సమీక్ష : ‘వినరా సోదరా వీరకుమార’ – స్లొగా సాగే లవ్ హర్రర్ డ్రామా

vinara sodara veera kumara movie review

విడుదల తేదీ : మార్చి 22, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శ్రీ‌నివాస్‌ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌ త‌దిత‌రులు.

దర్శకత్వం : స‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌.

నిర్మాత : ల‌క్ష్మ‌ణ్‌ క్యాదారి

సంగీతం : శ్ర‌వ‌ణ్‌ భ‌ర‌ద్వాజ్‌

సినిమాటోగ్రఫర్ : ర‌వి.వి

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వినరా సోదరా వీరకుమార’. లక్ష్మణ్ సినీ విజన్స్ బ్యానర్ లో లక్ష్మణ్ క్యాదారి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రమణ (శ్రీనివాస్ సాయి) ఊర్లో ఆటో నడుపుకుంటూ ఉంటాడు. అయితే ఆ ఊరిలోని ప్రెసిడెంట్ కొడుకుతో గొడవ పడి.. మొత్తానికి కుటుంబంతో సహా వేరే గ్రామానికి వస్తాడు. అక్కడ ఓ ఆత్మతో పరిచయం ఏర్పడుతుంది. మరో పక్క ఎప్పటిలాగే ఆ ఊరిలో కూడా తన ఆటో నడుపుకుంటున్న క్రమంలో సులోచన (ప్రియాంక జైన్)తో చిన్న గొడవ జరుగుతుంది. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిమాణాల అనంతరం సులోచనతోనే రమణ ప్రేమలో పడతాడు. ఆమె వెంటే పడుతూ చివరికీ సులోచన కూడా తనని ప్రేమించేలా చేసుకుంటాడు. ఆ తరువాత కొన్ని అనుకోకుండా జరిగిన సంఘటనలు కారణంగా రమణ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? చివరికి రమణ – సులోచన ఒక్కటయ్యారా ? లేదా ? అలాగే ఆత్మ వల్ల రమణ ఎలా మారాడు ? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ సాయి చక్కగా నటించాడు. తన మొట్టమొదటి సినిమా శుభలేఖలు+లుతో పోలిస్తే.. నటనలో శ్రీనివాస్ సాయి ఎంతో మెరుగయ్యారు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి అంశంలో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక జైన్ చాలా అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగా అలరిస్తాయి.

సినిమాలో హీరోకి తండ్రిగా కనిపించిన ఉత్తేజ్‌, హీరోకి తల్లి పాత్రలో ఝాన్సీ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో బాగా నటించారు. అలాగే తమ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ల‌క్ష్మీభూపాల‌ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడు స‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌ తీసుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. ఆయన రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. మెయిన్ గా.. సెకెండాఫ్ లో కొత్తగా రివీల్ అయ్యే కొన్ని అంశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు స‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌ ఆత్మకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని మలచలేదు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని స‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌ బాగానే ప్రయత్నం చేశారు, కాకపోతే అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సినిమాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమాలోని కొన్ని దృశ్యాలను కెమెరామెన్ ర‌వి.వి చాలా సహజంగా చూపించారు.

ఇక శ్ర‌వ‌ణ్‌ భ‌ర‌ద్వాజ్‌ అందించిన సంగీతం విషయానికి వస్తే.. పాటలు పర్వాలేదనిపస్తాయి. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటర్ బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాత ల‌క్ష్మ‌ణ్‌ క్యాదారి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. అలాగే సినిమా కథాంశం బాగుంది. కానీ కథాకథనాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగవు. దీనికి తోడు సినిమా కూడా కొన్ని చోట్ల సినిమాటిక్ గా సాగుతుంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version