తెలుగు బాక్సాఫీస్ దగ్గర డబ్బింగ్ చిత్రాల జోరు.. !

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. గత వీకెండ్ విడుదలైన సూర్య ‘కరుప్పు’ చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. దాదాపు దశాబ్దం కాలం తర్వాత సూర్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టి, అందరికీ లాభాలు తెచ్చిపెట్టడం విశేషం. మంచి థియేటర్ల కౌంట్‌తో ఈ చిత్రం రెండో వీకెండ్‌లోనూ ఏపీ, తెలంగాణల్లో నిలకడగా రాణిస్తోంది.

ఇక ఈ శుక్రవారం విడుదలైన మోహన్‌లాల్ మోస్ట్ అవైటెడ్ క్రైమ్ డ్రామా ‘దృశ్యం 3’కు కూడా మిశ్రమ స్పందన లభించింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా, కేవలం ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ కారణంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఓపెనింగ్ వీకెండ్ నంబర్స్ చూస్తుంటే, ఈ మలయాళ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ హిట్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా క్రేజీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ఏవీ లేకపోవడంతో, ఆడియన్స్‌కు ఈ రెండు డబ్బింగ్ సినిమాలే ఏకైక ఆప్షన్‌గా మారాయి. అందుకే నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు వీటికే ఓటేస్తున్నారు. జూన్ 4న రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ విడుదలతో టాలీవుడ్ అసలు సీజన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వరుసగా క్రేజీ తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అప్పటివరకు బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ చిత్రాల హవా ఇలాగే కొనసాగేలా ఉంది.

Exit mobile version