సూపర్ స్టార్ కి విలన్ గా మారనున్న విశాల్ ?


తమిళ పరిశ్రమలో స్టార్ హీరోగా ఉంటూ తెలుగులో సైతం మంచి మార్కెట్ ను సంపాదించుకున్న హీరో విశాల్ త్వరలో మలయాళ పరిశ్రమ మాలీవుడ్ లోకి సైతం ఎంట్రీ ఇవ్వనున్నాడు. అది కూడా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రంతో కావడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ లాల్ తన ఫేస్ బుక్ ద్వారా తెలుపుతూ ‘త్వరలో నేను చేయబోయే చిత్రంలో తమిళ హీరో విశాల్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు’ అన్నారు. ఆ ప్రకటన తరువాత ఈ ముఖ్యపాత్ర సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రే అని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.

పైగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయే దర్శకుడు ఉన్నికృష్ణన్ కూడా విశాల్ చాలా చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. అది కథకు ఎంతో కీలకమైన పాత్ర అంటూ ట్విట్టర్ ద్వారా తెలపడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే విశాల్ నుండి ప్రకటన వెలువడే దాకా వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని ‘లింగ, భజరంగీ భాయిజాన్’ వంటి భారీ సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు.