సమీక్ష : ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ – ఈ వర్మ కూడా నిరాశ పరిచాడు. !

A-Shyam-Gopal-Varma-Film_re విడుదల తేదీ : 01 జనవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : రాకేష్ శ్రీనివాస్
నిర్మాత : విజయ కుమార్ రాజు – రాకేష్ శ్రీనివాస్
సంగీతం : మంత్ర ఆనంద్
నటీనటులు : షఫీ, జోయ ఖాన్..


సినిమాలతో ఒక సెన్సేషన్ క్రియేట్ చెయ్యాలన్నా, అలాగే పలు కామెంట్స్ తో వివాదాలు క్రియేట్ చెయ్యాలన్నా స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకే చెందింది. రామ్ గోపాల్ వర్మ రియల్ క్యారెక్టర్ ని స్పూర్తిగా తీసుకొని చేసిన సినిమా ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’. ఛత్రపతి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న షఫీ హీరోగా నటించిన ఈ సినిమా ద్వారా రాకేష్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మరి రామ్ గోపాల్ వర్మని స్పూర్తిగా తీసుకొని చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

ఎవరిమాట వినకుండా తనకి నచ్చినట్టు సినిమాలు తీసే డైరెక్టర్ శ్యామ్ గోపాల్ వర్మ(షఫీ). శ్యామ్ గోపాల్ వర్మ తను తీసిన ‘దెబ్బకు ఠా’ సినిమా ప్రీమియర్ షో ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తున్న టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కిడ్నాప్ చేస్తాడు. అలా కిడ్నాప్ చేసిన శ్యామ్ గోపాల్ వర్మని శ్రీ శైలం అడవుల్లోని ఓ పాడు బడ్డ బంగ్లాలో బందిస్తారు. అసలు శ్యామ్ గోపాల్ వర్మని అలా బంధించింది ఎవరు.? ఆ బంగ్లా నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.? చివరికి తప్పించుకోగలిగాడా.? ఒకవేళ తప్పించుకుంటే తనను అలా బందించి చంపేయాలి అనుకున్నది ఎవరనేది కనుక్కున్నాడా.? అన్నది మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసే తెలుసుకోవాలి..

ప్లస్ పాయింట్స్ :

రామ్ గోపాల్ వర్మ రియల్ లైఫ్ క్యారెక్టర్ పై తీసిన ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ’ సినిమాలో చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ ఒకటి రెండు తప్ప పెద్దగా లేవు. అవే షఫీ పెర్ఫార్మన్స్ మరియు సినిమా స్టార్టింగ్. షఫీ టాలెంట్ ఉన్న యాక్టర్ కావడం వలన ఇచ్చిన పాత్రకి తన వంతు న్యాయం చేసాడు. కొన్ని సీన్స్ లో అలాగే రామ్ గోపాల్ వర్మని బాగానే ఇమిటేట్ చేసాడు. ఇకపోతే చెప్పుకోవాల్సింది సినిమా క్లైమాక్స్ గురించి.. సినిమా ప్రపంచాన్ని చూపిస్తూ సినిమా మొదలవ్వడం బాగుంది. అక్కడి నుంచి కిడ్నాప్ ఎపిసోడ్ వరకూ సినిమా బాగుంటుంది. షఫీని ఒక రూంలో బందించిన కొంచెం సేపటి వరకూ బాగుంటుంది. ఇకపోతే జయప్రకాశ్ రెడ్డి షఫీ నిర్మాతగా కాస్త నవ్విస్తాడు. జోయ ఖాన్ చేసింది ఒక హీరోయిన్ రోల్ ని చెప్పడం కంటే ఒక ఐటమ్ గర్ల్ అని చెప్పవచ్చు. జోయ ఖాన్ ఐటమ్ సాంగ్స్ లో చేసిన అందాల విందు ముందు బెంచ్ వారిని ఆకట్టుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి చలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ముందుగా కథ నుంచి మొదలు పెడితే.. డైరెక్టర్ రాకేష్ శ్రీనివాస్ ఈ మూవీ కోసం ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని పూర్తి కథగా రాసుకునేటప్పటికి అనుకున్న పాయింట్ తేడా కొట్టేసింది. ఇక తెరపైకి వచ్చేసరికి ఏదేదో జరిగి న్యూ ఇయర్ మూవీస్ లిస్టులో ఆడియన్స్ ని నిరుత్సాహపరిచిన సినిమాల లిస్టులో మొదటి సినిమా అయ్యింది. ఇకపోతే ఇది రామ్ గోపాల్ వర్మ రియల్ లైఫ్ ని బేస్ చేసుకొని తీసిన సినిమా కావడంతో తను తీసిన సినిమాల్లోని స్పూఫ్ సీన్స్ మాత్రమే ఇందులో కనపడుతుంటాయి. ఉదాహరణకి సినిమాలో శ్యాం గోపాల్ వర్మ తీసిన టైటిల్స్ లిస్టు ఇస్తా – శివరాం, జాంగ్రీలా, నేను దెయ్యాన్ని, దెబ్బకు ఠా, రక్త దాహం మొదలైన టైటిల్స్.

సినిమా బాగానే వెళ్తున్న టైంలో అసలు అనవసరంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వేసి ఆడియన్స్ కి చిరాకు తెప్పించాడు. చెప్పాలి అంటే కథకి అసలు ఆ సీన్స్ అవసరం లేదు. ఏదో సీనియర్ డైరెక్టర్స్ పై సెటైర్స్ వెయ్యడం కోసమే తీసినట్టు ఉంది. ఇకపోతే చలాకి చంటి కామెడీ ట్రాక్ కూడా చిరాకు తెప్పిస్తుంది. ఒక్క షఫీకి తప్ప మిగతా వారెవరికి సరైన పాత్ర ఉండదు. ఎందుకు వసటారో, ఎందుకు వెళ్తారో ఎవరికీ తెలియదు. అందుకే కథనం బాగా బోర్ కొడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమాలో లాజిక్ అనే మాటే ఉండదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో చెప్పుకోవాలి అంటే కాస్తో కూస్తో బాగుంది సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్. రాహుల్ శ్రీ వత్సావ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇచ్చిన చిన్న చిన్న లొకేషన్స్ చాలా బాగా చూపించాడు. అలాగే మంత్ర ఆనంద్ కంపోజ్ చేసిన పాటలు బాలేకపోయినా చాలా చోట్ల తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాకి హెల్ప్ చేసాడు. వీరిద్దరూ లేకపోతే ఆడియన్స్ సినిమా మధ్యలోనే లేచి వచ్చేస్తారు. ఎడిటింగ్ అనేది అస్సలు బాలేదు . కనీసం ఆయన ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు అయినా ఒకసారి చూసుకొని ఉంటే అసలు ఈ సీన్ కథకి సంబంధం లేదు అయినా ఎందుకు ఇక్కడ పెడుతున్నా అని ఆలోచన వచ్చి ఉండేది. కానీ ఆ ఆలోచన చెయ్యకపోవడంతో ఎడిటింగ్ బిగ్గెస్ట్ మిస్టేక్ అయ్యింది.

కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వం విభాగలను రాకేష్ శ్రీనివాస్ డీల్ చేసాడు. క్లారిటీ ఉన్నప్పుడే ఇన్ని విభాగలను డీల్ చెయ్యాలి అది లేనప్పుడు ఏదో ఒకదాన్నే చూసుకుంటే సరిపోద్ది లేకపోతే ఇలానే మంచి కాన్సెప్ట్ గంగలో కలిసిపోద్ది. ఏ ఒక్క డిపార్ట్ మెంట్ లోనూ డైరెక్టర్ మెచ్యూరిటీ కనిపించలేదు. అందుకే సినిమా కూడా ఫెయిల్యూర్ ప్రోడక్ట్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

రామ్ గోపాల్ వర్మ రియల్ లైఫ్ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని చేసిన ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ’ సినిమా న్యూ ఇయర్ లో వచ్చిన మొదటి ఫెయిల్యూర్ ప్రోడక్ట్ అని చెప్పడంలో ఎలాంటి సంశయమూ లేదు. షఫీ పెర్ఫార్మన్స్ తప్ప బెటర్ గా అనిపిచ్న్హే పాయింట్ ఒకటి కూడా సినిమా లేదు. కేవలం ఒక యాక్టర్ పెర్ఫార్మన్స్ కోసమే సినిమాకి వెళ్ళడం చాలా కష్టం అయిన పని.. కావున ఈ న్యూ ఇయర్ రోజు హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూ చూడటానికి ఈ సినిమాలో ఏమీ లేదు కావున ఈ సినిమాని లైట్ తీస్కొని వేరే ప్లాన్ చేస్కొండి..

123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :