సమీక్ష : బకరా – సుత్తి కొట్టించే ఓ డమ్మీ బాంబు కథ..

విడుదల తేదీ : 22 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : సి.ఎస్.ఆర్ కృష్ణన్
నిర్మాత : సి. హెచ్ శివరామకృష్ణ, ఎ. కోటేశ్వర రావు
సంగీతం : రోహిత్ ఆర్. కులకర్ణి
నటీనటులు : శ్రీ హరి, ప్రగతిక, బ్రహ్మానందం ..

రియల్ స్టార్ శ్రీహరి మాఫియా డాన్ గా ముగ్గురు కొత్త కుర్రాళ్ళు ప్రధాన పాత్రలలో, ప్రగతిక ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘బకరా’. డిసెంబర్ కల్లా రావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఈ విడుదల వాయిదా పడి ఈ రోజు విడుదలైంది. సి.హెచ్ శివరామకృష్ణ, ఎ. కోటేశ్వర రావులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ద్వారా ఆర్.కృష్ణన్ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇంతకీ ఈ సినిమాలో ఎవరు ఎవరిని బకరా చేసారు? లేదా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల్ని బకరా చేసారా అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

అనాధలైన రఘుపతి, రాఘవ, రాజారాం కార్పొరేటర్ అయిన యాదవ్ కింద చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు. ఒకరోజు కార్పొరేటర్ ఒకడిని మర్డర్ చేసి ఆ నేరాన్ని వారి ముగ్గురిపై మోపాలనుకుంటాడు. అది తెలుసుకున్న వాళ్ళు కార్పొరేటర్ యాదవ్ ని చంపేసి పారిపోతారు. అలా పారిపోయిన వారు ముగ్గురూ తలా ఓ దిక్కుకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన వాళ్ళలో రఘుపతి రాము గా పేరు మార్చుకొని ముంతాజ్ ఆనే కేఫ్ లో సర్వర్ గా పనిచేస్తూ ఆ షాప్ ఓనర్ కూతురైన ముంతాజ్(ప్రగతిక) తో ప్రేమలో పడతాడు. రాఘవ సలీం గా మారి ముంబైలో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, అలాగే రాజారాం పోలీసు శాఖలో పనిచేసుకుంటూ ఉంటాడు. చాలా కాలం తర్వాత కలిసిన వారికి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య పేరు బాబా భాయ్ – ముంబై కా షేర్.

బాబా భాయ్(శ్రీ హరి) ముంబైలో ఉంటూ లోకల్ మినిస్టర్ వెంకూజి(తనికెళ్ళ భరణి) సాయంతో హైదరాబాద్లో దందాలు, సెటిల్ మెంట్లు, మర్డర్లు చేయిస్తుంటాడు. హైదరాబాద్లో లోకల్ గా ఉన్న అమీర్, బషీర్, వెంకట్రావు లు వెంకూజిని ప్లాన్ చేసి చంపేస్తారు. తన పార్టనర్ ని చంపేసిన వారిని చంపడానికి బాబా భాయ్ హైదరాబాద్ వచ్చి వాళ్ళని చంపేస్తాడు. వాళ్ళని చంపి తన తను భాయ్ గా ఎదిగిన ముంతాజ్ కేఫ్ కి వెళ్తాడు. అక్కడ బాబా భాయ్ కి తన కూర్చున్న కుర్చీ కింద బాంబు ఉందని కదిలితే పేలిపోద్దని ఒక ఫోన్ వస్తుంది. ఆ బాంబు భారి నుండి బాబా భాయ్ బయటపడ్డాడా? లేక బాంబుకి బలైపోయాడా? తన శత్రువులని చంపేసిన తర్వాత కూడా తనకి ఎవరు స్పాట్ పెట్టారు? ఎందుకు పెట్టారు? అనేది ఒక ట్విస్ట్ అయితే, రాఘుపతి, రాఘవ, రాజారంలకి బాబా భాయ్ తో వచ్చిన సమస్య ఏమిటి? దానిని వారు ఎలా పరిష్కరించారు అనేదే సినిమా మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

సినిమా అంతా శ్రీ హరి చుట్టూనే తిరుగుతుంది. సినిమా మొత్తాన్ని శ్రీ హరి ఒక్కడే తన భుజాలపై వేసుకొని నడిపించాడు. నెగటివ్ షేడ్స్, దానికి కాస్త సెంటిమెంట్ కలగలిపిన బాబా భాయ్ పాత్రలో శ్రీహరి నటన బాగుంది. అలాగే శ్రీ హరి గారు ఈ సినిమాలో మరో అడుగు ముందుకేసి డాన్సులు వేసారు అది కూడా ఫేమస్ మైఖేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్(స్టెప్ పై నో కామెంట్స్) వేసారు. తనికెళ్ళ భరణి సినిమాలో ఉన్నది కొద్దిసేపైనా పెన్నుకి కాగితం అంటే లోకువ, ఆడదానికి మగాడంటే లోకువ, అలాగే రంగా ఎందుకురా బెంగ.. అనే మొదలైన రైమింగ్ డైలాగ్స్ తో బాగా ఆకట్టుకున్నారు. అలాగే సినిమాలో బాంబ్ పెట్టి శ్రీహరికి వార్నింగ్ ఇచ్చే పాత్ర పోషించిన నటుడి నటన బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో అనుకున్న స్టొరీ లైన్ ని సరిగ్గా రాసుకోలేదు అలాగే వీక్ స్క్రీన్ ప్లే, ఎఫెక్టివ్ గా లేని డైరెక్షన్ మొదటిగా చెప్పదగిన మైనస్ పాయింట్స్. సినిమా మొదటి అర్ధ భాగంలో తనికెళ్ళ భరణి ఎపిసోడ్ తప్ప మిగతా అంతా చాలా నిధానంగా ఉంటుంది. దానికి తోడు రఘుబాబు, దువ్వాసి మోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ల పాత కాలం మూస కామెడీ ప్రేక్షకుడిని ఇది కూడా ఓ కామెడీనా దీనికి మేము నవ్వాలా అనే అనే అయోమయ స్థితిలో పడేసి చిరాకు తెప్పిస్తుంది. ఇక కథలోని సస్పెన్స్ మొత్తం సెకండాఫ్ లో ఉంటుంది ఆ టైములో ప్రేక్షకుడిని సీట్లో నుంచి కదలనీయకుండా కదిలితే ఏం మిస్సయిపోతామో అన్న ఫీల్ ని కలిగించక పోగా మరీ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది.

సినిమా మొదటి నుంచి చివరి వరకు ఊహాజనితంగా ఉండడం సినిమాకి మరో మైనస్. అలాగే ఓ పక్క శ్రీ హరి బాంబు పై కూర్చొని ఉంటే ఎలా బయట పడాలో ఆలోచించడం మానేసి ఉదయాన్నే నాకు జాతకం చెప్పినవాడు నా లైఫ్ ఈ రోజు గొప్ప మలుపు తిరుగుతోంది అని చెప్పాడు నేనేమో ఇక్కడ సచ్చే పొజిషన్లో ఉన్నాను వాడిని పట్టుకు రండి అని చెప్పి సమయం వృధా చెయ్యడం వెనుక మర్మమేమిటో డైరెక్టర్ కే తెలియాలి. రఘుపతి, రాఘవ, రాజారాంలుగా నటించిన ముగ్గురికీ నటించడానికి పెద్దగా ఆస్కారం లేదు, అలాగే వారి పాత్రలు కథలో ఉన్నాయంటే ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి. హీరోయిన్ పాత్ర చేసిన ప్రగతిక ఓ రెండు సీన్స్, ఓ పాటలో తప్ప మిగతా ఎక్కడా కనిపించదు. వీరి నలుగురి నటన చెప్పుకోదగ్గ విధంగా లేదు. బాగా సస్పెన్స్ గా నడిపించాల్సిన సమయంలో డైరెక్టర్ ఎలా నడిపించాలో తెలియక మధ్యలో బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ, అలీ, కొండవలస ల కామెడీని ఇరికించి ఉన్న ఫ్లోని పూర్తిగా చెడగొట్టాడు.

బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ, అలీ, కొండవలస, రఘుబాబు, దువ్వాసి మోహన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ల కామెడీ సీన్స్ లో ఒక్క కామెడీ సీన్ కూడా నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకుడికి ఉన్న కాస్తో కూస్తో ఒరిజినల్ ఫీల్ ని పూర్తిగా చెడగొడుతుంది. ముంబై కి డాన్ సగం ప్రపంచం అతని పేరు చెబితే బయపడుతుంది. అలాంటి డాన్ కుర్చీ కింద బాంబు పెడితే అతను అతని గ్యాంగ్ తీసుకునే చర్యలు చాలా సిల్లీగా ఉంటాయి. ఎక్కడైనా విలన్/ హీరో ఎంట్రీ భారీగా ఉండి అది పూర్తయిన తర్వాత ఓ ఇంట్రడక్షన్ పాట వస్తుంది కానీ ఈ సినిమా మొదట్లో శ్రీ హరి పేరు చెప్పగానే ఓ ఇంట్రడక్షన్ పాట, ఆ తర్వాత ఇంటర్వల్ బ్లాక్ వరకు అతను కనపడడు ఇందులో ఎంత లాజిక్ ఉందనేది డైరెక్టర్ కె ఎరుక. సినిమానే డెడ్ స్లోగా నడుస్తుందంటే మధ్యలో పాటలు, ఆ పాటల్లో మళ్ళీ ఓ ఐటెం సాంగ్ ఇవన్నీ కథలో భాగంగా రాకుండా ఏదో పాటలు ఉండాలి అని ఇరికించినట్టు ఉంటాయి.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ కృష్ణన్ ఒక్క డైలాగ్స్ విషయంలో కొన్ని చోట్ల పరవాలేదని పించుకున్నా, మిగతా మూడు విభాగాలైన కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో దారుణంగా విఫలమయ్యాడు. నటీనటులను ఉపయోగించుకోవడంలో, వారి నుండి నటనను రాబట్టుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. విజయ శ్రీ సినిమాటోగ్రఫీ ఫస్ట్ హాఫ్ లో అంతంత మాత్రంగా ఉంది, ఇక సెకండాఫ్ మొత్తం ఒకేచోట చోట జరగడంతో సినిమాటోగ్రాఫర్ తన టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నం పెద్దగా చెయ్యలేదు. ఆర్.కె రోహిత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక 10% కూడా సినిమాకి హెల్ప్ అవ్వలేదు. ఎడిటర్ అనిరుద్రా రెడ్డి తన కత్తెరకి పదును పెట్టి సినిమాని వేగవంతం చేయాల్సింది. ప్రొడక్షన్ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

తీర్పు :

థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల్ని ‘బకరా’ చేయడానికి చేసిన ప్రయత్నమే ఈ ‘బకరా’. శ్రీహరి నటన, తనికెళ్ళ భరణి పాత్ర తప్ప ఈ సినిమాలో చూడదగ్గ అంశాలు ఇంకేమీ లేవు. కథ, ఆసక్తికరంగా లేని స్క్రీన్ ప్లే, వీక్ డైరెక్షన్ చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్. బకరా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ సినిమాని చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :