సమీక్ష : నాగభరణం – ‘భరణం’ చెల్లించుకోవడమే..!

14th, October 2016 - 04:15:26 PM
Nagabharanam review

విడుదల తేదీ : అక్టోబర్ 14, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : కోడి రామకృష్ణ

నిర్మాత : సాజిత్ ఖురేషీ, సోహేల్ అన్సారి, ధవల్ గడ

సంగీతం : గురు కిరణ్

నటీనటులు : రమ్య, దిగంత్, విష్ణు వర్ధన్..

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు కోడి రామకృష్ణది ఓ ప్రత్యేకమైన శైలి. తన కెరీర్లో ఎన్నో జానర్స్‌లో సినిమాలు తీసి మెప్పించిన ఆయన, విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలైన ‘అమ్మోరు’, ‘దేవి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్నారు. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేసిన ‘నాగరహవు’ అనే సినిమాను తెలుగులో ‘నాగాభరణం’ అన్న పేరుతో డబ్ అయింది. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

సూర్య గ్రహణం పట్టే రోజున దేవతల శక్తులన్నీ నశిస్తాయన్న విషయాన్ని చెబుతూ సినిమా మొదలవుతుంది. అప్పుడు ఈ భూగోళాన్ని దుష్ట శక్తులేవీ నాశనం చేయకుండా కాపాడేదే ఓ శక్తి కవచం. ఈ శక్తి కవచాన్ని శివయ్య (సాయి కుమార్) వంశం ఏళ్ళుగా కాపాడుతూ ఉంటుంది. అయితే శివయ్య కూతురు నాగమ్మ (రమ్య) శక్తి కవచాన్ని కాపాడే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయి, శక్తి కవచాన్ని కూడా జారవిడుస్తుంది. ఆ తర్వాతి జన్మలో శక్తి కవచాన్ని ఎలాగైనా అదే స్థానంలో ప్రతిష్టింపజేయడానికి నాగమ్మ, మానస (రమ్య)గా పుట్టి శక్తికవచం కోసం పోరాడుతుంది. ఇంతకీ శక్తి కవచం ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఆ శక్తి కవచం మహత్యం ఏంటి? దాన్ని చేజక్కించుకోవడానికి ఎవరెవరు ఏయే పన్నాగాలు పన్నుతుంటారు? చివరకు మానస శక్తి కవచాన్ని దక్కించుకుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా విజువల్ ఎఫెక్ట్స్‌ను ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్‌లో దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. ఈ పార్ట్‌లో విజువల్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఇక ఎక్కువగా తనపైనే నడిచే సినిమాలో రమ్య నటన చాలా బాగుంది. సాయికుమార్ సంస్థానం నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఓ యాక్షన్ సీన్ బాగానే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను ఉన్నంతలో ప్లస్‌పాయింట్‌గా చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

ఒక చిన్న పాయింట్ మినహాయిస్తే, బలమైన కథంటూ లేకపోవడం, దానికి ఆకట్టుకునే కథనమైనా లేకపోవడం ఈ సినిమాకు అన్నింటికంటే అతిపెద్ద మైనస్‌గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఎప్పుడు ఏ సన్నివేశం వస్తుందో కూడా తెలియని అయోమయంలో పడేసి విసుగు తెప్పించేలా నడిచింది. పోనీ సెకండాఫ్‍లో కథ మొదలయ్యాక కూడా సినిమాలో అక్కడక్కడా ఫర్వాలేదనిపించే సన్నివేశాలొచ్చినా, అప్పటికీ సినిమా విసుగు తెప్పిస్తూనే నడిచింది.

ఇక రమ్య పాత్రను పక్కనబెడితే మిగతా ప్రధాన పాత్రలన్నీ ఓవర్‌గానే ఉన్నాయి. వాటికి ఓవర్ యాక్టింగ్ కూడా తోడై సినిమా స్థాయిని మరింత దిగజార్చి పడేశాయి. ముఖ్యంగా విలన్ పాత్రలో అసలు బలం లేకపోగా, ఓవర్ యాక్టింగ్ వల్ల అది జోకర్ పాత్రలా మారిపోయింది. శక్తి కవచం అంటూ దుష్టులంతా దాన్ని వెంటబడడం అనే అంశంపై ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా ఇదే అంశంతో వచ్చి కొత్త విషయమేదీ చెప్పకపోగా చాలా చోట్ల బోర్ కొట్టించింది. పాటలు ఎందుకు వస్తాయో అర్థం కానంత విచిత్రంగా ఉన్నాయి. సినిమా అంతా లౌడ్‌గా, ఎక్కడా బలమైన ఎమోషన్ లేకుండా నడవడం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌దే బలమైన పాత్ర. ఇంటర్వెల్ అప్పుడు ఒక పెద్ద పామును వీఎఫ్‌ఎక్స్‌లో సృష్టించిన విధానం, క్లైమాక్స్‌లో చనిపోయిన ఒక సూపర్ స్టార్‌ను విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా ఆవిష్కరించడం లాంటివి టెక్నికల్‌గా సినిమాకు ఒక స్థాయి తెచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలన్నీ తలనొప్పి తెచ్చేలా ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఏమాత్రం బాగోలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

దర్శక, రచయిత కోడి రామకృష్ణ విషయానికి వస్తే, ఒక్క విజువల్ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్ చేయాలన్న ఆలోచన, చిన్న పాయింట్ తప్పితే ఒక బలమైన కథంటూ లేని సినిమా తీశారాయన. ఎమోషన్స్ విషయంలో కోడి రామకృష్ణ సినిమాలు ఎక్కడా తగ్గవు. ఈ సినిమాలో అసలు ఎమోషన్ అన్నదే లేదు. ఇటు రైటింగ్ పరంగా, అటు దర్శకుడిగా రామకృష్ణ ఫెయిలయ్యారనే చెప్పుకోవాలి.

తీర్పు :

విజువల్ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్ చేస్తే ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయి సినిమా చూస్తారన్నది నిజమే! అయితే ఆ విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటుగా మ్యాజిక్ చేయడానికి ఒక బలమైన కథ, కథనం, ఎమోషన్ ఉండాలన్నది మర్చిపోకూడదు. సరిగ్గా ఇదే విషయాన్ని మర్చిపోయే కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌తో మ్యాజిక్ చేయాలని వచ్చిన సినిమా ‘నాగభరణం’. ఒక్క ఈ విజువల్ ఎఫెక్ట్స్ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదీ సినిమాలో. చివరగా, బలమైన ఎమోషన్, కథ తప్ప మరింకేవీ సినిమాను ముందుకు నడపలేవన్న ఆలోచనను మరింత బలపరిచే సినిమా, ‘నాగభరణం’.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review