టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ వద్ద ఎదురెదురుగా తలపడటం ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన విషయమే. గతంలో ‘భోళా శంకర్’, ‘జైలర్’ చిత్రాలతో క్లాష్ అయిన ఈ ఇద్దరు లెజెండ్స్.. ఇప్పుడు మళ్లీ రాబోయే దసరా, సంక్రాంతి రేసుల్లో పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే అక్టోబర్ 15న ‘జైలర్ 2’ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించగా, మరోవైపు వాయిదాలు పడుతూ వస్తున్న చిరంజీవి ‘విశ్వంభర’ను అక్టోబర్ 16న దసరా కానుకగా తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ దసరా క్లాష్ మాత్రమే కాకుండా, 2027 సంక్రాంతి బరిలోనూ వీరిద్దరూ పోటీ పడే సూచనలు కనిపిస్తున్నాయి.
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రాన్ని పొంగల్ కానుకగా తేవాలని చూస్తుండగా, బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి చేయనున్న ‘మెగా158’ ప్రాజెక్ట్‌ను కూడా సంక్రాంతికే సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే, బడా సినిమాల విడుదల తేదీలు చివరి నిమిషంలో మారడం సహజమే కాబట్టి, ఈ అరుదైన బాక్సాఫీస్ సమరాల్లో ఏవి చివరి వరకు రేసులో నిలుస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.
