‘స్పైడర్’ జూలై నెలలో అయినా వస్తుందా ?

24th, April 2017 - 01:19:35 PM


ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో మహేష్ – మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘స్పైడర్’ కూడా ఒకటి. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా పై సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. మొదట ఈ చిత్రాన్ని జూన్ 23న తప్పకుండా రిలీజ్ చేస్తామని మురుగదాస్ ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదాపడింది. దీంతో సినిమాకు ప్రస్తుతం ఖచ్చితమైన విడుదల తేదీ దొరకడం కష్టమైంది.

ఎందుకంటే ఈ చిత్రాన్ని తమిళంలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా సేఫ్ డేట్ చూసుకోవాలి. కానీ విజయ్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రాన్ని దీపావళి నాడు రిలీజ్ చేస్తుండగా అజిత్ నూతన చిత్రం ‘వివేగం’ ను ఆగష్టు రెండవ వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా రెండు పెద్ద సినిమాలు ఆగష్టు, అక్టోబర్ కు వస్తుండటంతో మహేష్ చిత్రాన్ని ఆ నెలల్లో కాకుండా వేరే నెలలో రిలీజ్ చేస్తే వసూళ్ల పరంగా బాగుంటుంది.

ఆ ఆలోచన ప్రకారం చూస్తే ‘స్పైడర్’ కు జూలై నెల మాత్రమే అనువైనదిగా కనిపిస్తోంది. పైగా తెలుగులో కూడా జూలై నెలలో పెద్ద సినిమాలేవీ లేవు. కాబట్టి ‘స్పైడర్’ ను ఆ నెలలోనే రిలీజ్ చేయొచ్చు. మరి దర్శక నిర్మాతలు జూలైనే సెలెక్ట్ చేసుకుంటారో లేకపోతే వేరే డేట్ చూసుకుంటారో చూడాలి.