ఇంటర్వ్యూ: కార్తి – మణిరత్నం గారితో పని చేయడం చాలెంజింగా ఉంటుంది !


‘ఆవారా, ఊపిరి’ వంటి సినిమాలతో తెలుగువారికి బాగా పరిచయమైన హీరో కార్తి తాజాగా మణిరత్నంతో చేసిన ‘చెలియా’ సినిమాతో ఈ ఏప్రిల్ 7న మరోసారి మన ముందుకురానున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) మణిరత్నం గారితో మీ జర్నీ గురించి చెప్పండి ?
జ) నా సినిమా జర్నీ ఆయనతోనే మొదలైంది. ఆయన దగ్గర రెండేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. మళ్ళీ పదేళ్ల తర్వాత ఆయన సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది.

ప్ర) సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నాది ఒక ఫైటర్ పైలెట్ పాత్ర. ఎప్పుడూ డ్యూటీ మీదే దృష్టి ఉంచాలి. ప్రతిరోజు సాధన చేయాలి. సినిమా మొత్తం ఒక టఫ్ ఆఫీసర్ గా కనిపిస్తానే తప్ప ఎక్కడా లవర్ బాయ్ లా ఉండను.

ప్ర) ఈ పాత్ర కోసం ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు ?
జ) మణి సర్ క్యారెక్టర్ చెప్పగానే నాకు ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లో అన్నయ్య గుర్తొచ్చాడు. వెళ్లి సలహా అడిగితే ఏముంది వెళ్లి వర్కవుట్స్ చేస్కో అని నవ్వుతూ సలహా ఇచ్చాడు. నేను కూడా అలాగే చేసి పాత్రకు తగ్గట్టు మారడానికి ట్రై చేశాను. షూటింగ్ ముందు ఒక ఆఫీసర్ అనే ఫీల్ రావడానికి ఉదయం మూడుకి లేచి వర్కవుట్స్ చేసేవాడిని. ఇంకా చాలా మంది పైలెట్స్ ని కలిసి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను.

ప్ర)మణిరత్నం గారి నుండి కొత్తగా ఏం నేర్చుకున్నారు ?
జ) ఒక నటుడిగా నేను ఎలాంటి పాత్రనైనా చేయగలననే నిజాన్ని తెలుసుకున్నాను. భిన్నమైన పాత్రల కోసం ఎలా కష్టపడాలి అనేది నేర్చుకున్నాను. ముఖ్యంగా నేను కూడా బరువు తగ్గగలనని తెలుసుకున్నాను(నవ్వుతూ).

ప్ర) సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఒక ఫైటర్ పైలెట్, అప్పుడే డాక్టర్ గా ఉద్యోగంలో చేరిన ఒక అమ్మాయికి మధ్య నడిచే ఒక లవ్ స్టోరీ. అంటే అన్ని లవ్ స్టోరీల్లా సాధారణంగా ఉండదు. ఇదొక ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీ. వెరైటీగా ఉంటుంది. ఇందులో ఎలాంటి వార్ సీన్స్ ఉండవు. నాకు, హీరోయిన్ కు మధ్య ప్రేమ మాత్రమే ఉంటుంది.

ప్ర) మణిరత్నంగారితో పనిచేయడం కష్టంగా అనిపించలేదా ?
జ) అలాంటిదేమీ లేదు. ఆయనతో వర్క్ చాలా గొప్పగా ఉంటుంది. ముఖ్యంగా ఛాలెంజింగా అనిపిస్తుంది. మనల్ని టెస్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆయన తీసిన ఫ్రేమ్స్ నేను ఇప్పటి వరకు చూడలేదు. ఒక ఇంగ్లీష్ సినిమాలో ఉన్నట్లు ఉంటాయి. అలాంటి ఫ్రేమ్స్ లో నేను నటిస్తున్నానని అనుకోగానే చాలా థ్రిల్ అనిపిస్తుంది.

ప్ర) ఈ సినిమాలో ఏ సీన్ కోసం ఎక్కువ కష్టపడ్డారు ?
జ) ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు చేశాం. మణిరత్నం సర్ దేన్నీ ఈజీగా వదిలిపెట్టరు. ఆయనకు కావాల్సింది వచ్చే వరకు చేయమంటారు. అలా చేయమన్నప్పుడు ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవడానికి ట్రై చేస్తాను. అయన మొదటిసారే షాట్ ఒకే అన్నప్పుడు అదొక గొప్ప కాంప్లిమెంట్ లా అనిపిస్తుంది.

ప్ర) మణిరత్నంగారితో పని చేశారు కదా నెక్స్ట్ కొత్త దర్శకులతో కంఫర్ట్ గా వర్క్ చేయగలరా ?
జ) అలాంటి ఇబ్బదులేవీ లేవు. మణిరత్నం సర్ దగ్గర ఉన్నప్పుడు ఆయనకు తగినట్టు చేస్తాను. వేరేవాళ్లతో చేసేప్పుడు వాళ్లకు ఎలా కావాలో అలా చేస్తాను. ఏదైనా కథని బట్టే ఉంటుంది.

ప్ర) మీ నుండి ఆడియన్స్ ఎక్కువగా కొత్తదనం ఆశిస్తారు. వాళ్ళ కోసం ఎలా ఆలోచిస్తారు ?
జ) ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వచ్చాక అందరికీ చేతిలోనే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ దొరుకుతున్నాయి. నా వరకు నేను అలాంటివి కాకుండా డిఫరెంట్ గా, వాళ్లకు నచ్చే విధంగా ఏం ఇవ్వగలను అనే ఆలోచిస్తాను.