సమీక్ష : ఎవరు..? – ఫర్వాలేదనిపించే హర్రర్ థ్రిల్లర్!

Evaru review

విడుదల తేదీ : ఆగష్టు 26, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : రమణ సాల్వ

నిర్మాత : ముప్పా అంకమ్మ చౌదరి

సంగీతం : యోగేశ్వర్ శర్

నటీనటులు : తారకరత్న, పంచిబోరా..


నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత విలన్‌గా కూడా రాణిస్తూ వస్తోన్న తారకరత్న, తాజాగా ‘ఎవరు?’ అన్న టైటిల్‌తో, ఓ హర్రర్ థ్రిల్లర్‌తో మన ముందుకొచ్చాడు. దర్శకుడు రమణ సాల్వ తెరకెక్కించిన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ హర్రర్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

శేఖర్ (తారకరత్న) ఓ జర్నలిస్ట్. ఎవ్వరికీ అంతుచిక్కని వాటిని చేధించాలని ఎప్పుడూ తపిస్తూ ఉంటాడు. దేవుడు, అదృశ్య శక్తులను నమ్మని అతడికి యామిని (పంచి బోరా) అనే ఓ విచిత్రంగా ప్రవర్తించే వ్యక్తి తారసపడుతుంది. యామిని ఇంట్లో దయ్యాలున్నాయని, ఆమె వెంటపడుతున్నాయని చెబుతూంటుంది. ఇక ఆ ఇంట్లో ఏం ఉందనేది తెలుసుకునేందుకు, శేఖర్ ఆ ఇంటికి మారిపోతాడు. ఆ తర్వాత అతడికి ఎదురైన అనుభవాలేంటి? యామినికి ఎదురయ్యే విచిత్ర పరిస్థితులకు కారణం ఏంటి? చివరకు శేఖర్ ఆ ఇంట్లోని రహస్యాన్ని కనిపెట్టాడా? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

తారకరత్నను ఈ సినిమాకు అన్నివిధాలా మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. తన చుట్టూనే తిరిగే పాత్రలో తారకరత్న మంచి ప్రతిభ కనబరిచాడు. ముఖ్యంగా చాలాచోట్ల సినిమానంతా తన భుజాలపై నడిపించాడనే చెప్పాలి. పంచి బోరా తన పాత్రలో బాగానే నటించింది. నాజర్, సుమన్ తదితరులు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.

సెకండాఫ్‌లో చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలు హర్రర్ నేపథ్యాన్ని జస్టిఫై చేస్తూ వచ్చే ఈ సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. అదేవిధంగా ఫస్టాఫ్‌లో కూడా పలుచోట్ల సినిమా అసలు కథను పరిచయం చేస్తూ వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్‌లో పైన చెప్పిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మినహాయిస్తే సినిమా అంతా మరీ నెమ్మదిగా నడుస్తూంటుంది. ఇక ముందే ఊహించే విధంగా ఈ భాగంలో స్క్రీన్‌ప్లే ఉండడం కూడా మైనస్‌గానే చెప్పుకోవచ్చు. క్లైమాక్స్‌లో ఏమవుతుందో పక్కాగా ముందు నుంచే ఊహించగలిగేలా వచ్చే ఈ సన్నివేశాలు కనీసం భయపెట్టేవిగానూ లేకపోవడం నిరుత్సాహపరచే అంశం.

ఇక పేరుకి హర్రర్ సినిమా అన్న ప్రచారం పొందినా సినిమా మాత్రం ఎక్కువగా సస్పెన్స్ డ్రామాగానే నడిచింది. ఆ సస్పెన్స్ కూడా కట్టిపడేసేలా లేకపోవడం మైనస్. ఇక హీరో మినహా ఏ ఒక్క పాత్రనూ సరిగ్గా రాసుకోలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే ఈ పాత్రలను కూడా మైనస్‌లు‍గా చెప్పుకోవాలి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమా వీక్ అనే చెప్పాలి. ఒక హర్రర్ డ్రామాకు సరిపడా మంచి కథాంశాన్నే ఎంచుకున్న దర్శకుడు, దాన్ని సినిమాగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. ఆయన రాసుకున్న సన్నివేశాలు పూర్తి స్థాయిలో భయపెట్టలేకపోయాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా సాదాసీదాగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు. ఎడిటింగ్ కూడా అంతంతమాత్రమే. ఇక వీఎఫ్‌ఎక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మ్యూజిక్ ఫర్వాలేదనేలా ఉంది.

తీర్పు :

హర్రర్ థ్రిల్లర్ అంటూ వచ్చిన ‘ఎవరు.?’ సినిమా పూర్తి స్థాయిలో భయపెట్టలేకపోవడంతో పాటు థ్రిల్స్ కూడా ఇవ్వలేకపోయింది. ఓ హర్రర్ డ్రామాకు సరిపడే కథతోనే వచ్చిన ఈ సినిమాలో చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలను మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఇకపోతే హర్రర్ సినిమాకు ప్రధానమైన భయపెట్టడం విషయంలో మాత్రం ఈ సినిమా కేవలం ఫర్వాలేదనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా కాక, హర్రర్ థ్రిల్లర్‌గా కాక మధ్యలో ఆగిపోయిన సినిమా ‘ఎవరు?’.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :