సమీక్ష : అసుర – వైవిధ్యభరితమైన యాక్షన్ థ్రిల్లర్!

Asura

విడుదల తేదీ : 5 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : కృష్ణ విజయ్

నిర్మాత : శ్యామ్ దేవభక్తుని

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : నారా రోహిత్, ప్రియాబెనర్జీ..

సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ కొత్త ఐడెంటిటీ ఏర్పరుచుకున్న నారా రోహిత్‍‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసుర’. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుడిని ఏ మేరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

ధర్మ (నారా రోహిత్) ఓ నిజాయితీపరుడైన జైలర్. వృత్తి విషయంలో ఎవరికీ తలొగ్గని, చట్టానికి లోబడి పనిచేసే జైలర్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూంటాడు ధర్మ. ఈ క్రమంలోనే చార్లీ (రవి వర్మ) అనే ఉరిశిక్ష పడిన క్రిమినల్ ధర్మ జైలులోకి వచ్చిపడతాడు. చార్లీ చాలా తెలివైన క్రిమినల్.

జైలు నుంచి తప్పించుకోవడానికి చార్లీ పెద్ద పన్నాగమే పన్నుతాడు. తనకున్న తెలివితో పకడ్బందీగా జైలు నుంచి బయటపడాలన్నది చార్లీ ప్లాన్. ధర్మకు ఈ విషయం ఎలా తెలుస్తుంది? చార్లీ జైలు నుంచి తప్పించుకోకుండా ధర్మ ఏం ప్లాన్ చేశాడు? చివరకు ఏమైంది? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

వైవిధ్యభరితమైన కథ, స్క్రీన్‌ప్లేలను ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. డిఫరెంట్ సినిమాలతో మనల్ని మెప్పిస్తూ వెళుతోన్న నారా రోహిత్, ఈసారి కూడా మరో పకడ్బందీ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆద్యంతం ఆకట్టుకునే కథను అంతే ఆసక్తికరమైన నెరేషన్‌తో తెరకెక్కించడం బాగా ఆకట్టుకుంటుంది. జైలు నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో ఉరికి సంబంధించిన సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్ మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కట్టిపడేస్తుంది.

నారా రోహిత్ ఓ పవర్ఫుల్ జైలర్‌గా చాలా బాగా నటించాడు. అతడి వాయిస్ ఎప్పట్లానే ఈ సినిమాను కూడా మంచి ఎత్తులో నిలబెట్టింది. హీరోయిన్‌గా నటించిన ప్రియా బెనర్జీ ఉన్నది కొద్దిసేపే అయినా ఉన్నంతలో ఫర్వాలేదనిపిస్తుంది. రవివర్మను ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు. చార్లీగా అతడి యాక్టింగ్ సినిమాకు మంచి ఇంటెన్సిటీని తెచ్చిపెట్టింది. నారా రోహిత్, రవి వర్మల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

సినిమా పరంగా చూస్తే.. అద్భుతమైన ఇంటెన్సిటీ ఉన్న సన్నివేశాలతో ఫస్టాఫ్‌ ప్లస్‌పాయింట్‌గా నిలవగా, సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయి.

మైనస్ పాయింట్స్ :

అద్భుతమైన నెరేషన్‌తో సినిమా గ్రిప్పింగ్‌గా సాగిపోయినా, కొన్ని చోట్ల సినిమా బాగా మందగిస్తుంది. ముఖ్యంగా ఒక మంచి ఇంటెన్సిటీ ఉన్న ఫస్టాఫ్ తర్వాత వచ్చే సెకండాఫ్‌లో కొద్దిసేపు సినిమా బాగా స్లో అయిపోతుంది. అదేవిధంగా సెకండాఫ్‌లో సినిమా పేస్ కూడా బాగా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది.

ఇక ముందే చెప్పినట్టు ప్రియా బెనర్జీకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఏదో పాటల కోసం వచ్చిపోయినట్లుగా ఉంది. ఫస్టాఫ్‌లో ఒక అనవసరమైన పాటను కనుక తీసేసి ఉంటే సినిమా మరింత వేగం పెరిగేది. కొన్ని కొన్ని లాజిక్‌లు కూడా చాలా చోట్ల మిస్ అయినట్లు కనిపిస్తుంది. ఇక హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ సినిమా మూడ్‌ను కొంత దెబ్బతీసింది. ఈ తరహా సినిమా మామూలుగా మాస్ కమర్షియల్ సినిమాలను, పూర్తి వినోదభరిత సినిమాలను మాత్రమే ఇష్టపడే వారికి పెద్దగా ఎక్కదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల గురించి చెప్పుకుంటే ముందుగా దర్శకుడు విజయ్ కృష్ణ గురించి చెప్పుకోవాలి. ఒక వైవిధ్యభరితమైన సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచనతో పాటు దాన్ని సినిమాగా మలిచే క్రమంలో అతడి పనితనం అబ్బురపరుస్తుంది. దర్శకుడిగా ఒక మంచి స్క్రిప్ట్‌ను అంతే మంచి సినిమాగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జైలు నేపథ్యం, మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ అద్భుతంగా ఆవిష్కరించాడు. సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఫ్లోను చక్కగా నిర్దేశించింది. డైలాగులు సందర్భానికి తగ్గట్టే కాక అర్థవంతంగానూ ఉన్నాయి. ఎడిటింగ్ బాగుంది. పాటల విషయంలో కొంత జాగ్రత్త వహించి ఉంటే ఇంకా బాగుండేది.

తీర్పు :

వైవిధ్యభరితమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్, సినిమాల ఎంపిక విషయంలో తానెంత డిఫరెంటో ‘అసుర’తో మరోసారి నిరూపించాడు. ఓ వైవిధ్యభరితమైన కథ, అందుకు తగ్గట్టుగానే సరిగ్గా అల్లిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మేజర్ హైలైట్స్. చాలా వేగంగా, బలమైన సన్నివేశాలతో నడిచే ఫస్టాఫ్, క్లైమాక్స్ బాగా ఆకట్టుకునే అంశాలు కాగా, సెకండాఫ్‌లో సాగదీసినట్లు అనిపించే కొన్ని సన్నివేశాలు ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్తదనమున్న సినిమాలు కావాలని బలంగా కోరుకునేవారు, బలమైన సినిమాగా తెరకెక్కిన ఈ వైవిధ్యభరితమైన కథను తప్పకుండా చూడాల్సిందే!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :