‘వినరో భాగ్యము విష్ణు కథ’ – సాహిత్యానికి పెద్ద పీఠ వేసిన ‘వాసవ సుహాస’ పాటకి అద్భుత స్పందన

Published on Feb 4, 2023 8:00 pm IST

ఒకప్పటితో పోలిస్తే నేటి కాలంలో వస్తున్న సాంగ్స్ చాలావరకు రణగొణ ధ్వనులతో ఎక్కువగా సాహిత్యం అర్ధం కాకుండా మ్యూజిక్ వాటిని డామినేట్ చేస్తోంది అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడక్కడా కొన్ని సినిమాల్లో మాత్రం అద్భుతమైన సంగీతం, ఆకట్టుకునే సాహిత్యంతో సమకూరిన కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ప్రస్తతం యువ నటుడు కిరణ్ ఆబ్బవరం హీరోగా యువ దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ మూవీ లోని వాసవ సుహాస పాట అందరి మదిని తాకుతూ మంచి స్పందన రాబడుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అందరినీ ఆకట్టుకోగా ముఖ్యంగా ఈ క్లాసికల్ మెలోడియస్ సాంగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

దివంగత దిగ్గజ దర్శకులు కె విశ్వనాధ్ గారి సినిమాల్లో మనం చక్కని సంగీతం సాహిత్యాన్ని వింటూ ఆనందించేవారం. సిరివెన్నెల సినిమాలో విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం పాటలోని ‘ప్రాగ్ధిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైన జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన అనే పదాలు అప్పటి ప్రేక్షకులకి గొప్ప అనుభూతిని అందించాయి. అయితే అదే మాదిరిగా వాసవ సుహాస సాంగ్ ని కూడా అలరించే విధంగా కంపోజ్ చేయడంతో పాటు ఆకట్టుకునేలా సాహిత్యాన్ని అందించారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని కళ్యాణ్ చక్రవర్తి రచించగా యువ సింగర్ కారుణ్య దీనిని హృద్యంగా ఆలపించారు. ముఖ్యంగా ఈ పాటలోని ‘యుగ యుగాలుగా ప్రభోధమై పది విధాలుగా పదే పదే పలికేటి సాయమీమన్న జాడలే కదా నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయక ఆగునా నువ్వెళ్ళే దారిన నిను నిన్నుగా మార్చిన నీ నిన్నటి అంచున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా’ అనే పదాలు అనుభూతిని ఇస్తున్నాయి.

కాగా ఈ లిరిక్స్ లో ‘వాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన పది అవతారాలు ఆదర్శమే కదా నీది, అదే కదా నువ్వెళ్ళే దారి అలాంటి నీ దారిలో నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి. ఇప్పటి ఆలోచన నిన్నటి నీ అనుభవం నుండి వచ్చిందే కదా’ అంటూ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషంగా చెప్పుకోవాలి. నిజానికి నేటి కాలంలో ఇటువంటి పాటను సినిమాలో పెట్టడం అనేది సాహసం అని చెప్పొచ్చు. ప్రేక్షకులుకి ఇటువంటివి అర్ధం కాదండి అని దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరికి చెప్పకుండా, ఈ పాటను సినిమాలో పెట్టడానికి ఒప్పుకోవడం కూడా నిర్మాత బన్నీవాసు గొప్పదనం అని చెప్పొచ్చు. వీటన్నిటిని మించి ఈ పాటను కళాతపశ్వి కే విశ్వనాధ్ గారిచే లాంచ్ చేయించడం అభినందించదగ్గ విషయం. ఈ పాటను రిలీజ్ చేసే తరుణంలో కూడా నిర్మాత బన్నీవాసుపై ప్రశంసల జల్లు కురిపించారు విశ్వనాథ్ గారు. ప్రస్తుతం ఈ పాటకి యూట్యూబ్ లో సైతం ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఈ మూవీని ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :