విక్టరీ వెంకటేష్‌.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ!

Venkatesh
విక్టరీ వెంకటేష్ సినిమా అంటే కుటుంబమంతా చూడదగ్గ సినిమా అన్న పేరు ఏళ్ళుగా కొనసాగుతూ వస్తోంది. మహిళల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ స్టార్ వరుసగా వారిని మెప్పించే సినిమాలను చేస్తూ విక్టరీ వెంకటేష్‌గా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ‘కలియుగ పాండవులు’ అన్న సినిమాతో 1986లో ఇదే రోజున తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వెంకీ, నేటికి సరిగ్గా కెరీర్‌లో 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. 30 ఏళ్ళు అయినా కూడా తన నటనలో అదే ఈజ్ చూయిస్తూ వెంకీ ఇప్పటికీ దూసుకుపోతూనే ఉన్నారు.

తండ్రి రామానాయుడు సలహా మేరకు సినీ పరిశ్రమకు పరిచయమైన వెంకీ, ఇప్పటివరకూ హీరోగా 70 కి పైగా సినిమాల్లో నటించి తన అభిమానులను పెంచుకుంటూ వెళుతున్నారు. కొద్దికాలంగా ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చిన వెంకీ, గత శుక్రవారం విడుదలైన ‘బాబు బంగారం’ సినిమాతో తన కామెడీ టచ్‌ను మళ్ళీ పరిచయం చేస్తూ అభిమానుల్ని అలరించారు. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన, త్వరలోనే ఆ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వెంకటేష్ తన కెరీర్లో 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్‌లో ఆయన మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.