పాకిస్థాన్ కు బంగ్లా షాక్: ‘విలేజ్ క్రికెట్’ తరహాలో వివాదాస్పద రనౌట్..మైదానంలో ముదిరిన వివాదం!

PAK vs BAN

క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, శుక్రవారం పాకిస్థాన్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో చోటుచేసుకున్న ఒక రనౌట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా గల్లీ క్రికెట్ లేదా విలేజ్ క్రికెట్‌లో కనిపించే ఇలాంటి సీన్, అంతర్జాతీయ మ్యాచ్‌లో కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా బంగ్లాదేశ్ వ్యవహరించిందంటూ పాక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అసలేం జరిగింది?

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో ఈ డ్రామా మొదలైంది. మహ్మద్ రిజ్వాన్ ఆడిన బంతిని బౌలర్ మెహిదీ హసన్ మీరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ అలీ అఘా వైపు వెళ్లింది. సల్మాన్ అప్పటికే క్రీజు వెలుపల ఉన్నాడు. అయితే ఆ బంతి ‘డెడ్’ అయిందని భావించిన సల్మాన్, మర్యాదపూర్వకంగా బౌలర్‌కు సహాయం చేయాలనే ఉద్దేశంతో బంతిని తీసి మెహిదీకి అందించబోయాడు. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.

మెహిదీ హసన్ ఆ బంతిని అందుకుని వెంటనే వికెట్లను గిరాటేశాడు. సల్మాన్ క్రీజు బయట ఉండటంతో రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ దీనిని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా, నిబంధనల ప్రకారం బంతి ఇంకా ప్లేలో ఉన్నందున సల్మాన్‌ను అవుట్‌గా ప్రకటించారు. దీంతో సల్మాన్ అలీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. 64 పరుగుల వద్ద ఇలా ఊహించని రీతిలో అవుట్ కావడంతో తన హెల్మెట్ విసిరేసి, బంగ్లా ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు.

ఈ ఘటన వెనుక టీ20 వరల్డ్ కప్ నాటి పాత గొడవలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత వరల్డ్ కప్ సమయంలో కొన్ని విషయాల్లో పాకిస్థాన్ తమకు అన్యాయం చేసిందని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఇప్పుడు ఆ కక్షను ఇలా తీర్చుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సైతం ఈ ఘటనపై స్పందిస్తూ, “ఈ పోరులో స్నేహానికి తావులేదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

సల్మాన్ అవుట్ అయిన తర్వాత పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. ఒక దశలో భారీ స్కోరు చేసేలా కనిపించిన పాక్, చివరికి 274 పరుగులకే పరిమితమైంది. కేవలం 43 పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోవడం పాక్ శిబిరాన్ని ఆందోళనలో పడేసింది. ఈ వివాదం కేవలం ఈ మ్యాచ్‌కే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఇరు జట్ల మధ్య మరింత వేడిని పెంచేలా కనిపిస్తోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version