళ్ళపాటు షూటింగ్‌కు బ్రేక్‌నిచ్చేశాయి. మళ్ళీ కోలుకోగానే డిసెంబర్ మొదటి వారం నుంచి వరుణ్ షూటింగ్‌తో బిజీ కానున్నారు.

 
Like us on Facebook