సమీక్ష : శరణం గచ్ఛామి – సోషల్ మెసేజ్ ను సరిగా చెప్పలేదు !

Sharanam Gacchami movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : ప్రేమ్ రాజ్

నిర్మాత : బొమ్మకు మురళి

సంగీతం : రవి కళ్యాణ్

నటీనటులు : నవీన్ సంజయ్, తనిష్క్ తివారి

భారతదేశ రాజ్యాంగంలో అత్యంత కీలకమైన అంశం, దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం అయిన రిజర్వేషన్ ను ప్రధానంగా తీసుకుని రూపొందిన చిత్రమే ఈ ‘శరణం గచ్ఛామి’. సెన్సార్ పరమైన ఇబ్బందులు ఎదుర్కొని ఇటీవలకాలంలో చర్చనీయాంశమై ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

మానవ్ (నవీన్ సంజయ్) అనే కుర్రాడు జర్నలిజం చదువుతూ సమాజంలో ఉన్న కుల పిచ్చి, నిరుద్యోగం, దోపిడి వంటి సమస్యలపై తనదైన దూకుడు శైలిలో స్పందిస్తూ తన పీజీ రీసెర్చ్ కోసం ఆ కులం, రిజర్వేషన్ టాపిక్స్ నే ఎంచుకుని పరిశోధన మొదలుపెడతాడు.

అలా రీసెర్చ్ చేస్తున్న అతనికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ? వాటిని ఎలా ఎదుర్కున్నాడు ? పరిశోధనలో అతను తెలుసుకున్న నిజాలేమిటి ? ఆ పరిశోధన ద్వారా రిజర్వేషన్ తాలూకు సమస్యలకు అతను ఎలాంటి పరిష్కారం ఇచ్చాడు ? అనేదే తెరపై నడిచే కథ..

ప్లస్ పాయింట్స్ :

రిజర్వేషన్ సిస్టం, అందులోని లోటుపాట్లు, అవి ఎలా పని చేయాలి అని చెప్పడమే ఈ సినిమాలో మెప్పించే ప్రధాన అంశాలు. సినిమా సెకండాఫ్లో మన దేశంలో కుల వ్యవస్థ మనుషుల మధ్య ఎలాంటి అంతరాలను సృష్టించింది, వేల ఎళ్ళనాటి వర్ణ వ్యవస్థ ఇప్పటికీ మనల్ని ఎలా బాధిస్తోంది అనే అంశాలను కాస్త బలంగానే ఎక్స్పోజ్ చేశారు. అలాగే అంబేడ్కర్ తయారు చేసిన రాఃజ్యాంగంలోని రిజర్వేషన్ సిస్టమ్ పట్ల ప్రజల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలున్నాయి అనేది చూపుతూనే దానికి పరిష్కారం చూపే ప్రయత్నం బాగుంది.

ముఖ్యంగా రిజర్వేషన్ అనేది ఎందుకు, ఎవరికి ఉపయోగపడటానికి ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యమేమిటి, దాన్ని కొందరు స్వార్థపరులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే అంశాలను ఎత్తి చూపిస్తూ ప్రజలకి సినిమా ద్వారా ఒక క్లారిటీ ఇవ్వాలని చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గదిగా ఉంది. ఇక చివరగా కాస్ట్ రిజర్వేషన్ లోని సమస్యలకు అంబెడ్కర్ రాసిన రాజ్యాంగం మాత్రమే సమాధానమని దర్శక రచయితలు తమధైన కోణంలో చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని ప్రధాన మైనస్ పాయింట్ అంటే కీలకమైన కథాంశం చుటూ అల్లుకున్న ఇతర కథనం అనే చెప్పాలి. ఫస్టాఫ్ మొత్తాన్ని హీరో క్యారెక్టరైజేషన్ కోసం ఇష్టమొచ్చినట్టు వాడుకోవడం వలన ఆ భాగమంతా పరమ బోరింగా తయారైంది. కథనం ఎక్కడా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో విసుగెత్తింది. ఇక ఆ భాగాల్లో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్, హీరో ఫ్యామిలీ మీద నడిచే సన్నివేశాలైతే చికాకు తెప్పించాయి. రిజర్వేషన్ సిస్టమ్ అనే బలమైన, సమస్యాత్మక అంశాన్ని ప్రభావితంగా చెప్పాలనుకున్నప్పుడు నటీ నటుల పెర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం. కానీ ఈ సినిమాలో అదే లోపించింది.

హీరో, ఇతర కాస్ట్ నటన కొన్ని చోట్ల తేలిపోవడంతో రిజర్వేషన్ దుర్వినియోగం వలన ఎదురయ్యే సమస్యలను మరింత ప్రభావంతంగా చెప్పలేకపోయారు. ఆ దుర్వినియోగాన్ని ఆపడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పకపోవడం వెలితనిపించింది. ఇక చిత్రం క్లైమాక్స్ లో అప్పటి వరకు సమస్య పరిష్కారం కోసం సతమవుతున్న హీరో సామాన్యులకి అర్థం కానీ వేరే లోకంలోకి వెళ్ళిపోయి సొల్యూషన్ కనుగొనడం మరీ నాటకీయంగా ఉంది. అలాగే ఆ సినిమాలోని కొన్ని వర్గాలను ఎత్తిచూపడం సరైనదే అయినా కూడా అది కొందరికి నచ్చదు. కథనంలో చాలా పాత్రలు, సన్నివేశాలు ఏమాత్రం ముందస్తు క్లూ లేకుండా అప్పటికప్పుడు అవసరం కోసం బలవంతంగా సృష్టించినట్టుగా వెంటవెంటనే వచ్చేస్తుండటం ఇబ్బంది పెట్టింది. ఇక హీరో లవ్ ట్రాక్ కూడా చాలా రొటీన్ గా, చప్పగా ఉంది.

సాంకేతిక విభాగం :

రచయిత మురళి బొమ్మకు మంచి అంశాన్నే ఎంచుకున్నాడు గానీ దాని చుట్టూ ఒక పూర్తి స్థాయి సినిమాకు కావాల్సిన కథానాన్ని అల్లుకోవడంలో చాలా వరకు విఫలమయ్యాడు. ఇక దర్శకుడు ప్రేమ్ రాజ్ సెకండాఫ్ టేకింగ్ ను పర్వాలేదనిపించినా ఫస్టాఫ్ అంతటినీ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకుండా నడిపాడు. రవి కళ్యాణ్ అందించిన సంగీతం అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఫస్టాఫ్ లో అనవసరమైన సన్నివేశాలని ఇంకా తొలగించాల్సింది. నిర్మాత పాటించితిన్ నిర్మాత విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

రిజర్వేషన్ అనే హాట్ టాపిక్ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అసలు రోజర్వేషన్ ఎందుకు, ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉంది, అది ఎలా దుర్వినియగం అవుతోంది, అన్ని సమస్యలకు రాజ్యాంగమే పరిష్కారం ఎలా అవుతుంది అనే అంశాలను కాస్త వివరంగానే చెప్పినప్పటికీ విసుగెత్తించే ఫస్టాఫ్, ఏమాత్రం ఆకట్టుకోని హీరో లవ్ ట్రాక్, సినిమాకు పెద్దగా ఉపయోగపడలేకపోయిన నటీనటుల నటన, బలవంతంగా ఇరికించినట్టు ఉండే కొన్ని సన్నివేశాలు బలహీనతలుగా మారి ఈ సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. మొత్తం మీద చెప్పాలంటే సామాజిక పరమైన అంశాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించే వారికి ఈ సినిమా కాస్తో కూస్తో నచ్చుతుందని ఆశించవచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version