‘కబాలి’లో రియల్ రజనీని చూస్తారు : పా రంజిత్

Pa-Ranjith
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా ప్రస్తుతం సౌతిండియాలో హాట్ టాపిక్ అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరో మూడు రోజుల్లో థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. మూవీ టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా అందుకు తగ్గట్టుగానే సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ దర్శకుడు పా రంజిత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“గతంలో మీరు తెరకెక్కించిన ‘అట్టకత్తి’, ‘మద్రాస్’.. ఈ రెండు సినిమాలూ వాస్తవికతకు దగ్గరగా, స్టార్ ఇమేజ్‌కు దూరంగా ఉంటాయి. మరి ‘కబాలి’ సినిమాలో రజనీ కాంత్‌ని చూపించారు?” అని అడగ్గా, “రజనీ సార్ రియల్ లైఫ్‌కి, ఆయన్ని మనం తెరపై చూడడానికి చాలా తేడా ఉంటుంది. నేను రియల్ లైఫ్ రజనీని కబాలిలో ఆవిష్కరించా. ఆయన స్టార్ ఇమేజ్ చుట్టూ తిరగడం కంటే ఆ ఇమేజ్‌నే నా కథలోకి తీసుకొచ్చా. రేపు సినిమా చూశాక ప్రేక్షకులూ రజనీలోని ఈ కొత్తదనానికి బాగా కనెక్ట్ అవుతారనుకుంటున్నా.” అని పా రంజిత్ సమాధానమిచ్చారు. కళైపులి థాను నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4000 థియేటర్లలో జూలై 22న విడుదలవుతోంది.