ఎన్టీఆర్ సినిమా కోసం ప్రపంచస్థాయి టెక్నీషియన్ !

4th, February 2017 - 11:55:26 PM


వరుసగా రెండు భారీ విజయాల్ని దక్కించుకుని స్టార్ రేస్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తాజాగా బాబీ డైరెక్షన్లో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కళ్యాణ్ రామ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో పనిచేయాలని ఫిక్సయ్యారు. గతంలో ఫోటోగ్రఫీ కోసం ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి భారీ సినిమాలకు పనిచేసిన సికే మురళీధరన్ ను తీసుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా మరో ప్రసిద్ధ టెక్నీషియన్ ను ప్రాజెక్టులోకి తీసుకుని చేయబోతున్న సినిమా ఎంత పెద్దదో అందరికీ సూచనప్రాయంగా తెలియజేశాడు.

ఆ టెక్నీషియనే వాన్స్ హార్ట్వెల్. హాలీవుడ్ లో పేరు మోసిన కృత్రిమ అవయవాల సృష్టికర్త, మేకప్ ఆర్టిస్ట్ అయిన ఈయనకు సుమారు 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఈయన ‘లార్డ్ అఫ్ ది రింగ్స్, లైఫ్ అఫ్ పై, ఐరన్ మాన్, రోబో ‘ వంటి చిత్రాలకు పనిచేశారు. అలాంటి గొప్ప టెక్నీషియన్ ప్రాజెక్టులో ఉండటం నిజంగా సినిమాకి చాలా కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. పైగా ఈ ప్రకటనను బట్టి సినిమాలో ఎన్టీఆర్ పలు గెటప్ లలో కనిపిస్తాడని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వార్తతో ఫిబ్రవరి 13న మొదలుకానున్న ఈ చిత్రంపై ఇప్పటి నుండే భారీస్థాయి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.