‘రంగస్థలం 1985’ లో మేజర్ హైలైట్ ఏమిటో తెలుసా !


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగస్థలం 1985’ పై ఎంతటి భారీ స్థాయి అంచనాలున్నాయో వేరే చెప్పనక్కర్లేదు. ‘ధృవ’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత చరణ్, సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి ప్రయోగాత్మక చిత్రంగా ఉండనుంది. 80 ల కాలంలో పల్లెటూరి నైపథ్యంలో సాగే ఒక యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది.

దీని కోసం చరణ్ పూర్తిగా తన లుక్ మార్చి పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. అంతేగాక సుకుమార్ సినిమాలో ఖచ్చితత్వం కోసం 1980 ల రోజుల్లో ఉండే వాతావరణాన్నే సినిమా కోసం సృష్టించారు. అందుకోసం ఆర్ట్ డైరెక్టర్ రామ కృష్ణ సారథ్యంలో భారీ వ్యయంతో సెట్టింగ్స్ వేయిస్తున్నారట. ఈ సెట్స్ చూస్తే స్క్రీన్ మీద పాత కాలపు రోజుల్లోని పల్లెటూరి వాతావరణం ఆవిష్కృతమవుతుందని చిత్ర యూనిట్ తో పాటు సినిమాలో కీలక పాత్ర చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి కూడా చెబుతున్నారు.

అంతేగాక అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడానికి చరణ్ అండ్ టీమ్ చాలా కష్టపడుతున్నారట. సూర్యోదయం ముందు షూటింగ్ మొదలుపెట్టి సూర్యాస్తమయం తర్వాతే ప్యాకప్ చెబుతున్నారట. ప్రస్తుతం గోదావరి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్న యూనిట్ ఈ నెలాఖరు తర్వాత హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.