సమీక్ష : మిర్చిలాంటి కుర్రాడు – కుర్రాడి సాదాసీదా ప్రేమకథే!

challenge-review

విడుదల తేదీ : 31 జూలై 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : జయ నాగ్

నిర్మాత : రుద్రపాటి రమణారావు

సంగీతం : జె.బి.

నటీనటులు : అభిజిత్, ప్రగ్యా జైస్వాల్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ద్వారా పరిచయమైన హీరో అభిజిత్, ఆ సినిమాలో ఒక మధ్యతరగతి అబ్బాయిగా అందరినీ మెప్పించాడు. ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి సోలో హీరోగా ‘మిర్చిలాంటి కుర్రాడు’తో మన ముందుకు వచ్చాడు అభిజిత్. రుద్రపాటి రమణారావు నిర్మాతగా జై నాగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. మొదటి సినిమాతో సాఫ్ట్ బాయ్‌గా కనిపించిన అభిజిత్, ఈ సినిమాలో కొంచెం రఫ్ టచ్ ఉన్న క్యారెక్టర్ ట్రై చేశాడు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ కమర్షియల్ హీరోగా అభిజిత్ చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా? మిర్చి లాంటి కుర్రాడు ఘాటు చూపించాడా? చూద్దాం..

కథ :

హైద్రాబాద్‌లోని మధురా నగర్‌లో ‘నాన్న హాస్టల్‌’లో ఉంటూ కంప్యూటర్ కోర్స్ చేస్తుంటాడు సిద్ధు (అభిజిత్). ఫ్రెండ్స్‌తో జాలీగా కాలాన్ని వెల్లదీస్తూ గడిపే సిద్ధు, ఒకమ్మాయిని ఎంతో ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటాడు. అయితే అతడికి ఆ అమ్మాయి పేరు కానీ, ఇతర వివరాలు కానీ తెలియవు. అదే సమయంలో అమెరికాలో ఉండే అతడి మేనమామ ఓ అనాథాశ్రమానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తాడు. ఆ క్రమంలోనే సిద్ధూ, సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ ఉండే వసుంధర (పగ్యా జైస్వాల్)ను కలవాల్సి వస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయే ఇలా అనుకోకుండా ఎదురవ్వడంతో అభిజిత్ చాలా సంతోషిస్తాడు.

ఇక అనుకోకుండా కలిసిన వీరిద్దరూ, ఒకరికొకరు నచ్చడం, అతి కొద్దికాలంలోనే ప్రేమ అనే ఫీలింగ్‌లో పడిపోవడం జరిగిపోతాయి. అయితే ఓ చిన్న విషయంలో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వస్తాయి. ఇదే క్రమంలో సిద్ధుతో పాటే కలిసి ఉండే అతడి ఫ్రెండ్స్ కూడా వాళ్ళ గర్ల్‌ఫ్రెండ్స్‌తో గొడవ పడతారు. ఇద్దరి మధ్య గొడవ ఒక గ్రూప్ మధ్య గొడవగా మారి అందరూ తమ తమ ప్రేమకు బ్రేక్ అప్ చెప్పేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ జంటలన్నీ ఎలా కలిశాయి? ఈ క్రమంలోనే వచ్చే ఇబ్బందులను ఎలా ఎదుర్కున్నారు? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అంటే.. రావు రమేష్ ఎపిసోడ్, అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసే సన్నివేశాల గురించి చెప్పుకోవాలి. హీరో కథను పూర్తిగా రెండు గంటల సినిమాగా చెప్పే అవకాశం లేకపోవడంతో అతడి కథతో పాటే మరో రెండు ప్రేమకథలను సమాంతరంగా నడిపారు. ఆ ఉప కథలు ఎలా ఉన్నాయనేది పక్కనపెడితే అందులోనుంచి చాలా వరకు కామెడీని తెప్పించే ప్రయత్నం చేశారు. ఇక హాస్టల్ ఓనర్‌గా అందరిచేతా ‘నాన్న’ అని పిలిపించుకునే రావు రమేష్ ఎపిసోడ్ సినిమాకు ఒక అర్థాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పొచ్చు.

సోలో హీరోగా అభిజిత్ బాగానే మెప్పించాడు. మొదటి సినిమాలో కేవలం సాఫ్ట్ బాయ్‌గా మాత్రమే కనిపించిన అభిజిత్, ఈ సినిమాలో పంచ్ డైలాగులు, డ్యాన్సులు, ఫైట్స్ కూడా చేశాడు. ఒక కమర్షియల్ హీరో అనిపించుకోవడానికి సరిపడా మ్యానరిజమ్స్‌ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చూడటానికి ముచ్చటగా ఉంది. నటన పరంగానూ చాలా వరకు ఆకట్టుకుంది. ఇక జబర్దస్త్‌తో పాపులర్ అయిన శీను, శంకర్‌ ఈ ఇద్దరూ సినిమాకు కామెడీ టైమింగ్ తెచ్చారు. ఇక ఎంతపెద్ద సినిమా అయినా ఎప్పుడూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే రావు రమేష్ ఈ సినిమాలోనూ అదే స్థాయిలో మెప్పించాడు. సప్తగిరి కామెడీ ట్రాక్ ఫర్వాలేదనిపిస్తుంది. సినిమా అంతా అయిపోయిందనుకున్నాక పృధ్వీ కామెడీ సీట్లో కూర్చోబెడుతుంది.

ఇక సినిమా పరంగా చూస్తే.. ఫస్టాఫ్ అన్ని పాత్రలనూ పరిచయం చేస్తూ, ఒక్కో పాత్రకూ ఒక్కో స్టోరీని అల్లుతూ సరదా సరదాగా బాగానే నడిపించారు. ఫస్టాఫ్ ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే.. కథ, కథనాల్లో బలం లేకపోవడమనే చెప్పుకోవాలి. బలం లేకపోయినా కొత్తదనమైనా ఉందీ అంటే అదీ లేదు. ఇంతకుముందు చాలాసార్లు విని ఉన్న పాయింట్‌నే, కథనే, మనకు తెలిసిన ఫార్మాట్‌లోనే చెప్పడంతో కొత్త సినిమా ఒకటి చూస్తున్నామన్న ఫీలింగ్ కలగదు. ఫస్టాఫ్‌లో పాత్రల పరిచయం, ఒక్కో స్టెప్‌లో కథ చెప్పడం కొంత వరకు ఫర్వాలేదు కానీ, సెకండాఫ్‌కి వచ్చేసరికి ఒకే మేజర్ అజెండాను గంటపాటు ఆసక్తికర సంఘటనలేవీ లేకుండా చెప్పడంలోనే బోర్ ఫీలింగ్ వద్దన్నా వచ్చేస్తుంది.

ఇక అమ్మాయి-అబ్బాయి మధ్యన ప్రేమంటే పార్కుల వెంట తిరగడం, డబ్బులు విపరీతంగా ఖర్చుపెట్టిస్తున్నావంటూ అవతల వ్యక్తిని కించపరచడంతో విడిపోవడం.. ఇలాంటి అనవసర అభిప్రాయాలను వ్యక్తపరచడం సినిమా అనే మాధ్యమానికి తగదు. ఇక కొన్ని పాటలు అనవసరంగా రావడమే కాక, అర్థరహితంగానూ ఉన్నాయి. ఒక్క రావు రమేష్ చెప్పే డైలాగ్ తప్ప, అంతకుముందు హీరో జీవితంలోని ఏ ఇతర సంఘటనలూ మార్పు తెచ్చేలా చూపకపోవడం సిల్లీగా కనిపిస్తుంది. ఇక చివర్లో అందరూ కలిసిపోవడమనేది ఫార్ములా సినిమాల్లో సాధారణంగా ఉండేదే! అయితే అక్కడ ఇంకో సెపరేట్ ట్రాక్‌ను ప్రవేశపెట్టి క్లైమాక్స్ అయిందనుకున్నాక కూడా సినిమా మరో పావుగంట పాటు నడవడం అర్థరహితం.

ఇక ఈ సినిమాను లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఇలా అన్ని అంశాల మేళవింపుతో రూపొందించాలన్న ప్రయత్నంలో కొన్ని అనవసరమైన ట్రాక్‌లతో పాటు, కేవలం క్లైమాక్స్ ఫైట్ కోసమే ఓ సెపరేట్ ట్రాక్‌ను సృష్టించడం అనవసరం. ఇక సినిమాలో చాలా చోట్ల లాజిక్ ఎటుపోయిందన్న ఆలోచన తడుతూనే ఉంటుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల గురించి చెప్పుకుంటే.. ముందుగా దర్శకుడు జయ నాగ్ గురించి ప్రస్తావించాలి. కొత్త దర్శకులు ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నా సాధారణంగానే కొత్తదనాన్ని ఆశిస్తాం. అయితే దర్శకుడు అదే పాత కథను అందుకొని, దాన్ని అదే పాత్ర ఫార్మాట్‌లో చెప్పడంతో కథకుడిగా నిరుత్సాహపరిచాడు. దర్శకుడిగా మాత్రం జయ నాగ్ కొన్ని చోట్ల విజయం సాధించాడు. ముఖ్యంగా నాన్న హాస్టల్ నేపథ్యం, రావు రమేష్ బ్లాక్ దర్శకుడిగా ఆయన ప్రతిభను చూపెట్టాయి. అయితే ఓ సినిమాను కనెక్టింగ్ అంశాలతో అందంగా చెప్పే ఆర్ట్‌లో మాత్రం పూర్తిగా ఆకట్టుకోలేకపోయాడు.

సినిమాటోగ్రాఫర్ ఆర్.ఎమ్.స్వామి పనితనం బాగుంది. చిన్న సినిమా అయినా ఆ అంశం సినిమాటోగ్రఫీపై ప్రభావం చూపలేదు. ఎడిటర్ పనితనం బాగుంది. సినిమా కథలో బలం లేకపోయినా ఎడిటర్‌గా ఫర్వాలేదనిపిస్తాడు. వీరబాబు బాసిన రాసిన డైలాగ్స్ బాగున్నాయి. జెబీ అందించిన ఒకటి రెండు పాటలు ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఒకటే బిట్‌ను సినిమా మొత్తం నడిపించి ఫీల్ పోగొట్టారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా మాత్రం సినిమాకు మంచి మార్కులే పడతాయి.

తీర్పు :

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో పరిచయమైన అభిజిత్, ఓ మంచి కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోడానికి చేసిన ప్రయత్నమే ‘మిర్చిలాంటి కుర్రాడు’.
రావు రమేష్ నాన్న హాస్టల్ ఎపిసోడ్, జబర్దస్త్‌లో పాపులర్ అయిన శీను, శంకర్‌ల నవ్వించే ప్రయత్నం, లవ్ నేపథ్యంలో వచ్చే కొన్ని నవ్వు తెప్పించే సన్నివేశాలు ఈ సినిమాకు కలిసివచ్చే అంశాలు. ఇక కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం, సెకండాఫ్ మొత్తాన్నీ ఒకే పాయింట్‌తో చెప్పలేక, చెప్పే అవకాశమూ లేక బోర్ కొట్టించడం, అనవసరమైన ట్రాక్స్ ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒకే పాయింట్, ఒకే చిన్న కథను సినిమాగా చెప్పాలంటే ఆ కథ చుట్టూ అవసరమయ్యే, కథకు ఉపయోగపడే ఉపకథలను ప్రవేశపెట్టడం సాధారణమే! ఈ సినిమాలోనూ అలాంటి ఉపకథలు ఉన్నాయి కానీ, వాటిని కాకుండా సెపరేట్ ట్రాక్ అంటూ వేరే విషయాలపై శ్రద్ధ పెట్టడం, చెప్తున్న పాయింట్ కూడ బలమైనది కాకపోవడంతో సినిమా ఎక్కడో ‘మిర్చిలాంటి కుర్రాడు’ అన్న టైటిల్‌కు దూరంగా ఆగిపోయింది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version