నయనతారపై పుకార్లను కొట్టిపడేసిన వెంకీ!

9th, August 2016 - 11:21:04 AM

Venkatesh
విక్టరీ వెంకటేష్, ‘భలే భలే మగాడివోయ్‌’తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ‘బాబు బంగారం’ అనే సినిమా ఈ శుక్రవారమే భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. టీజర్‌, ట్రైలర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దానికితోడు టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమోషన్స్‌లో హీరోయిన్ నయనతార మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఇదే విషయాన్ని వెంకటేష్ ముందు ఉంచగా, ఆయన ఈ విషయమై నయనతారపై వస్తోన్న పుకార్లన్నీ కొట్టిపడేస్తూ, “నయనతార ఈ విషయంలో మొదట్నుంచీ క్లియర్‌గా ఉంది. ఆమె ఏ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. మాతో కూడా ఈ విషయాన్ని ముందే చెప్పింది. మళ్ళీ ఈ విషయంలో వివాదం అవసరం లేదనుకుంటా” అని అన్నారు. వెంకటేష్ ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాకు ఆయన స్టైల్ కామెడీయే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందన్న ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా గిబ్రాన్ అందించిన సంగీతం ఇప్పటికే పాపులర్ అయిపోయింది.