‘ధృవ’ టైటిల్‌లో నెంబర్ ‘8’ కథేంటీ?

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలోని హాట్ టాపిక్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఈ స్థాయి స్టైలిష్ డిఫరెంట్ లుక్‌తో ఇంతకుముందెప్పుడూ కనిపించి ఉండకపోవడంతో ‘ధృవ’ గురించి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ అభిమానుల్లో ఇప్పటికే ఉన్న ఆసక్తిని రెట్టింపుచేసింది. స్టైలిష్ పోలీసాఫీసర్‌గా సినిమాలో చరణ్ ఎలా ఉండనున్నారో ఈ ఫస్ట్‌లుక్‌తో పరిచయం చేశారు.

ఇక ఈ ఫస్ట్‌లుక్‌ను సరిగ్గా గమనిస్తే, అందులో ధృవ టైటిల్‌లో ‘8’ నెంబర్ దాగుండడం చూడొచ్చు. నిన్నట్నుంచీ అభిమానులంతా ఈ నెంబర్ 8 ఏంటని చాలారకాలుగా ఆలోచిస్తూ సమాధానాలు వెతుకుతున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన కేసుపై పనిచేసే ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆ కేసుని డీల్ చేసే అతడి టీమ్‌లో మొత్తం 8 మంది ఉండడం వల్ల ఆ పేరు పెట్టారన్నది ఒక ఆలోచన. అదికాకపోతే ఏ కేసునైతే చరణ్ డీల్ చేస్తారో ఆ కేసుకి, నెంబర్ 8కి ఏదైనా లింక్ ఉండొచ్చన్నది ఇంకో ఆలోచన. ఇవన్నీ అలా ఉంచితే దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న 8వ సినిమా కావడం వల్ల సింబాలిక్‌గా అలా పెట్టారన్నది కూడా వినిపిస్తోంది.

మరి వీటన్నింటిలో ఏది నిజం అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కు రీమేక్‍గా తెరకెక్కుతోంది. కార్పోరేట్ స్థాయి నేరాలను ఎదుర్కొనే ఓ పోలీసాఫీసర్ కథగా, మైండ్ గేమ్ నేపథ్యంలో సినిమా నడుస్తూ ఉంటుంది. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.