అక్షయ్ కుమార్ రోల్ లో నటించనున్న వెంకటేష్ !


‘గురు’ సినిమాతో వైవిధ్యమైన పాత్రలకు, కథలకు తానెప్పుడూ సిద్దమేనని చెప్పిన సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మరో ప్రయోగాత్మక చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారని వినికిడి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన ‘జాలీ ఎల్.ఎల్.బి-2’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో వెంకటేష్ చేస్తారని అంటున్నారు.

అయితే ఈ అంశంపై వెంకటేష్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రిప్ట్ రాస్తారని, అలాగే సినిమా డిసెంబర్ నుండి మొదలవుతుందని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత మటుకు వాస్తవముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని హారిక-హాసిని క్రియేషన్స్ ఎస్. రాధాకృష్ణన్ నిర్మించనున్నారు.