సమీక్ష : శేఖరం గారి అబ్బాయి – పెద్దగా ఆకట్టుకోలేదు

Sekharam Gari Abbayi movie review

విడుదల తేదీ : అక్టోబర్ 20, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : అక్షత

నిర్మాత : మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా

సంగీతం : సాయి యెలేందర్

నటీనటులు : విన్ను మద్దిపాటి, అక్షత

చాలా మంది యువ దర్శకులు తమ మొదటి సినిమా కోసం ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథని ఎక్కువగా ఎంచుకుంటుంటారు. అలాగే దర్శకురాలు అక్షత కూడా అలాంటి కథనే ఎంచుకుని ఈ సినిమాను చేశారట. పైగా ఆమే స్వయంగా సినిమాలో హీరోయిన్ గా నటించారు. మరి ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

హీరో సాధిక్ (విన్ను మద్దిపాటి) హీరోయిన్ అప్సర (అక్షత) ఇంటి పక్కనే ఫ్యామిలీతో సహా దిగుతాడు. మొదటి చూపులోనే అప్సరను ప్రేమిస్తాడు. మొదట ఆమెతో స్నేహం చేసి ఆ తర్వాత తన ప్రేమ సంగతి ఆమెతో చెబుతాడు. కానీ అప్సర మాత్రం అతనికెలాంటి ఉద్యోగం, భాద్యత లేదని రిజెక్ట్ చేస్తుంది.

దాంతో బాధపడిన సాదిక్ ఆమె ప్రేమ కోసం ప్రయోజకుడవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అంతలోనే వేరొక వ్యక్తి సాదిక్ మీదున్న పాత కక్షతో అతని ప్రేమను దూరం చేయాలని అప్సరకు దగ్గరవుతాడు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సాదిక్ ఏం చేశాడు, అతని ప్రేమకు అడ్డు వచ్చిన ఆ పాత శత్రువు ఎవరు, అతని కథేమిటి, చివరికి సాదిక్ ప్రేమ గెలిచిందా లేదా అనేదే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్లస్ పాయింట్ అంటే కథ ప్రేమ కథ కావడమే. కొత్త వాళ్ళు కాబట్టి ప్రేమ కథను ఎక్కడైనా కొత్తగా డీల్ చేసుంటారేమోననే ఆసక్తి సినిమా ఆరంభంలో కొద్దిగా తలెత్తింది. ఇక హీరోయిన్ అక్షత తన పాతరలో బాగానే నటించింది. కథలో ఉన్న పాత్రలన్నిటిలోకి ఆమెదే కొంచెం చూడదగినదిగా ఉంది. నటన పరంగా కూడా ఆమె కనిపించే సన్నివేశాలు అన్నింటితో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నాయి.

ఇక ఫస్టాఫ్ మొత్తం ఎదో సాదా సీదాగా నడిపి బోర్ కొట్టించిన ఇంటర్వెల్ సమయానికి హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని చూపించి సెకండాఫ్ మీద కొంత ఆసక్తి కలిగేలా చేశారు. సినిమా చిన్నదే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా చోట్ల కొద్దిగా ఖర్చు పెట్టినట్టే అనిపించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాలోని మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా కథ విషయానికొస్తే సినిమాలో ఒక పద్ధతైన కథే కనిపించదు. ఎక్కడా ప్రేక్షకుడ్ని ఆకట్టుకునే సన్నివేశమే ఉండదు. సినిమా మొదటి 40 నిముషాలు అసలు కథ గమ్యమేమిటి, హీరో లక్ష్యమేమిటి అనేదే బోధపడదు. పైగా నటీ నటుల్లో సరైన ప్రతిభ లేకపోవడం వల్లనో, ఉన్న ప్రతిభని వాళ్ళు ప్రదర్శించలేకపోవడం వల్లనో కానీ చాలా సన్నివేశాలు చిరాకుగానే తయారయ్యాయి. ఏ సన్నివేశంలోనూ ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్ లాంటి అంశాలే పూర్తి స్థాయిలో దొరకవు.

ముఖ్యంగా నటన పరంగా హీరో పెద్దగా మెప్పించలేదు. చాలా సీన్లలో పూర్తి పర్ఫెక్షన్ చూపలేకపోయాడు. ఇక ఫస్టాఫ్ నుండి చివరి దాక మధ్యలో మధ్యలో వచ్చే షకలక శంకర్ ట్రాక్ అయితే తల పట్టుకునేలా చేసింది. సినిమాలో కామెడీ ఉండాలి అనే నియమంతో పెట్టిన అతని బలవంతపు హాస్యం నవ్వించకపోగా పెద్ద తలనొప్పిగా పరిణమించింది.

అలా ఫస్టాఫ్ మొత్తం ఏదోలా తట్టుకోగా ఇంటర్వెల్ తర్వాత మొదలయ్యే హీరో ఫ్లాష్ బ్యాక్ మరీ ఫ్లాట్ గా అనిపించింది. అందులో ఎక్కడా ప్రస్తుతాన్ని నడపగల దమ్ము కనిపించలేదు. అలా పసలేని గతాన్ని తీసుకుని సెకండాఫ్ లో ప్రస్తుతాన్ని నడపాలనే దర్శకురాలి ప్రయత్నం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టింది. మధ్యలో వచ్చే పాటలైతే అస్సలు బాగోలేవు.

సాంకేతిక విభాగం :

దర్శకురాలు అక్షత సినిమా కోసం సక్సె ఫార్ములా అయిన లవ్ కమ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ నే ఎంచుకున్నా కూడా సరైన కథ, కథనాలు రాసుకోకడంతో మంచి ఔట్ ఫుట్ ను ఇవ్వలేకపోయారు. కనీసం కథలో అవసరమైన మేరకే మంచి సన్నివేశాలని రాసుకుని ఉంటే కొంతలో కొంతైనా బాగుండేది. సాయి యెలేందర్ సంగీతం ఎక్కడా మెప్పించలేదు. రాఘవ కెమెరా పనితనం కూడా ఒక మాదిరిగానే ఉంది. నందమూరి హరి ఎడిటింగ్ ద్వారా షకలక శంకర్ లాంటి అనవసరపు ట్రాక్స్ ని తొలగించి ఉండాల్సింది. నిర్మాతలు మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా కొత్తవారైనా వారు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఏదో సినిమా చేశాం అంటే చేశాం అనేలా ఉన్న ఈ సినిమా ఏ కోశానా ఎంటర్టైనింగా అనిపించలేదు. కనీసం రొమాంటిక్ ట్రాక్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివి ఒక దగగ్ర కాకపోయినా మరొక దగ్గరైన కనిపించలేదు. సరైన కథ, పద్ధతైన కథనం, అంతగా ప్రతిభ కనబర్చలేకపోయిన ప్రధాన తారాగణం వంటి అంశాలే ఇందుకు కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ‘శేఖరం గారి అబ్బాయి’ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team