ఇంటర్వ్యూ : నిర్మాతలు రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ – బాలయ్య లేకుండా సినిమా పూర్తయ్యేది కాదు !

gpsk-producers
నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నిన్నవిడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు జాతి చరిత్రను తెలియజెప్పే చిత్రమని ప్రశంసలు అందుకుంటూ భారీ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. మరి ఈ చిత్ర అనుభవాలను, ఇతర విషయాలను నిర్మాతలు రాజీవ్ రెడ్డి, బిబో శ్రీనివాస్ లు మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) శ్రీనివాస్ గారు చెప్పండి ఈ ప్రయాణం ఎలా సాగింది ?
జ) మా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రాజెక్ట్ మొఅలుపెట్టిన దగ్గరుంచి పూర్తయ్యే వరకు చాలా బాగా జరిగింది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే పేరులోనే ఏదో పవర్ ఉంది. మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాటికవే తొలగిపోయాయి. అందుకే 79 రోజుల్లో సినిమా పూర్తి చేశాం.

ప్ర) 79 రోజుల్లో ఎలా పూర్తి చేశారు ?
జ) మా డైరెక్టర్ క్రిష్ చాలా కష్టపడేవాడు. రాత్రి పగలు చాలా వేగంగా పనిచేసేవాడు. అది చూసి మేము క్రిష్ మరీ ఓవర్ అగ్రెసివ్ గా వెళుతున్నామేమో అన్నాం. కానీ క్రిష్ మాత్రం ఇలానే ఉండాలి. ఇలా చేస్తేనే అనుకున్న టైమ్ కి పని పూర్తవుతుంది అన్నాడు.

ప్ర) బాలకృష్ణగారితో మీ జర్నీ ఎలా సాగింది ?
జ) నాకిప్పటిదాకా బాలకృష్ణగారి దగ్గర దొరికిన అనుభవం ఎక్కడా దొరకలేదు. చాలా మంచి వ్యక్తి. స్టార్ హీరోలా కాకుండా మామూలుగా ఉంటారు. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు సాధారణ ఎకానమీ టికెట్ వేయమనేవారు, హోటల్లో అందరిలాంటి రూమే ఇవ్వమని అడిగేవారు. అలా కాదు సార్ అంటే లేకుంటే రాను అనేవారు. యంగ్ స్టర్స్ ఆయన నుండి చాలా నేర్చుకోవాలి. ఆయన లేకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేదే కాదు. ఉదయం నుండి రాత్రి ఎంత ఆలస్యమైనా సెట్లోనే ఉండేవారు.

ప్ర) రాజీవ్ గారు మొత్తం ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేశారు ?
జ) మొత్తం ఏపీ, తెలంగాణల్లో కలిపి 600 పైగా థియేటర్లలో రిలీజ్ చేశాం. ఇప్పటి వరకూ మంచి రెస్పాన్స్ ఉంది. ఇకపై కూడా అలానే ఉంటే ఇంకొన్ని థియేటర్లు పెంచాలనుకుంటున్నాం.

ప్ర) అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా అనుకున్నారు ?
జ) నేను క్రిష్ ఇండియా వచ్చి 17 ఏళ్లయింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా చేయాలి అని అనుకునేవాళ్లం. ఆ అనుకున్నది ఇప్పటికి జరిగి ఈ సినిమా తీశాం.

ప్ర) మొత్తం మొదటిరోజు ఎంత వసూళ్లు వచ్చాయి ?
జ) మొదటిరోజు ఎంత వచ్చిందో ఇప్పటికీ చూడలేదు. ప్రేక్షకులు, అభిమానుల రెస్పాన్స్ మాత్రమే చూస్తున్నాం. ఎంత వచ్చినా పర్వాలేదు. ఒక మంచి సినిమా తీశాం అనే తృప్తి అయితే మిగిలింది. మాకు నెంబర్ గేమ్ తో పనిలేదు.

ప్ర) ఇంత మంచి సినిమా తీసినందుకు ఎలా ఫీలవుతున్నారు శ్రీనివాస్ గారు ?
జ) చాలా గొప్పగా అనిపిస్తోంది. చరిత్రలోని ఒక గొప్ప మహా యోధుడి గురించి సినిమా తీసి భవిష్యత్ తరాలకు అందించామనే సంతృప్తి ఉంది. ఈ ప్రాజెక్ట్ చేయడం మా అదృష్టం. మాకు మొదటి నుండి సపోర్ట్ గా ఉన్న ప్రేక్షకులకు, మీడియాకు నా కృతజ్ఞతలు.

ప్ర) సినిమా బడ్జెట్ మొత్తం ఎంతైంది ? లాభాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు ?
జ) సినిమా మొత్తం రూ. 55 కోట్లు ఖర్చయింది. ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనే లెక్కలు ఇంకా వేసుకోలేదు. వాటితో పెద్దగా పనిలేదు. గొప్ప చిత్రం తీశామన్న శాటిసిఫ్యాక్షన్ ఉంది చాలు.

ప్ర) బాలకృష్ణ సినిమా కోసం ఎలా కష్టపడ్డారు ?
జ) బాలకృష్ణగారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. సినిమా పట్ల ఆయన డెడికేషన్, సిన్సియారిటీ చాలా బాగుంటాయి. మొర్రాకోలో షూటింగ్ చేసేప్పుడు 12 గంటల పాటు గుర్రంపైనే కూర్చుని షూట్ చేసేవారు. ఆయనుండబట్టే సినిమా ఇంత స్పీడుగా పూర్తయింది.

ప్ర) సాయి మాధవ్ బుర్రాతో పని చేయడం ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. ఆయనకు క్రిష్ కు మంచి రాపో ఉంది. అందుకే అంత మంచి డైలాగులు వచ్చాయి. ఇక సీతారామ శాస్త్రిగారితో పని చేయడం గొప్పగా ఉంది. ఆయన పాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాకు గొప్పతనాన్ని తెచ్చాయి.

ప్ర) రాజీవ్ గారు వీళ్ళతో కలిసి మళ్ళీ ఎలాంటి సినిమా చేస్తారు ?
జ) ఇంకా అనుకోలేదు. కానీ ఒక్కోసారి వాళ్ళను చూస్తే వీళ్ళతో ఎలాంటి సినిమా తీయాలి, అసలేం చేయాలి అనేసందేహాం వస్తుంటుంది. కఏది చేయాలో క్రిష్ చెప్పాలి.