సమీక్ష : జిల్ – ‘జిల్’ మనిపించే యాక్షన్ ఎంటర్టైనర్.!

Jil

విడుదల తేదీ : 27 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : రాధా కృష్ణ

నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి

సంగీతం :గిబ్రాన్

నటీనటులు : గోపీచంద్, రాశిఖన్నా,…

‘మిర్చి’, ‘రన్‌ రాజా రన్’ లాంటి రెండు వరుస హిట్ల తర్వాత యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘జిల్’. గోపీచంద్‌ను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసిన ఈ చిత్రం ద్వారా రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. ట్రైలర్, పాటల ద్వారా అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఈరోజు (మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుడికి నిజంగానే జిల్‌ని ఇచ్చిందా ? యూవీ క్రియేషన్స్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా ? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఫైర్ ఆఫీసర్ అయిన జై (గోపీచంద్), ఆపదలో ఉన్నవారిని కాపాడ్డానికి ఎంత సాహసానికైనా వెనుకాడడు. ఆ క్రమంలోనే అతడు హీరోయిన్‌ సావిత్రి (రాశిఖన్నా)ను కలుసుకోవడం, ఆమెతో ప్రేమలో పడడం జరిగిపోతుంది. ఇది కథలో ఒక ట్రాక్. ఇక అసలు కథలోకి వస్తే.. ముంబైలో ఓ పేరుమోసిన మాఫియా డాన్ చోటా నాయక్ (కబీర్) తన అనుచరుడైన రాధాకృష్ణ (బ్రహ్మజీ) చేతిలో మోసపోయి జైలుకు వెళతాడు. జైల్లో నుంచి పారిపోయి వచ్చిన తర్వాత రాధాకృష్ణ కోసం వెతుకుతూంటాడు చోటా నాయక్. ఇదే క్రమంలో రాధాకృష్ణ కొన్ని సార్లు ఆపదలో చిక్కుకోగా.. అతణ్ణి హీరో జై కాపాడతాడు. ఈ క్రమంలో చోటా నాయక్ గ్రూప్ జైని అనుమానిస్తుంది.

ఒక భారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకొని చావు బతుకుల మధ్యనున్న సమయంలో రాధాకృష్ణ, జైకి ఒక విషయం చెప్పాలనుకొని పూర్తిగా చెప్పలేకపోతాడు. తాను వెతుకుతున్న విషయం జైకి తెలిసిపోయిందన్న అనుమానంతో.. చోటానాయక్ జై వెంటపడతాడు. ఇక ఆ తర్వాత జై, చోటానాయక్‌ను ఎలా ఎదుర్కొన్నాడు ? చోటా నాయక్ దేనికోసం వెతుకుతున్నాడు.? రాధాకృష్ణ చెప్పిన విషయాన్ని జై ఎలా చేదిస్తాడు ? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

జిల్ సినిమాకు సెకండాఫ్‌లోని ఎమోషన్‌ను ప్రధాన బలంగా చెప్పుకోవాలి. ఆ ఎమోషనే లేకపోతే సినిమాయే లేదు. ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో వచ్చే కొన్ని కొత్తదనమున్న సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఫ్రెష్‌గా ఉంది. ప్రీ ఇంటర్వెల్‌ సమయంలో వచ్చే కొన్ని జిల్ మూమెంట్స్‌తో ఫస్టాఫ్ పర్వాలేదనేలా సాగిపోతుంది. ఇక సినిమాకి ప్రధానమైన సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాల్లో దర్శకుడు సినిమాపై కొంత పట్టు సాధించాడు. పాటలన్నీ చూడడానికి, వినడానికి బాగున్నాయి. ఒక ఫార్ములా కథను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడం బాగుంది.

ఈ సినిమా ప్రధాన ఆకర్షణల గురించి చెప్పుకోవాలంటే స్టైలిష్ టేకింగ్ గురించి చెప్పుకోవాలి. యాక్షన్ సన్నివేశాల దగ్గరనుంచి లవ్ ట్రాక్, హీరో – విలన్ల మధ్య సన్నివేశాలు అన్నింటినీ చాలా పకడ్బందీగా, స్టైల్‌గా ప్లాన్ చేశారు. గోపీచంద్ తన గత చిత్రాలకు భిన్నంగా, సూపర్ స్టైలిష్‌గా ఈ సినిమాలో కనిపించాడు. ఇంతకుముందెన్నడూ చూడనంత అందంగా గోపీచంద్‌ను ఈ సినిమాలో చూడొచ్చు. ఇక నటన విషయానికి వస్తే.. తనకు అలవాటైన యాక్షన్ సీన్లలో అలవోకగా నటించాడు. రొమాంటిక్ సన్నివేశాల్లో అతన్ని చూడడం కొత్తగా ఉంది. తనకు కొత్తవైన ఇలాంటి సన్నివేశాల్లోనూ గోపీచంద్ ఆకట్టుకున్నాడు. ఇక అందాల భామ రాశిఖన్నా గురించి చెప్పుకోవాలంటే… అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది. సినిమాకి మరో ప్రధాన ఆకర్షణగా విలన్ కబీర్ గురించి చెప్పుకోవాలి. లుక్స్ విషయంలో కానీ, మాఫియా డాన్‌గా అతడు నటించిన విషయంలో కానీ వంక పెట్టలేం. హీరో, విలన్, హీరోయిన్‌ల ఇంట్రడక్షన్ అద్భుతంగా ప్లాన్ చేశారని చెప్పుకోవాలి. ఆ సన్నివేశాలతో వాళ్ళను పరిచయం చేయడమే కాక, ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని కూడా చూపడం ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే.. ఫార్ములా కథ గురించి చెప్పాలి. తెలుగు సినిమాల్లో గత కొన్ని సంవత్సరాలుగా, చాలా సినిమాల్లో చూసిన డాన్ కథనే ఈ సినిమాకూ ఎంచుకున్నారు. మళ్ళీ అదే కథను ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించే క్రమంలో స్క్రీన్‌ప్లే విషయంలో తడబడ్డట్టు కనిపించింది. నిజానికి సినిమాలో చాలా జిల్ మూమెంట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ థ్రిల్లింగ్‌గా చూపడంలో స్క్రీన్‌ప్లే తేలిపోయింది. ఫస్టాఫ్‌లో పాత్రల ఇంట్రడక్షన్ అద్భుతంగా నడిపించి, లవ్ ట్రాక్‌ని కొత్తగా చూపించి, అంతా బాగుందీ అనుకునేంతలో అసలు కథకు తీసుకెళ్ళకుండా కొంతసేపు బోర్ కొట్టించారు. ఇదే ఫీల్ సెకండాఫ్‌లోనూ కలుగుతుంది. సినిమాకి బలమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల తర్వాత వచ్చే సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో కానీ, సెకండాఫ్‌లో కానీ కథతో సమాంతరంగా నడవదగ్గ సబ్‌ప్లాట్స్ ఏవైనా ఉండి ఉంటే సినిమాకి ఉపయోగపడేది.

ఫార్ములా కథల్లో ప్రధానమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో మిస్సైంది. ఫైర్ ఆఫీసర్‌గా పనిచేసే హీరో కర్తవ్య నిర్వహణ నేపథ్యంలో కొంత సినిమాని నడిపి ఉంటే బాగుండేది. సినిమాలో అనవసరమైన సన్నివేశాలకు బదులు పైన చెప్పిన రెండు విషయాల్లో దేన్ని పట్టించుకున్నా బాగుండేది. సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాల తర్వాత సినిమాలో చెప్పడానికి ఏమీ మిగలకపోవడం వలన ఊహాజనితంగా తయారవ్వడమే కాకుండా, క్లైమాక్స్ వరకూ సాగదీయడం తప్ప కొత్తదనం లేదు. క్లైమాక్స్ ఊహించినట్టుగానే ముగిసిపోయింది. క్లైమాక్స్ సన్నివేశాల్లో స్టైల్ ఆకట్టుకున్నా, సాదాసీదాగా ముగిసిందనే చెప్పాలి.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడి గురించి చెప్పుకోవాలంటే.. ఒక సాదాసీదా కథను రెండున్నర గంటల స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి సన్నివేశం నుంచే చాలా సన్నివేశాల్లో అతడి ప్రతిభను చూడొచ్చు. కొత్తదనమున్న కథను ఎంచుకున్నా, కథనాన్నైనా కొత్తగా నడిపించినా.. దర్శకుడి పనితనం ఇంకా బాగుండగలదని ఊహించొచ్చు. మాటలు కూడా స్వయంగా దర్శకుడే రాయడంతో, అనవసర సంభాషణలు కనిపించవు.

సాంకేతిక విభాగాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ గురించే. ప్రతీ సీన్‌లో అతడి ప్రతిభను చూడొచ్చు. గిబ్రాన్ అందించిన ఫీల్ ఉన్న పాటలను అంతే అందంగా తెరపై ఆవిష్కరించాడు. గిబ్రాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుంది. పాటలన్నీ బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమా పేస్‌ను సరిగ్గా నడిపించింది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ సినిమాకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లు పంచే ఫీల్‌ను మిస్సవకుండా జాగ్రత్తగా ఆయన ఎడిటింగ్ చేసినట్లు కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేసిన అనల్ అరసుకి మంచి మార్కులు పడతాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ హై క్లాస్‌గా ఉండి సినిమాను మరింత ఎత్తులో నిలబెట్టాయ్.

తీర్పు :

పెద్దగా కథేమీ లేకున్నా కొత్తగా కనిపించే సన్నివేశాలూ, నటీనటుల పనితీరు, స్టైలిష్ టేకింగ్, అబ్బురపరచే సినిమాటోగ్రఫీ, పాటల కోసం ‘జిల్ ‘ సినిమాను నిరభ్యంతరంగా చూడొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. గోపీచంద్ స్టైలిష్ ప్రెజంటేషన్, రాశి ఖన్నా అందచందాలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ఒక్కమాటలో చెప్పాలంటే.. చాలా జిల్ మూమెంట్స్ ఉన్నా కొంత థ్రిల్‌ను మిస్ చేసిన సినిమా..’జిల్’. అయితే.. థ్రిల్ మిస్ అయినా కంటెంట్‌లోని ఎమోషన్, జిల్ అనిపించే మూమెంట్స్ కోసమైన ‘జిల్’ సినిమాను చూడాల్సిందే.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :