ఇంటర్వ్యూ : నాగ చైతన్య – అఖిల్ ప్రేమ విషయం తెలిసి షాకయ్యాం !

ఇంటర్వ్యూ : నాగ చైతన్య – అఖిల్ ప్రేమ విషయం తెలిసి షాకయ్యాం !

Published on Oct 5, 2016 6:25 PM IST

naga-chaitanya-interview

హీరో అక్కినేని నాగ చైతన్య దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్లో చేసిన తాజా చిత్రం ‘ప్రేమమ్’. విడుదలైన పాటలు, ట్రైలర్లు జనాలకు బాగా కనెక్టవడంతో ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమమ్’ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్బంగా నాగ చైతన్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) చైతుగారు మొదట సినిమా గురించి చెప్తారా ?

జ ) సినిమా చాలా బాగా వచ్చింది. మొదట సినిమా మొదలుపెట్టినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2, 3 నెలల తరువాత జనాలకు సినిమా బాగా కనెక్టయింది. ఒరిజినల్ వెర్షన్ ని మించిపోవాలని, అందులో ఉన్న తప్పుల్ని ఇందులో సరిచేయాలని సినిమా చేయలేదు. ఇది అందరికీ నచ్చే కథ కాబట్టి చేశాను. దానికి దీనికి తేడా ఉంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని కొన్ని మార్పులు చేశాం.

ప్ర) సినిమా రన్ తగ్గించినట్టున్నారు. ఎందుకు ?

జ) అవును రన్ టైమ్ తగ్గించాం. మలయాళీలు పొయటిక్ గా, స్లోగా ఉండే నరేషన్ అంటే ఇష్టపడతారు. కానీ మన వాళ్లకి నరేషన్ కాస్త స్పీడ్ గా ఉండాలి. ఎక్కువ రన్ టైం ఉంటె కష్టం అందుకే తగ్గించాం.

ప్ర) కథలో ఉండే మూడు లవ్ స్టోరీల్లో దేనిలో ఎక్కువ మార్పులు చేశారు ?

జ) స్కూల్ లవ్ లో, కాలేజీ లవ్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మూడో లవ్ స్టోరీలో మాత్రం ఎక్కువ చేంజెస్ చేశాం. మన తెలుగు వాళ్లకి నచ్చేలా ఉండాలనే ఆ ప్రయత్నం.

ప్ర) చందూగారు మీ దగ్గరకి రీమేక్ కథనే ఎందుకు తీసుకొచ్చారు ?
జ) వాస్తవంగా ఇది నా డెసిషన్. అతను డైరెక్ట్ సినిమానే చేయాల్సింది. అతనితో పరిచయమేర్పడిన తరువాత చేసిన 2, 3 నెలల ప్రయాణంలో చాలా డిస్కస్ చేసుకున్నాం. నేనే ఈ టైం లో నాకు ఈ కథ అయితేనే బాగుంటుందని రీమేక్ చేయమన్నాను. త్వరలో అతినితో ఓ డైరెక్ట్ సినిమా చేయాలి.

ప్ర) మీరిక యాక్షన్ సినిమాలని దూరం పెట్టినట్టేనా ?

జ) లేదు. నాకు యాక్షన్ సినిమాలంటేనే ఎక్కువ ఇష్టం. కానీ ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఇంకా నాకు యాక్షన్ సినిమాల్ని చేసే మెచ్యూరిటీ రాలేదని నా నమ్మకం. ఒక రెండు హిట్లు కొట్టాక, నా మీద నాకు నమ్మకం ఏర్పడ్డాక యాక్షన్ సినిమా చేస్తాను.

ప్ర) ఈ సినిమాపై ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ?
జ) ‘మనం’ సినిమా తరువాత నాకు అంత బాగా నచ్చిన సినిమా ఇది. కథ అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. పైగా ప్రేమ కథలు నాకు బాగా యాప్ట్ అవుతాయి. చాలా ఇష్టపడి సినిమా చేశాను. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందనే గట్టి నమ్మకం నాకుంది.

ప్ర) ఒరిజినల్ వెర్షన్ లో హీరో పాత్రను చూసి ఏం నేర్చుకున్నారు ?
జ) ఒరిజినల్ వెర్షన్ లో నవీన్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా అతని యాటిట్యూడ్ సూపర్బ్. నేను కూడా అదే యాటిట్యూడ్ నేర్చుకున్నాను. సినిమా చూసి చాలా హోమ్ వర్క్ చేశాను.

ప్ర) ఇండస్ట్రీలో ఉన్న పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎప్పుడు చేస్తారు ?

జ) నాకు డైరెక్టర్లలో చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. స్క్రిప్ట్ ఇంపార్టెంట్. నన్ను కన్విన్స్ చేసే స్క్రిప్ట్ ఎవరు తెచ్చినా సినిమా చేస్తా. అలాగే ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు ఎవరు వచ్చి కథ చెప్పినా అది బాగుంటే ఖచ్చితంగా సినిమా చేస్తా.

ప్ర) ఇక సమంతను ప్రేమిస్తున్నట్టు ముందుగా ఎవరికి చెప్పారు ?

జ) మా ప్రేమ విషయం ముందు నా ఫ్రెండ్స్ కే తెలుసు. ఆ తరువాత నేనే నాన్నకు చెప్పా. అప్పుడాయన నవ్వుతూ ఈ విషయం నాకు ముందే తెలుసులేరా అన్నారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.

ప్ర) అఖిల్ ప్రేమ సంగతి చెప్పాక ఎలా ఫీలయ్యారు ?

జ) అఖిల్ లవ్ అసలు ఊహించలేదు. చెప్పగానే షాకింగ్ గా ఫీలయ్యాం. కానీ చిన్న వయసే అయినా అంత భాద్యతగా మాకొచ్చి చెప్పడంతో హ్యాపీగా అనిపించింది. నాన్నగారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు.

ప్ర) మరి మీ పెళ్లిళ్లు ఎప్పుడు ?
జ) నా ఎంగేజ్మెంట్, పెళ్లి వచ్చే సంవత్సరమే ఉంటాయి. అఖిల్ ది కూడా అంతే. కానీ నాకన్నా అఖిల్ పెళ్లి ముందు జరుగుతుంది.

ప్ర) సోషల్ మీడియాలో మీ పెళ్లి గురించి అంత చర్చ జరుగుతుంది కదా మీరు త్వరగా రియాక్ట్ కాలేదు ఎందుకు ?

జ) నేను ఒక పాలసీ పెట్టుకున్నాను. అదేమిటంటే సోషల్ మీడియాలో కేవలం సినిమాల గురించే మాట్లాడాలని. అందుకే త్వరగా రియాక్ట్ కాలేదు. నేను చాలా ప్రయివేట్. ఏదన్నా అవసరం ఉంటే తప్ప బయటకి రాను. అందుకే పెద్దగా రియాక్ట్ అవలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు