సమీక్ష : మోక్ష – ఓ ప్రేతాత్మ రక్త దాహం..

సమీక్ష : మోక్ష – ఓ ప్రేతాత్మ రక్త దాహం..

Published on Jun 29, 2013 3:30 AM IST
Moksha విడుదల తేదీ : 28 జూన్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : శ్రీకాంత్ వేములపల్లి
నిర్మాత : అమర్ నాథ్ రెడ్డి
సంగీతం : విజయ్ కూరాకుల
నటీనటులు : మీరా జాస్మిన్, దిశా పాండే, రాజీవ్ మోహన్

గతంలో ఎప్పుడో అడపాదడపా తెలుగు సినిమాల్లో కనిపించి కొన్ని హిట్స్ కూడా అందుకున్న మలయాళ బొద్దుగుమ్మ మీరా జాస్మిన్ దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాతా మళ్ళీ ‘మోక్ష’ అనే హారర్ సినిమాతో అందరినీ భయపెట్టడానికి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎప్పుడో ఫినిష్ అయినప్పటికీ ఇప్పటికి థియేటర్లకి వచ్చే భాగ్యం కలిగింది. 2008లో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంశలు అందుకున్న శ్రీకాంత్ వేములపల్లి ఈ సినిమాకి డైరెక్టర్. విజయ్ కూరాకుల సంగీతం అందించిన ఈ సినిమాలో దిశా పాండే, రాజీవ్ మోహన్, నాజర్ తదితరులు నటించారు. మీరా జాస్మిన్ కాస్త కొత్తగా కనిపిస్తుందంటున్న ఈ సినిమాలో తను ఎంతవరకూ ప్రేక్షకుల్ని భయపెట్టి మార్కులు కొట్టేసిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

శీను(రాజీవ్ మీనన్) భయస్తుడైన కాలేజ్ స్టూడెంట్. కాలేజ్ లో ప్రతి ఒక్కరూ తనని ఏడిపిస్తూ కొడుతూ ఉంటారు. కానీ నిషా(దిశా పాండే) మాత్రం అతన్ని ప్రేమిస్తుంటుంది. శీనుకి నిషా అంటే ఇష్టముండదు. అదే టైంలో తన పక్క అపార్ట్ మెంట్ లో మోక్ష(మీరా జాస్మిన్) తన తండ్రి నాజర్ తో కలిసి దిగుతుంది. మోక్ష పగలు అసలు బయటే రాదు రాత్రైతే బయటకి వస్తుంది. ఆ సమయలో మోక్షతో శీనుకి పరిచయం ఏర్పడుతుంది. అప్పటికే చాలా రోజుల నుండి వారు ఉన్న ఏరియాలో కొన్ని మర్డర్లు జరుగుతుంటాయి. అప్పుడే సినిమాలో అసలు సిసలైన ట్విస్ట్. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? మోక్ష పగలు ఎందుకు బయటకు రాదు? మర్డర్స్ కి మోక్ష కి ఏమన్నా సంబంధం ఉందా? లేదా? అనేదే మిగిలిన కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో మెయిన్ రోల్స్ చేసిన మీరా జాస్మిన్, రాజీవ్ మీనన్ లకు డైరెక్టర్ చెరొక ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. దాన్నే అన్ని షాట్స్ లో చూపించమన్నట్టు ఉన్నాడు, వాళ్ళు దాన్ని తూచా తప్పకుండా చేసారు. ఆ విషయంలో వారు సక్సెస్ అయ్యారు. దిశా పాండేను రెండు పాటలకి, కాస్త స్కిన్ షోకి ఉపయోగించుకున్నారు. నాజర్ నటన ఓకే. ఇంతకూ మించి ప్లస్ పాయింట్స్ మీరు ఆశించొద్దు, నేనూ చెప్పలేను..

మైనస్ పాయింట్స్ :

సినిమా అంతా మైనస్ లే ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ నుండి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు.. ఒక సినిమా అనే దానికి ప్రధానమైనది. కథ.. ఈ సినిమాలో అస్సలు కథ లేనే లేదు మీరు ఒక సారి చూసినా 100 సార్లు చూసినా స్టొరీ అర్థం కాక గోక్కోవలసిందే తప్ప మీకు అర్థమయ్యేది ఏమీ ఉండదు. స్టొరీ లేనప్పుడు దానికి కథనం మాత్రం ఎలా ఊహించగలం చెప్పండి. కావున డైరెక్టర్ తనకి ఇష్టమొచ్చిన విధంగా కొన్ని షాట్స్ తీసాడు. వాటిని మనమీదకి వదిలాడు. మామూలుగా తీరని కోరికతో చచ్చిపోతే ప్రేతాత్మ అవుతారు అంటారు కానీ ఈ సినిమాలో ఏ కోరిక లేకుండా, ఎలాంటి అవసరం లేకుండానే ప్రేతాత్మ అయిపోతుంది. అసలు చనిపోయిన వ్యక్తి బాడీ సగం కాలడం అది పూర్తిగా కాలకపోవడం వల్ల ప్రేతాత్మ అవ్వడం ఏందో, అదికూడా అచ్చమైన మనిషిలా భూమ్మీద తిరగడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో.. పూర్తిగా నమ్మశక్యం కానిది , లేని కాన్సెప్ట్. సినిమా మొత్తం చాలా లూప్ హోల్స్ ఉన్నాయి.

సగం కాలిన శవాన్ని కాష్టం మీద నుంచి తీసుకొని వెళ్ళిపోవడం, కూతురు కోసం మనుషుల్ని చంపి రక్తం తెచ్చివ్వడం, అలాగే తన లవర్ తనతో ఉండాలనే స్వార్ధంతో తన ముందు మనుషుల్ని చంపి రక్తం తాగుతున్నా పట్టించుకోకపోవడం లాంటి సీన్స్ చాలా చెత్తగా అనిపించడమే కాకుండా, కాస్త విరక్తిని కలిగిస్తాయి. సినిమా మొదటి నుంచి చివరి వరకూ వేగంగా ప్రవహిస్తున్న నదిలో ప్రవాహానికి వ్యతిరేకంగా సగం ఈత వచ్చినవాడు ఈత కొడితే ఎంత వేగంగా ముందు కెలతాడో అంతకన్నా స్లోగా ఉంటుందంటే సినిమా ఎ రేంజ్ లో ఉందో మీరు అర్థం చేసుకోకపోవచ్చు. అలాగే సినిమాలోని మెయిన్ పాత్రలకి ఒకే ఒక్క ఎక్స్ ప్రెషన్ ఉండడం, కనీసం సినిమా మొత్తం మీద ఎక్కడన్నా ఎక్స్ ప్రెషన్ మారుతుందేమో క్యాచ్ చేద్దాం అనుకునే ఆడియన్స్ కి డైరెక్టర్ ఆ చాన్స్ ఇవ్వలేదు. ఈ మధ్య హర్రర్ సినిమాల్లో కాస్త కామెడీ పెడుతున్నారు. ఈ సినిమాలో కూడా ఉందని అనుకోని సినిమాకి వెళ్ళారంటే మీ జేబుకి కన్నం వేసుకున్నట్టే. ఎందుకంటే మీరు నవ్వడానికి ఒక్క సీన్ కూడా లేదు. సినిమాలో సమయం సందర్భం లేకుండా వచ్చే పాటలు ప్రేక్షకులకి బోర్ ని కలిగిస్తాయి.

సాంకేతిక విభాగం :

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా సినిమాకి కీలకమైన నాలుగు విభాగాలను శ్రీకాంత డీల్ చేసాడు. నేను ఇది వరకూ చెప్పినట్టు కథలోనే ఈయనకి జీరో మార్క్స్ మనం వేస్తే, మిగతా విభాగాల్లో ఆయనే పాస్ మార్కులు తెచ్చుకోకుండా వాటిల్లోనూ జీరో మార్క్స్ సంపాదించి అన్నిటికీ సమాంతర న్యాయం చేసాడు. సినిమాటోగ్రఫీ అస్సలు బాగోలేదు. ఎడిటర్ డైరెక్టర్ తీసిన దాన్ని ఒక ఆర్డర్ లో సెట్ చెయ్యడానికి చాలానే కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కూరాకుల ఇచ్చిన సాంగ్స్ చాలా చెత్తగా ఉన్నా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అక్కడక్కడా భయపెట్టడానికి బాగా ట్రై చేసాడు. నిర్మాణ విలువల గురించి మాట్లాడకపోవడం బెటర్. కానీ నిర్మాత ఏం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నాడో అనేది ఆయనకన్నా తెలుసో లేదో మరి.. ఈ సారి అయినా కాస్త జాగ్రత్త తీసుకోండి.

తీర్పు :

‘మోక్ష’ అనే సినిమా ఓ రక్త పిశాచి లేదా రక్తం తాగే ఓ ప్రేతాత్మ కథ. అంతంతమాత్రం అనిపించే నటీనటుల నటన తప్ప చెప్పడానికి ఏమీ లేని ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కెమెరా ఇలా అన్నీ మైనస్ పాయింట్స్. మీ జేబులకి చిల్లు పడకుండా ఉండాలంటే ఈ సినిమాకి దూరంగా ఉండటం చాలా మంచిది.

123తెలుగు.కామ్ రేటింగ్ :1.5/5

రాఘవ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు