పాటల సమీక్ష : మహర్షి – సందర్భోచితంగా సాగుతాయి !

Maharshi

వంశీ పైడిపల్లి – మహేశ్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా తాజాగా ఈ చిత్రం నుండి ఆల్బమ్ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ లో ‘మహర్షి’ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1. పాట : ఛోటీ ఛోటీ బాతే

ఈ ఆల్బమ్ లో మొదటి పాట ‘ఛోటీ ఛోటీ బాతే’. ఈ పాట విన్న వెంటనే మనకు వెంటనే దేవి శ్రీ ప్రసాద్ మునుపటి ట్యూన్స్ గుర్తుకు వస్తాయి. ఇక సాహిత్యం మాత్రం చాలా సరళంగా అనిపిస్తోంది. కానీ దేవి మ్యూజిక్ లో ఉండే ఆ స్పార్క్ మాత్రం ఈ సాంగ్ లో మిస్ అయింది. అయితే పాట మాత్రం వినసొంపుగా ఉంది, అలాగే ట్యూన్ లో కొన్ని బిట్స్ చాలా ఆసక్తికరంగా అనిపించాయి.
 
2. పాట :ఎవరెస్ట్ అంచున

‘ఎవరెస్ట్ అంచున’ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. డిఎస్పీ ట్యూన్ యావరేజ్ గానే ఉంది. ఒక విధంగా ఆల్బమ్ లో అత్యంత బలహీనమైన పాట ఇదేనేమో అని అనిపిస్తోంది. ఈ పాటను హేమ చంద్ర మరియు విష్ణు ప్రియ పాడారు. మరి వినగానే ఆకట్టుకోలేకపోయిన ఈ పాట బహుశా స్క్రీన్ మీద ఏమైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఆడియో పరంగా అయితే ఈ ఎవరెస్ట్ అంచున పాట ఎవరెస్ట్ స్థాయికి తగ్గట్లు లేదు.

3. పాట : నువ్వే సమస్తం
 
ఈ నువ్వే సమస్తం పాట మాహర్షి ఆల్బమ్ లో మూడవ పాటగా వస్తోంది. ఈ పాటకు దేవిశ్రీ అందించిన ట్యూన్ పర్వాలేదనిపించింది. ఇక శ్రీమణి రాసిన లిరిక్స్ అయితే సాంగ్ కు హైలైట్ గా నిలిచాయి. గెలుపు ఎలా వస్తుంది.. ఓటమి నిన్ను చూసి భయపడాలంటే నీలో ఏముండాలి.. నువ్వు ఎలా ఉండాలి అనే థీమ్ తో సాంగ్ ఉండటం విశేషం. మొత్తానికి ఈ పాట కొంత వరకు అభిమానులను బాగానే అలరించింది.
4. పాట : పాలా పిట్ట
 
ఈ పాలపిట్ట సాంగ్ లో లిరిక్స్ బాగున్నాయి. వలపు నీ పైట మెట్టు పై వాలిందే .. పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే .. తేనె పట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే” అంటూ ఈ పాట బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్ కి, మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా పాట సాగుతుంది. ఇక శ్రీ మణి అందించిన సాహిత్యం చాలా బాగుంది. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, ఎం.ఎం.మానసి ఆలపించారు. స్క్రీన్ పై చూశాక ఈ పాట ఇంకా పెద్ద హిట్ అవుతుంది.

5. పాట : పదరా పదరా
 
‘పదరా పదరా పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా..’ అంటూ సాగే ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. రైతుల నేపథ్యంలో సాగే ఈ పాటలో ‘భళ్లుమంటు నింగి ఒళ్లు విరిగెను గడ్డి పరకతోన.. ఎదలో రోదనకు వరమల్లే దొరికిన ఆశల సాయం నువ్వేరా..’ లాంటి లిరిక్స్ బాగున్నాయి. ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. దేవి శ్రీ ప్రసాద్‌ చక్కని బాణీలు అందించారు.

6. పాట : ఫిర్‌ సే..
 
ఈ ఆల్బమ్ లో చివరి పాట లో ‘ఫిర్‌ సే..’నే. ఇది హార్డ్ హిట్టింగ్ పాట. బెన్నీ డయాల్ పాడారు, దేవి కంపోజ్ చేసిన ట్యూన్ పర్వాలేదనిపిస్తోంది. కానీ కొత్తగా ఏమీ అనిపించదు. అయితే సాహిత్యం మాత్రం చాలా ఉత్తేజకరంగా సాగుతుంది. ఇక ఈ పాట తెర పై ఎలా ఉంటుందో చూడాలి.

తీర్పు:
మొత్తంమీద, మహర్షి ఆల్బమ్ దేవి శ్రీ ప్రసాద్ స్థాయికి తగ్గ ఆల్బమ్ కాదనే చెప్పాలి. సినిమా నేపధ్యానికి తగ్గట్లుగా, సినిమాలోని సందర్భానుసారంగా వచ్చే పరిస్థితులకు తగట్లుగా దేవిశ్రీ ప్రసాద్ పాటలను తీర్చిదిద్దినప్పటికీ.. సూపర్ హిట్ ఆల్బమ్ లిస్ట్ లో మాత్రం మహర్షి ఆల్బమ్ చేరలేకపోయింది. అయితే పాటలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. రెండు పాటలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. పదరా పదరా, ‘ఛోటీ ఛోటీ బాతే’.. మరియు పాలా పిట్ట పాటలు వినగా వినగా బాగా ఎక్కుతాయి. ఇక మహేష్ అభిమానులకు ఈ పాటలు నచ్చినా… మరి సాధారణ ప్రేక్షకులకు ఈ ఆల్బమ్ ఎంతవరకు మెప్పిస్తోందో చూడాలి.

Exit mobile version