
నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో.. ఎన్టీఆర్ పాత్రను బాలయ్య, ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా రామకృష్ణ స్టూడియోస్ లో నిర్మించిన భారీ సెట్లో జులై 5న ఈ చిత్రం షూటింగ్ మొదలవ్వనుంది. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనడానికి విద్యాబాలన్ ముంబై నుండి హైదరాబాద్ వచ్చారు. ముందుగా క్రిష్ ఆమె సన్నివేశాలనే తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ తరువాత బాలకృష్ణ విద్య బాలన్ మధ్య సాగే భావోద్వేగమైన సన్నివేశాలను ముఖ్యంగా బసవతారకంగారి చివరి రోజుల్లోని సంఘటనలను చిత్రీకరించనున్నారు. అలాగే బసవతారకమ్మగారిని ఎన్టీఆర్ గారు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ చిత్రంలో అదే విషయానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సన్నివేశం కూడా ఉందని సమాచారం. బసవతారకంగారి పాత్రకు విద్యాబాలన్ తన నటనతో నిండుదనం తెస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.