విశాల్ హీరోగా నటించి, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దివంగత ఆర్.బీ. చౌదరి నిర్మిస్తున్న ఈ 99వ ప్రాజెక్ట్‌లో అంజలి, దుషార విజయన్ కథానాయికలు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని రెండో పాట ‘నచ్చాకే వచ్చేరా’ను చిత్రబృందం ఓ కార్యక్రమంలో విడుదల చేసింది.
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. అక్కినేని నాగార్జున ‘శివ’ సినిమా చూశాకే తాను దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆర్.బీ. చౌదరి తనపై పెట్టుకున్న నమ్మకంతోనే ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నానని, దీని కోసం ఏడాది పాటు పూర్తి సమయం కేటాయించానని చెప్పారు. తాను పనిచేసిన దర్శకుల టెక్నిక్స్‌ను ఇందులో ఉపయోగించానని, ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హీరోయిన్ అంజలి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తానొక బలమైన పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. విశాల్‌తో తనకున్న పదిహేనేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ సినిమాతో ఆయనకు మంచి విజయం దక్కాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నటులు జితన్ రమేష్, అజయ్, ఝాన్సీ, గాయని ప్రభ తదితరులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
