Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
సమీక్ష : అమ్మమ్మగారిల్లు – నెమ్మదిగా సాగిన ఫ్యామిలీ డ్రామా

Ammammagarillu movie review

విడుదల తేదీ : మే 25, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : నాగ శౌర్య , షామిలి ,రావు రమేష్

దర్శకత్వం : సుందర్ సూర్య

నిర్మాత : రాజేష్

సంగీతం : కళ్యాణ రమణ

సినిమాటోగ్రఫర్ : రసూల్ ఎల్లోర్

ఎడిటర్ : జె.పి

‘ఛలో’ సినిమా తరువాత నాగ శౌర్య నుండి  వస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :
తూర్పు గోదావరి జిల్లాలో పీఠాపురం అనే ఊళ్ళో ఓ ఉమ్మడి కుటుంబం లో మొదలవుతుంది ఈ కథ . ఇంటికి పెద్ద కొడుకైన రవి బాబు (రావు రమేష్ )ఆస్థి పంచుకొని సిటీలో స్థిరపడాలి అనుకుంటాడు. అది ఇంట్లో ఎవరికీ నచ్చదు. ఎలాగైనా ఆస్థి పంచుకొని ఇంట్లో నుండి వెళ్లిపోవాలని కుటుంభ సభ్యులతో  గొడవ పడతాడు.

ఇది చూసి తట్టుకోలేక రావు రమేష్ నాన్న(హీరో తాత) చనిపోతాడు. దానితో ఇంట్లో ఉన్న వాళ్లంతా తలో దారి చూసుకుంటారు .తరువాత ఇంట్లో ఒక్కతే ఉంటున్న హీరో గారి అమ్మమ్మ అందరిని మళ్లీ ఎలాగైనా కలపాలని కోరికతో ఉంటుంది. హీరో మరి వాళ్ల అమ్మమ్మగారి కోరికను ఎలా నెరవేర్చాడు అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడాలంటే మొదటగా చెప్పుకోవాల్సింది రావు రమేష్ గురించి. ఆయన తన నటన తో సినిమా మొత్తాన్ని తన భుజాల మీదనే వేసుకున్నారు. తనకు అలవాటైన పాత్ర లో మరోసారి చెలరేగిపోయి ఎమోషనల్ ట్రాక్ లో తీవ్రతను తీసుకొచ్చారు.

ఇక తరువాత చెప్పాల్సింది కమెడియన్ షకలక శంకర్ గురించి. సినిమా ప్రేక్షకులకు కొంత ఇబ్బంది కలిగిస్తోంది అన్నప్పుడల్లా తన కామెడీ తో చాలా వరకు నవ్వించాడు. దర్శకుడు ఈ సినిమాతో డబ్బు కంటే మనుషులే ముఖ్యం అనే మెసేజ్ ను ప్రేక్షకులకు చేరవేసాడు. హీరో నాగ శౌర్య తన నటనలో మంచి పరిణితి కనబర్చగా హీరోయిన్ షామిలి కూడ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించింది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మొదటగా దర్శకుడి గురించి మాట్లాడుకోవాలి. సుందర్ సూర్య రాసుకున్న కథలోనే బలం లేదు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలే వచ్చాయి. ఫస్టాఫ్ వరకు బాగానే నడిచిన సినిమా సెకండాఫ్ కు చేరే సరికి అసలు కనెక్ట్ కాని ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువై ఇబ్బందిపెట్టింది.

సినిమాలోని డైలాగ్స్ బాగానే ఉన్నా అవి హీరో పాటర్ మీద పదే పదే రిపీట్ అవడంతో హీరో పాత్రలో కొత్తదనం లోపించింది. ద్వితీయార్థం కథనంలో అనవసరమైన సన్నివేశాలు తరచూ వస్తూ చికాకు కలిగించాయి.

క్లైమాక్స్ ఎపిసోడ్లో కుటుంబం ఆడే చిన్నపాటి డ్రామా చూసేవారి సహనానికి పరీక్షలా పరిణమించింది.సినిమా ప్రారంభం అయిన పది నిమిషాల తరువాత సినిమా కథంతా తెలిసిపోవడం ప్రేక్షకుల ఊహకు తగ్గటే సినిమా సాగడం వలన సినిమా చూస్తున్నంత సేపు ఎలాంటి థ్రిల్ కలుగదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రాసుకున్న స్టోరీ పాతదే అయినా ఎమోషనల్ సన్నివేశాలని సరిగా రాసుకోవాల్సింది. సినిమాను బాగానే మొదలుపెట్టిన ఆయన ఎమోషనల్ ట్రాక్లోకి ప్రవేసింహలనే ఉత్సాహంతో ప్రధాన పాత్రల మధ్యన అనవసరమైన సన్నివేశాలని ఇరికించి ఇబ్బంది కలిగించారు. వాటి మూలాన ఆయన చెబుదామనుకున్న సందేశం కూడ మరుగునపడిపోయింది.

ఈ చిత్ర కెమెరామెన్ రసూల్ ఎల్లోర్ పనితీరు యావరేజ్ గానే ఉంది. కొన్ని చోట్ల విజువల్స్ సరిగా కుదరలేదు. కళ్యాణ రమణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాలోని రెండు పాటలు చూడటానికి, వినడానికి బాగున్నాయి. ఇక ఈ చిత్ర నిర్మాత రాజేష్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాని కలర్ ఫుల్ గా నిర్మించారు.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం నెమ్మదిగా సాగిన రొటీన్ ఫ్యామిలీ డ్రామా అనొచ్చు. ఫ్యామిలీ అడియన్సును టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా కొన్ని చోట్ల ‘శతమానం భవతి’ చిత్రాన్ని గుర్తుచేసింది. కానీ ప్రేక్షకులను అకట్టుకోవడంలో మాత్రం ఆ చిత్రం మాదిరిగా పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. ఫస్టాఫ్ వరకు బాగానే సాగిన ఈ చిత్రం ద్వితీయార్థంలో బలవంతపు ఎమోషనల్ ట్రాక్స్ తో ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే నెమ్మదిగా సాగే ఈ ఫ్యామిలీ డ్రామాను వారాంతంలో వేరే ఆప్షన్స్ ఏవీ లేనప్పుడు ఒకసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review


సంబంధిత సమాచారం :