రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఏకకాలంలో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ లయన్స్‌గేట్, కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపింది. అయితే ఇతర భాషల వెర్షన్లతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను మాత్రం ఒకేసారి థియేటర్లలో విడుదల చేయలేకపోయారు.
మొదటి వారం పూర్తయ్యే సమయానికి సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోయాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 4న, అంటే రేపు, ఎంపిక చేసిన థియేటర్లలో ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
అసలు సర్ప్రైజ్ ఏంటంటే, ఒరిజినల్ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాలు ఉండగా, ఇంగ్లీష్ కట్‌ను మాత్రం మరింత క్రిస్ప్‌గా ఉండేలా నిడివిని తగ్గించి విడుదల చేస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.
