
విలక్షణ మరియు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా సక్సెస్ అయినా కాకపోయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. వర్మ చేస్తున్న సినిమాలు చాలా రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ సినిమాలు చేయడం మాత్రం ఆపడం లేదు. స్టార్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు ఫినిష్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం త్వరలోనే రామ్ గోపాల్ వర్మ మంచు విష్ణు హీరోగా మరో సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి గొలుసు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. చెప్పాలంటే ఈ సినిమాలో రానా నటించాలి కానీ చివరి నిమిషంలో తను పక్కకి తప్పుకోవడం వలన మంచు విష్ణు ఎంటర్ అయినట్టు సమాచారం. గ్యాంగ్ వార్స్ నేపధ్యంలో జరిగే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే మంచు విష్ణు – వర్మ కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. ‘రౌడీ’, ‘అనుక్షణం’ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే గొలుసు సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.