ఇంటర్వ్యూ : రానా దగ్గుబాటి – అన్ని పరిశ్రమలతో పోల్చుకుంటేమన తెలుగు ఇండస్ట్రీ చాలా లాభాల్లో ఉంది !

ఇంటర్వ్యూ : రానా దగ్గుబాటి – అన్ని పరిశ్రమలతో పోల్చుకుంటేమన తెలుగు ఇండస్ట్రీ చాలా లాభాల్లో ఉంది !

Published on Aug 1, 2017 4:11 PM IST


‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచస్థాయి గుర్తింపు సంపాదించిన రానా ప్రస్తుతం చేసిన సినిమా ‘నేనేం రాజు నేనే మంత్రి’. ఈ నెల 11న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్బంగా ఆయన వెబ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ట్రైలర్లోనే కథ ఎలా ఉంటుందో చెప్పాం. ఒక డ్రై టౌన్లో హీరో వడ్డీ వ్యాపారం చేసేవాడు. రైతులకి అప్పులిచ్చేవాడు. అతంనికొక భార్య, మామ అంతే. అలాంటి ఒక మనిషి సిన్సియర్ గా ఎదుగుదామనుకునే సమయానికి కొందరు తొక్కేస్తుంటారు. చివరికి అతనే రివర్స్ అయిపోతాడు. ఒక సామాన్య మనిషి క్రైమ్, పవర్, మనీ ఉన్న ప్రపంచనంలోకి వెళితే ఎలా మారిపోతాడు అనేది ఈ సినిమా. ఇందులో జోగేంద్ర ఎదగడం, పడిపోవడం అన్నీ చూపుతాం.

ప్ర) ఇందులో ఎవరైనా పొలిటికల్ లీడర్ ని ఫాలో అయ్యారా ?
జ) లేదు. ఎవర్నీ ఫాలో అవలేదు. ప్రేక్షకుల్ని ఒక నిజమైన, వాస్తవ ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ఈ సినిమా తీశాం. అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు జోగేంద్రలాంటి మనిషి తమ మధ్యలోనే ఉన్నట్టు ఫీలవుతారు.

ప్ర) ఇది రివెంజ్ డ్రామానా ?
జ) రివెంజ్ తో పాటు ప్రేమ కూడా ఉంటుంది. జోగేంద్రకి భార్య రాధ అంటే ఎంతో ఇష్టం. పెళ్లి తర్వాత ఆమె పేరుని తన పేరుకి ముందు పెట్టుకుని రాధాజోగేంద్రగా మారతాడు.

ప్ర) ఈ కథను ఎప్పుడు తయారుచేసుకున్నారు ?
జ) ‘ఘాజి’ పోస్ట్ సీజీ జరిగేప్పుడు, ‘బాహుబలి-2’ షూట్ జరిగేప్పుడు అనుకున్నాం. కానీ అప్పుడు పూర్తి కథగా లేదు. బాహుబలి పూర్తవడానికి ఇంకా టైమ్ ఉందని నెమ్మదిగా చేసుకున్నాం. చాలా మందికి కథ చెప్పి, అందరి సజెషన్స్ తీసుకుని కథను తయారు చేసుకున్నాం. నిజానికి ఈ కథ తయారుచేయడానికి చాలా టైమ్ దొరికింది. ఆ సమయంలో జోగేంద్ర జీవితాన్నే రాసేశాం. కానీ ఇందులో 5 – 6 ఇయర్స్ కథ మాత్రమే చెప్పాం.

ప్ర) ‘లీడర్’ లో అర్జున్ కి ఈ జోగేంద్రకి తేడా ఏంటి ?
జ) లీడర్లో హీరో చాలా మంచివాడు. ఆటను సమాజాన్ని మార్చడానికి ముందుకొస్తాడు. కానీ ఇందులో జోగేంద్ర తనని కష్టపెట్టినవాళ్ళకి ఎదురుతిరిగి రాజకీయాల్లోకి వస్తాడు. ఒక్కొక్కసారి చెడ్డవాడిలా కూడా కనిపిస్తాడు.

ప్ర) తేజాగారికి ముందు చాలా ఫ్లాపులున్నాయ్. అయన కథ చెప్పగానే ఏమనిపించింది ?
జ) నేను అవన్నీ చూడలేదు. ఆయన చెప్పే కథను మాత్రమే చూశాను. ఎవరు ఎప్పుడు ఎలాంటి సినిమా తీయగలరో చెప్పలేం. అన్నిటికన్నా గొప్పది కథ . అందుకే కథను నమ్మాను. ఆయన కూడా చాలా బాగా సినిమా తీశారు.

ప్ర) మల్టీ లాంగ్వేజస్ ఆలోచన ముందే వచ్చిందా ?
జ) నాకు ముందు నుంచి మల్టీ లాంగ్వేజెస్ లో సినిమా చేయాలని ఉంది. అందుకే ఒక మంచి రైటర్ ని పెట్టుకుని డైలాగ్స్ అన్నీ రాయించుకున్నాం. తెలుగు వెర్షన్లో నటులు, తమిళ వెర్షన్లో నటులు వేరు వేరుగా ఉంటారు. ఈ కథలోని సన్నివేశాలు ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నవి కొంచెం దగ్గరగా ఉంటాయి. పైగా తమిళంలో పొలిటికల్ సినిమా వచ్చి చాలా కాలమైంది. నాకిప్పుడు సోలో రిలీజ్ దొరికింది.

ప్ర) పంచెకట్టడం అనే స్టైల్ ముందే అనుకున్నారా ?
జ) సాధారణంగా నెల్లూరు, తమిళనాడు బార్డర్ ఏరియాల్లో ఇలానే ఉంటారు. అందుకే ఈ స్టైల్ ను ఫాలో అవ్వాలి అనుకున్నాం. పైగా తేజాగారు ఎంజీఆర్ కి వీరాఅభిమాని. అందుకే ఆయన సినిమాల్లో కొంచెం ఎంజిఆర్ సినిమాల టచ్ ఉంటుంది. ఒకవేళ ఎంజీఆర్ ఇప్పుడు ఉంటే ప్రస్తుత రాజకీయాల గురించి ఎలా ఆలోచించి ఉండేవారు అనే అంశం మీద ఈ కథ రాశానని తేజ అన్నారు.

ప్ర) చాలా బాలీవుడ్ కంపెనీలు తెలుగులోకి వచ్చి వెళ్లిపోయాయి కారణం ఏంటి ?
జ) అసలు వాళ్ళ అవసరం కూడా మనకు లేదు. వాస్తవంగా అందరికన్నా మనమే లాభాల్లో ఉన్నాం. వాళ్లంతా నష్టాల్లోనే ఉన్నారు. వాళ్ళు సినిమా చేసే పద్దతి మనం చేసే పద్దతి వేరు. డిస్నీ లాంటి పెద్ద సంస్థలే బాలావుడ్లో ఉండలేక వెళ్లిపోయాయి.

ప్ర) ఈ సినిమాకి మీ నాన్నగారితో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) నాన్నగారిది క్లాసిక్ కమర్షియల్ ఫార్మాట్. అందుకే అన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు తీశారు. ఎప్పుడు కథ చేప్పినా ఏదో ఒక డౌట్ రైజ్ చేసేవారు. ఆయన చెప్పిన డౌట్స్ ని నోట్ చేసుకుని తేజాగారు కథను డెవలప్ చేసుకున్నారు. నాకు, నాన్నకు కలిపి నచ్చిన సినిమా ఇది.

ప్ర) వెంకటేష్ గారితో కలిసి తమిల్ సినిమా ‘విక్రమ్ వేదా’ ను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని విన్నాం ?
జ) (నవ్వుతూ) నేను కూడా నెట్లో చూసే ఆ విషయం తెలుసుకున్నాను. మాకైతే ఆలోచనలు లేవు.

ప్ర) సినిమాలు, టీవీ షోలు, స్పోర్ట్స్ అన్నీ చూసుకుంటున్నారు. కష్టంగా అనిపించడంలేదా ?
జ) ఈ సినిమా ఎప్పుడో అనుకుని ఇప్పుడు రిలీజ్ కు వచ్చింది. అలాగే యారి షో కూడా ఎప్పుడో ప్లాన్ చేశాం. అది కూడా ఇప్పుడే జరుగుతోంది. ఇక స్పోర్ట్స్ అంటే మూడేళ్ల నుండి చూస్తున్నాను. అన్నీ ఈ టైంలో ఒకేసారి కుదిరాయి. ఇక నా వరకు ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి.

ప్ర) మీరు చేయబోతున్న హాలీవుడ్ సినిమా గురించి చెప్పండి ?
జ) ఆ పనులు జరుగుతున్నాయి. ఇంకా ఆ ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు