సమీక్ష : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – కుటుంబ విలువలు తెలిపే చిత్రం

సమీక్ష : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు – కుటుంబ విలువలు తెలిపే చిత్రం

Published on Jan 12, 2013 8:30 AM IST
SVSC2-Review విడుదల తేదీ : 11 జనవరి 2013
దర్శకుడు : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : దిల్ రాజు
సంగీతం : మిక్కి జె మేయర్
నటీనటులు : వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి

పరిశ్రమలో చాలా కాలం తరువాత వస్తున్న మల్టీస్టారర్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” రేపు భారీ విడుదలకు సిద్దమయ్యింది. ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో జరిగిన స్క్రీనింగ్ నుండి మీకోసం ప్రత్యేకంగా సమీక్షను అందిస్తున్నాం. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథ :

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర కథ మొత్తం రేలంగి అనే పల్లెటూరులో జరుగుతుంది. చిత్ర కథ మొత్తం ప్రకాష్ రాజ్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. రేలంగి మావయ్య అనే పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. మానవత్వ విలువలకు మరియు కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే పాత్ర రేలంగి మామయ్య. ఇతనికి పెద్దోడు(వెంకటేష్) మరియు చిన్నోడు(మహేష్ బాబు) అని ఇద్దరు కొడుకులు ఉంటారు.

వెంకటేష్ ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ గా ఉండే యువకుడు. ఇంకొకరి ముందు తలవంచుకునే వ్యక్తిత్వం కాదు. తనకు నచ్చింది చేసి మంచి అవకాశం కోసం చూసే వ్యక్తి, నిరుద్యోగి, తన తమ్ముడు మహేష్ అంటే చాలా ఇష్టం. సీత(అంజలి) అతనికి మరదలు. చిన్నప్పటి నుండి బావ వెంకటేష్ ని ఇష్టపడుతుంటుంది. ఎప్పటికి అయిన వెంకటేష్ తన భర్త అవుతాడని కలలు కంటూ ఉంటుంది.

మరో ప్రక్క మహేష్ బాబు ఎటువంటి పరిస్థితిని అయినా తనకు అనుగుణంగా మార్చుకునే యువకుడు. మహేష్ బాబు, రావు రమేష్ కూతురు అయిన గీత(సమంత)ని చూడగానే ప్రేమలో పడిపోతాడు. ప్రకాష్ రాజ్ కుటుంబానికి సంపద తక్కువగా ఉందని రావు రమేష్ చులకనగా చూస్తుంటాడు.

వెంకటేష్ నిరుద్యోగి కావడం మూలాన కుటుంబ బాంధవ్యాలలో కాస్త అలజడి మొదలవుతుంది. దీని మూలాన మహేష్ బాబు మరియు వెంకటేష్ ఇద్దరి ప్రేమ భాదింపబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రకాష్ రాజ్ ఎలా స్పందించారు? వెంకటేష్ మరియు మహేష్ బాబు వారి ప్రేమను గెలుచుకున్నారా లేదా? అనేది మిగిలిన కథ

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరియు నిర్మాత దిల్ రాజులను మొదట అభినందించాలి. ఈ కాలంలో ఇటువంటి చిత్రం చెయ్యడం నిజంగా అభినందనీయం. వెంకటేష్ మరియు మహేష్ బాబు ని ఒకే తెర మీదకు తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది.
వెంకటేష్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుంది. మాములుగానే ఇటువంటి సన్నివేశాలలో అద్భుతంగా నటించే వెంకటేష్ ఈ పాత్రలో కూడా అద్భుతమయిన నటన కనబరిచారు. ముఖ్యంగా అంజలి తో సన్నివేశాలలో అయన సన్నివేశానికి ప్రాణం పోసారు అని చెప్పవచ్చు.
మహేష్ బాబు తుంటరి తమ్ముడి పాత్రలో కనిపించారు. గోదావరి యాసలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్రేక్షకులను తన కామెడి టైమింగ్ తో చాలా బాగా అలరించారు. సమంత మరియు మహేష్ బాబు మధ్యన రొమాంటిక్ సన్నివేశాలు చూడటానికి చాలా బాగున్నాయి. భద్రాచలంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు మధ్య కెమిస్ట్రి చాలా బాగా వచ్చింది. చూడటానికి కన్నుల పండుగలా అనిపించింది.

సమంత చాలా అందంగా కనిపించడమే కాకుండా అభినయంతో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన రొమాంటిక్ సన్నివేశాలు అయితే సమంత నటన చాలా బాగుంది. అమాయకమయిన సీత పాత్రలో అంజలి నటన కూడా బాగుంది.
ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో చాలా బాగా నటించారు. జయసుధ, రావు రమేష్ , మురళి మోహన్, రోహిణి ,రవిబాబు మరియు తనికెళ్ళ భరణి వారి పాత్రల మేరకు చాలా బాగా నటించారు.
ఈ చిత్రంలో అన్నదమ్ముల మధ్య బంధాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తన మేనకోడలి మీద మామయ్యకి ఉన్న ప్రేమ, కొడుకు – తల్లి మధ్య ప్రేమ వంటి అంశాలను అద్భుతంగా చూపించారు.
మద్య తరగతి కుటుంబం గురించి చాలా సహజంగా చూపించారు. ప్రధమార్ధం మొత్తం మంచి వేగంగా సాగుతుంది. చిత్రంలో అన్ని పాటలను చాలా బాగా తెరకెక్కించారు.

చిత్రంలో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఒకానొక సన్నివేశంలో వెంకటేష్ మరియు మహేష్ బాబు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చెప్పుకోవాలని అనుకోని ఆగిపోయే సన్నివేశం హృదయానికి హత్తుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది, అది కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ ఆ ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతారు. వెంకటేష్ – మహేష్ బాబుల గత సినిమాల మాదిరిగా కమర్షియల్ అంశాలను ఆశించి, అంచనాలను పెట్టుకొని సినిమాకి వెళ్లొద్దు, అలా వెళితే మీరు కొంత నిరాశపడవచ్చు.

ఒక కుటుంబంలో ఉండాల్సిన అనుబంధాలను గురించి, మానవ విలువలను మరియు భావోద్వేగాలకు సినిమాలో ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడంతో మామూలుగా ఉండాల్సిన కమర్షియల్ అంశాలు కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాలో చెప్పుకోవాల్సిన ప్రధాన హైలైట్. ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్ చూడటానికి ఎంతో కలర్ ఫుల్ గా, ఎంతో అందంగా, అలాగే బాగా రిచ్ గా ఉంటుంది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సినిమాకి ఒక హైలైట్ అయితే మణిశర్మ నేపధ్య సంగీతం సినిమాకి వెన్నెముకలా నిలిచింది. ఎడిటింగ్ బాగుంది, డైలాగ్స్ సినిమాకి తగ్గట్టు చాలా బాగా రాసారు.

శ్రీ కాంత్ అడ్డాల స్టొరీని చెప్పడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయినా, ఒక ఫ్యామిలీ డ్రామా సినిమాలో స్టార్ హీరోలైన వెంకటేష్ – మహేష్ బాబు పాత్రలను స్క్రీన్ పైన బాలన్స్ చేయడంలో విజయం సాదించాడు. ఇప్పుడున్న పరిస్థితులకు అలా బాలన్స్ చేసి తియ్యడం అనేది చాలా కష్టమైన పని.

తీర్పు :

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మనిషి జీవితంలోని అందమైన ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కథ. ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, వెంకటేష్ – మహేష్ బాబు మధ్య రిలేషన్, కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్ పైన్నే చూడాలి. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన అందరూ బాగా నటించారు, అలాగే ఎమోషనల్ మోమెంట్స్ ప్రేక్షకులకు అదనంగా ఇచ్చే బోనస్ పాయింట్స్. వెంకటేష్ – మహేష్ బాబుల ప్రతి హీరోయిజం, కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాల్లాగా అంచనా వేసుకొని ఈ సినిమాకి వెళ్ళకండి. మొత్తానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతి ఎంటర్టైనర్, తెలుగు వారికి ఎంతో అందమైన సంక్రాంతి పండుగకి ఇంట్లోని చిన్నా పెద్దా తేడా లేకుండా కుటుంబ సమేతంగా అందరూ చూడాల్సిన సినిమా.

రేటింగ్:

ఈ చిత్రానికి అధికారిక మీడియా పార్ట్నర్స్ మేమే కావటం మూలాన ఈ చిత్రానికి రేటింగ్ ఇవ్వటం సమంజసం కాదు కావున ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వదలుచుకోవట్లేదు రివ్యూ చదివి చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం

అనువాదం రవి

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు