సమీక్ష : రభస – మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే రభస.!

rabhasa-telugu-review విడుదల తేదీ : 29 ఆగష్టు 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు
సంగీతం : ఎస్ఎస్ తమన్
నటీనటులు : ఎన్.టి.ఆర్, సమంత, ప్రణిత…

ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్ళందరూ బాగా జరుపుకునే పండుగలలో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పండుగ రోజుని మరింత స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం యంగ్ టైగర్ ఎన్.టి.అర్ తన ఆభిమానులకు, తెలుగు సినీ ప్రేక్షకులకు తను నటించిన యాక్షన్ – ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రభస’ని రిలీజ్ చేసారు. ఎన్.టి.ఆర్, సమంత, ప్రణిత జంటగా నటించిన ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఎన్.టి.ఆర్ ఈ మూవీలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని సమపాళ్ళలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. మరి ఆ ప్లాన్ ఎన్.టి.ఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

కార్తీక్(ఎన్.టి.ఆర్) యుఎస్ లో తన గ్రాడ్యువేషన్ పూర్తి చేసికొని ఇండియాకి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చిన కార్తీక్ కి తన తల్లి తండ్రులైన నాజర్ – జయసుధలు పెళ్లి చేయాలనుకుంటారు. అప్పుడే జయసుధ తన కుటుంబం నుంచి వేరుగా వెళ్ళిపోయిన తన అన్నయ్య ధనంజయలు(సాయాజీ షిండే) కుమార్తె చిట్టి అలియాస్ ఇందు(సమంత)ని తన ఇంటి కోడలిగా తీసుకురమ్మని కార్తీక్ ని కోరుతుంది.

ఆ పనిమీద కార్తీక్ ఇందు చవివే కాలేజ్ కి వెళతాడు. అక్కడ అనుకోకుండా భాగ్యం(ప్రణిత) కార్తీక్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. అన్ని తప్పించుకొని ఫైనల్ గా కార్తీక్ ఇందుని దక్కించుకునే ప్రయత్నంలో ఉండగా పెద్ది రెడ్డి – గంగిరెడ్డిలు కార్తీక్ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. అసలు ఈ పెద్ది రెడ్డి, గంగి రెడ్డి ఎవరు? అసలు కార్తీక్ కి పెద్ది రెడ్డి – గంగిరెడ్డిలకి ఉన్న సంబంధం ఏమిటి.? కార్తీక్ ఇందుల మధ్య భాగ్యం ఎలా ఎంటర్ అయ్యింది? చివరికి కార్తీక్ తన అమ్మ కోరినట్టుగా ఇందుని పెళ్లి చేసుకున్నాడా.? లేదా? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఎన్.టి.ఆర్ గత రెండు మూడు సినిమాల మాదిరిగానీ ఈ సినిమాలో కూడా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఒక్కడే మొత్తం బాధ్యతని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. మొదటి ఫేం నుండి చివరి ఫ్రేం వరకూ ఎన్.టి.ఆర్ తన నటనతో, ఫైట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ లో, సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ లో ప్రేక్షకులని బాగా నవ్వించాడు. ఇకపోతే గత రెండు సినిమాల్లాగానే సమంత ఈ సినిమాలో కూడా బాగా గ్లామరస్ గా కనిపించింది. అలాగే తన పాత్రకి తగ్గట్టు పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

ఇకపోతే చెప్పుకోవాల్సింది ప్రణిత గురించి.. ప్రణిత ఫస్ట్ హాఫ్ లో కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఉన్నంతసేపూ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. లంగావోనిలో అందాలను ఓలకబోస్తూ, అమాయకమైన నటనతో ప్రేక్షకులను చూపు తిప్పుకోనికుండా చేసింది. ఇక ఎప్పటిలానే కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎంట్రీ సెకండాఫ్ లో లేట్ గా ఇచ్చినా రాజుగారి పాత్రలో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపించే 15-20 నిమిషాలు ప్రేక్షకులు తెగ నవ్వుకుంటారు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ – బ్రహ్మి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి.

జయప్రకాశ్ రెడ్డి, నాగినీడు, సాయాజీ షిండే, అజయ్, నాజర్, జయసుధ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఫస్ట్ హాఫ్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్.టి.ఆర్ – సమంత – ప్రణితల మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇంటర్వల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సీన్స్ బాగున్నాయి. సెకండాఫ్ కి ఎన్.టి.ఆర్ – బ్రహ్మి కామెడీ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే సెంటిమెంట్ సీన్స్ కూడా సెకండాఫ్ లో ఉండడం ఆడియన్స్ కి బోనస్ కింద చెప్పుకోవాలి.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ చాలా స్లోగా అనిపిస్తుంది. బాగున్న ఎన్.టి.ఆర్ – బ్రహ్మి కామెడీ సీన్స్ ని పక్కన పెడితే సెకండాఫ్ మొత్తం ఎన్.టి.ఆర్ చేసిన బాద్షా మరియు రెడీ, దూకుడు మొదలైన సినిమాలను పోలి ఉంటుంది. ఆ సినిమాల ఫార్మాట్ లోనే ఉన్నా ఈ సినిమాకి మైనస్ ఏమిటంటే ఆ సినిమాల సెకండాఫ్ లో కామెడీ వర్కౌట్ అయినట్టు ఈ సినిమాలో వర్కౌట్ కాకపోవడం. యాక్షన్ ఎపిసోడ్స్ లో వాడిన గ్రాఫిక్స్ చాలా నాశిరకంగా ఉన్నాయి. చెప్పాలంటే ఆ గ్రాఫిక్స్ లేకుండా యాక్షన్ ఎపిసోడ్స్ తీసి ఉంటే ఇంకా బాగుండేవి.

ఇకపోతే డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఎంచుకున్న కథలో కొత్తదనం అనేది జీరో పర్సెంట్. చాలా అంటే చాలా రొటీన్ స్టొరీ. అలాగే సినిమాలో ఉన్న మేజర్ ట్విస్ట్ లని మనం చాలా ఈజీగా ఊహించేయవచ్చు. మూవీలో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి, ప్రతి ట్విస్ట్ కోసం ఓ నటుడు ఉండాలి అన్న ఫార్ములాని దృష్టిలో పెట్టుకొని నటీనటుల్ని ఎక్కువ పెట్టేసారు. దానివల్ల సెకండాఫ్ లో ఆడియన్స్ అన్ని పాత్రలు చూస్తూ కాస్త గందరగోళానికి కూడా గురవుతారు. ఇకపోతే ఎప్పటిలానే మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో అస్సలు కనపడని లాజిక్స్ ఇందులో కూడా మిస్సింగ్. ఎతికితే లూప్ హోల్స్ కూడా చాలా దొరుకుతాయి. ఇకపోతే ఎన్.టి.ఆర్ అభిమానులు తన నుంచి మంచి స్టెప్స్ ఆశిస్తారు. కానీ సినిమాలో ఎన్.టి.ఆర్ తన అభిమానులను అలరించేలా డాన్సులు వెయ్యకపోవడం వాళ్ళని కాస్త నిరుత్సాహపరచవచ్చు.

సాంకేతిక విభాగం :

‘కందిరీగ’ సినిమాతో సక్సెస్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ కి సెకండ్ సినిమా ఎన్.టి.ఆర్ లాంటి బిగ్ హీరోతో చేసే బంపర్ ఆఫర్ వచ్చింది. కానీ సంతోష్ శ్రీనివాస్ మాత్రం దాన్ని ఆ అవకాశాన్ని పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అలాగే తన పరమ రొటీన్ స్టొరీతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఇక తను డీల్ చేసిన 4 డిపార్ట్మెంట్స్ గురించి ఒక్కో మాత్రలో చెప్పాలంటే .. కథ – ఓ 4 లేదా 5 కమర్షియల్ హిట్ సినిమాల మిక్సింగే ఈ కథ, స్క్రీన్ ప్లే – ట్విస్ట్ లు ఎక్కువే కానీ వర్కౌట్ అయ్యే ట్విస్ట్ లేకపోవడం బాధాకరం, డైలాగ్స్ – ఎన్.టి.అర్ రేంజ్ కి చెప్పుకోదగ్గ స్థాయి డైలాగ్స్ నాలుగైదు కూడా లేవు, దర్శకత్వం – జస్ట్ ఓకే. చివరిగా సంతోష్ శ్రీనివాస్ 7 యాక్షన్ ఎపిసోడ్స్ మీద పెట్టిన శ్రద్దలో సగం కథ – స్క్రీన్ ప్లే పై పెట్టి ఉంటే ఈ సినిమా అభిమానుల గుండెల్లో రభస చేసుండేది.

ఇక సినిమాలో మెచ్చుకోవాల్సింది అంటే అది ఒక్క శ్యాం కె నాయుడుని మాత్రమే.. శ్యాం కె నాయుడు నటీనటుల్ని, సినిమాలో ఉన్న సెట్స్ ని మరియు కొన్ని లోకేషన్స్ ని చాలా బాగా చూపించారు. ఆయన వరకూ సినిమా చాలా గ్రాండ్ గా ఉండేలా చూసుకున్నారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు సెకండాఫ్ లో అక్కడక్కడా కూని సాగదీసిన సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. రామ్ – లక్ష్మణ్, విజయ్ మాస్టర్స్ కలిపి కంపోజ్ చేసిన ఫైట్స్ కొన్ని ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయితే కొన్ని మాత్రం సీన్ కి తగ్గ ఎమోషన్ ని క్రియేట్ చేయలేకపోయాయి. ఎస్ఎస్ తమన్ అందించిన ఆడియోలో జస్ట్ రెండు మూడు పాటలు హిట్ అయ్యాయి, అలాగే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ కి హెల్ప్ అయ్యింది, కొన్ని సీన్స్ కి కాలేదు. ఇక చివరిగా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘రభస’ సినిమా అభిమానులు ఆశించిన రేంజ్ లో రభస క్రియేట్ చేయలేకపోయినా, ఆ అంచనాలకు కాస్త తక్కువగా ఓ మోస్తరు రభసను మాత్రం క్రియేట్ చేసింది. ఎప్పటిలానే ఎన్.టి.ఆర్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. ఎన్.టి.ఆర్ – సమంత – ప్రణితల ట్రాక్, ఎన్.టి.ఆర్ – బ్రహ్మి కామెడీ ట్రాక్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, కాస్త సెంటిమెంట్ ఈ సినిమాకి ప్లస్ అయితే రెగ్యులర్ స్టొరీ, ఊహాజనిత స్క్రీన్ ప్లే, పాత హిట్ సినిమాల కాపీ టేకింగ్ ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్. విమర్శకులను అస్సలు మెప్పించలేని ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కోరుకునే రెగ్యులర్ అంశాలు ఉండడం వలన మరియు అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయడం వలన మొదటి వారం బాక్స్ ఆఫీసు వద్ద భారీగా కాసుల వర్షం కురిపించే అవకాశం మాత్రం పుష్కలంగా కనపడుతోంది. మాస్ ఆడియన్స్ మరియు ఎన్.టి.అర్ అభిమానులు ఈ వినాయక చవితికి పండుగ చేసుకునే సినిమా ‘రభస’.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :