సమీక్ష : నవ మన్మథుడు – కొత్త ఎమోషనే కానీ.. రొటీన్ కథ!

సమీక్ష : నవ మన్మథుడు – కొత్త ఎమోషనే కానీ.. రొటీన్ కథ!

Published on Dec 19, 2015 11:30 PM IST
Nava Manmadhudu telugu review

విడుదల తేదీ : 17 డిసెంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఆర్. వేల్‌రాజ్

నిర్మాత : ఎన్.వెంకటేష్, ఎన్. రవికాంత్‌

సంగీతం : అనిరుధ్

నటీనటులు : ధనుష్, సమంత, అమీ జాక్సన్


‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా ‘నవ మన్మథుడు’ అనే సినిమాతో మరోసారి అలరించేందుకు థియేటర్లలో వాలిపోయారు. ‘తంగమాగన్’ పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమాను ఎన్.వెంకటేష్, ఎన్. రవికాంత్‌లు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించగా ‘రఘువరన్ బీటెక్’ దర్శకుడు వేల్‌రాజ్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ కనిపించింది. మరి ఆ క్రేజ్‌కు తగ్గట్టుగా సినిమా ఉందా? ధనుష్ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించగలిగాడా? చూద్దాం..

కథ :

భరత్ (ధనుష్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాధారణ కుర్రాడు. ఉన్నంతలో సాఫీగా గడిచిపోయే కుటుంబంలో పుట్టిన భరత్, కుర్రతనంలో హేమ (ఎమీ జాక్సన్)ను ప్రేమిస్తాడు. సంవత్సరం పాటు ఎంతో హుషారుగా నడిచిన వీరి ప్రేమకథకు ఓ గొడవతో బ్రేక్ పడిపోతుంది. దీంతో కొన్నాళ్ళ పాటు ఎటూ తెలియని రోజులను గడిపిన భరత్, ఆ ఫీలింగ్ నుంచి బయటకొచ్చి ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో తన తండ్రి చూపించిన ఓ ఉద్యోగంలో జాయినై, ఆ తర్వాత యమున (సమంత)ను పెళ్ళి చేసుకొని మళ్ళీ కొత్త జీవితానికి స్వాగతం పలుకుతాడు.

అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న సమయంలోనే భరత్ తండ్రి అనుకోని చిక్కుల్లో పడి, వాటి నుండి బయటపడే దారి కనిపించక ఆత్మహత్య చేసుకుంటాడు. భరత్.. తన తండ్రి ఏ పరిస్థితుల వల్ల చిక్కుల్లో పడ్డాడు? ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన ఆ పరిస్థితుల వెనుక కథేంటి? తన కుటుంబాన్ని చక్కపెట్టేందుకు భరత్ ఎలా పోరాడాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ!

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే ధనుష్-అమీ జాక్సన్‌ల ప్రేమకథ, ధనుష్-సమంతల వివాహ బంధం.. ఇలా రెండు కథలను ప్రధాన కథకు కలుపుతూ, ఆ రెండు కథల్లోని ఎమోషన్‌ను అద్భుతంగా పండించిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో ఈ రెండు కథల్లో వచ్చే క్యూట్ రొమాన్స్ స్క్రీన్‌పై కలర్‌ఫుల్‌గా ఉంది. ప్రేమకథల్లో ఎప్పటికప్పుడు కొత్త ఎమోషన్ అనేది ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఎమోషన్స్‌ను పట్టుకొని దర్శకుడు చేసిన మ్యాజిక్ సినిమాకే హైలైట్. ఇకపోతే కుటుంబ బంధాలు, పెళ్ళి అనే బంధంలో భార్యా భర్తలు ఒకరికొకరు అండగా నిలబడడం లాంటి అంశాలను కథలో బాగా జొప్పించారు.

ధనుష్ తనదైన యాక్టింగ్‌తో కట్టిపడేశాడు. ఓ కుర్రాడిగా, కుటుంబాన్ని చక్కబెట్టే బాధ్యత గల వ్యక్తిగా ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ధనుష్ ఒదిగిపోయి నటించాడు. ఒక మధ్య తరగతి గృహిణిగా నటించిన సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే! పాత్రకు తగ్గ రీతిలో ప్రవర్తిస్తూ, నటిస్తూ చాలా బాగా చేసింది. అమీ జాక్సన్ ఈతరం యువతిగా, ఇల్లాలుగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా నటించింది. ఇక ధనుష్ తండ్రిగా నటించిన ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్, తల్లిగా నటించిన రాధిక, ఓ కీలక పాత్రలో నటించిన హీరో అదిత్ ఇలా అందరూ తమ పరిధిమేర నటించి సినిమాకు క్యాస్టింగ్ పరంగా సూపర్బ్ సపోర్ట్ ఇచ్చారు.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌లోని రొమాన్స్, కామెడీలను మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్‌లో కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మనం చాలాకాలంగా ఫ్యామిలీ డ్రామా అంటే ఇలాగే ఉండాలీ అన్నట్టుగా చూస్తూ వచ్చిన ఎన్నో సినిమాల్లాగే ఈ సినిమా కూడా ఓ ఫార్ములా కథతో, ఫార్ములా స్క్రీన్‌ప్లేతో రావడం ప్రధానంగా కనిపించే మైనస్. రెండు ఉపకథలను ఈ ఫార్ములా కథను కలిపి బాగానే చెప్పే ప్రయత్నం చేసినా, ప్రధానంగా మాత్రం మేజర్ కథ తేలిపోయినట్లు కనిపిస్తుంది. ఇకపోతే ఎంతో ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా నడిచే ఫస్టాఫ్ తర్వాత సినిమా పూర్తిగా నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ ఏంటో కూడా ముందే అర్థమైపోవడంతో అక్కడివరకూ చిన్న చిన్న మ్యాజిక్‌లు చేస్తూ ఏదో నడిపించే ప్రయత్నం చేశారు. దీంతో సెకండాఫ్ కొంత డల్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

సెకండాఫ్ మొత్తం ఒకే సింగిల్ పాయింట్‌తో నడుస్తూ, చాలాచోట్ల దారితప్పింది. అదేవిధంగా సినిమాను కొన్ని చోట్ల పాతకాలం నాటి ఆలోచనలను ఇప్పటికీ కొనసాగిస్తూ నడిపినట్లు కనిపిస్తుంది. ఈతరం ఆలోచనలకు ఇదే ఆదర్శం అన్న రీతిలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఎక్కడా అనవసర హంగులకు, ఆర్భాటాలకు తావివ్వకుండా న్యాచురల్‌గా నడిపించిన విధానం కమర్షియల్ సినిమాలను మాత్రమే ఇష్టపడే నచ్చని అంశం. ఇక ఈ సినిమా కథకు ‘నవ మన్మథుడు’ అన్న టైటిల్‌కు పొంతన ఉన్నట్టు కనిపించదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా అందరికంటే ముందుగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ గురించి చెప్పుకోవాలి. అనిరుధ్ అందించిన పాటలన్నీ వినడానికి ఎంత బాగున్నాయో, సందర్భానుసరంగా వస్తూ చూడడానికి కూడా అంతే అందంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలోనూ అనిరుధ్ ప్రతిభ బాగా ఆకట్టుకుంటుంది. ఇక కుమారన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు పూర్తిగా ఒక మధ్య తరగతి కుటుంబ నేపథ్యం మూడ్‌ను, రొమాంటిక్ సన్నివేశాల్లో లైటింగ్‌ను సరిగ్గా పట్టుకొని మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కల్పించారు. రాకేందు మౌళి, వెన్నెలకంటి సాహిత్యం బాగుంది.

ఇక రచయితగా వేల్‌రాజ్ సగం సక్సెస్ అయి, సగం దారితప్పినట్లు కనిపిస్తుంది. రెండు ప్రేమకథలను ఒక ప్రధాన కథకు కలుపుతూ ఎమోషన్‌ను పండిచడంలో రచయితగా సక్సెస్ అయినా, ఫార్ములాను నమ్ముకోవడం బాలేదు. దర్శకుడిగా చాలాచోట్ల వేల్‌రాజ్ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. సెకండాఫ్ విషయంలో జాగ్రత్త పడి ఉంటే ఈ సినిమా ఎక్కడో ఉండేది. ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని చోట్ల జంప్ కట్స్ ఎక్కువయ్యాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

ప్రేమ, కుటుంబ బంధాలను హైలైట్ చేస్తూ ఎన్ని సినిమాలు పుట్టుకొచ్చినా, అలాంటి సినిమాల్లో కొత్త ఎమోషన్ ఎప్పుడూ ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఎమోషన్స్‌ని పట్టుకొని మెప్పించేందుకు మన ముందుకు వచ్చిన సినిమాయే ‘నవ మన్మథుడు’. మనకు తెలిసిన రొటీన్ కథతో, రొటీన్ ఫార్మాట్‌లోనే రూపొందిన ఈ సినిమాలో మనల్ని మెప్పించేది ఏదీ అంటే ముందు చెప్పుకున్న ఆ ఎమోషనే! ఇక ఆ ఎమోషన్, నవ్విస్తూనే మంచి ఫీల్ పంచే ఫస్టాఫ్, నటీనటులందరి కట్టిపడేసే నటన లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాను రొటీన్ కథే కదా అని చూడకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. లేదూ.. కథలో కొత్తదనం కావాలనుకునేవారు ఈ సినిమాను ముందే చూసేశాం అనుకోవచ్చు!
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు