సమీక్ష : శ్రీ చిలుకూరు బాలాజీ – అందరినీ ఆలోచింపజేసే చిత్రం

సమీక్ష : శ్రీ చిలుకూరు బాలాజీ – అందరినీ ఆలోచింపజేసే చిత్రం

Published on Jan 5, 2018 6:05 PM IST
Sri Chilkur Balaji movie review

విడుదల తేదీ : జనవరి 05, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సాయి కుమార్, భాను శ్రీ మెహ్ర, సమీర్, విజయ్ చందర్

దర్శకత్వం : అల్లాణి శ్రీధర్

నిర్మాత : అల్లాణి శ్రీధర్

సంగీతం : అర్జున్

సినిమాటోగ్రఫర్ : శ్రీనివాస్ కూనపరెడ్డి

ఎడిటర్ : కె. రవీంద్రబాబు

ఫిల్మ్ మీడియా ప్రొడక్షన్ లిమిటేడ్ బ్యానర్లో అల్లాని శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన ‘చిలుకూరు బాలాజీ’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సాయి కుమార్, భాను శ్రీ మెహ్ర, సమీర్ తదితరులు నటించిన ఈ భక్తి రస చిత్రం ఎలా ఉందో ఈ విశ్లేషణలో చూద్దాం.

కథ:

మాధవ (సాయి కుమార్ ) ఒక నాస్తికుడు. దేవుడు లేడని నమ్మే మనిషి. తిరుమల వెళ్ళడానికి ఆర్ధిక సహాయం కోసం వచ్చిన ఒక భక్తుడికి దేవుడు లేడని చెప్తాడు. ఆ సమయంలో మాధవ భార్య (భాను శ్రీ మెహ్రా) ఆ భక్తునికి సహాయం చేస్తుంది . కొంత కాలం తరువాత మాధవ దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. ప్రతి ఏటా తిరుమల వస్తానని దేవునికి మాట ఇస్తాడు.

ఒకసారి నడక దారిన తిరుమల వెళ్లిన మాదవకు మొదట ఆర్థిక సహాయం అడిగిన భక్తుడు ఎదురవుతాడు. ఆ తరువాత ఏం జరిగుంది ? మాధవ దేవుణ్ణి ఎందుకు నమ్ముతాడు ? తన స్వగ్రామమైన చిలుకూరులో వెంకటేశ్వరుని ఆలయం ఎందుకు నిర్మిస్తాడు ? తెలియాలంటే చిలుకూరు బాలాజీ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

మాధవ పాత్రలో సాయి కుమార్ బాగా నటించాడు. అతని భార్య పాత్రలో హీరోయిన్ భాను శ్రీ మెహ్రా నటన ఆకట్టుకుంది. సాంప్రదాయం , భక్తి గల స్త్రీ పాత్రలో మెప్పించింది. అతిధి పాత్రలో బాలసుబ్రమణ్యం మెప్పించాడు. ఉన్నది చిన్న పాత్రే అయినా సినిమాకు కీలకం కావడంతో ఆయన చేసిన ఎపిసోడ్ బాగా పనిచేసింది.

నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అల్లాణి శ్రీధర్ విధానం బాగుంది. పాత్రలు సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండడంతో సినిమా ఆసక్తిగా నడిచింది. సినిమా నిడివి తక్కువుగా ఉండడం, కథను అర్థం అయ్యే విధంగా సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు అల్లాణి శ్రీధర్ సక్సెస్ అయ్యారు. నటుడు భాను చందర్ వృద్ధుడి పాత్రలో చక్కటి నటన కనబరిచారు. సాయి కుమార్ దేవుడు ఉన్నాడని నమ్మే సన్నివేశం ఒక్కటే అయినా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే కొందరు నటుల లిప్ సింక్ సరిగ్గా లేదు. డబ్బింగ్ పూర్తి స్థాయిలో సక్రమంగా లేదు. దీంతో పాత్రల మాటల్లో క్లారిటీ లోపించింది. సాయి కుమార్ చేసే పనులు విఫలం అవ్వాలని ఆర్టిస్ట్ సమీర్ చేసే ప్రయత్నాలు, అతని సన్నివేశాలు గొప్పగా లేకపోగా కొంతసేపటికి బోర్ కొట్టించాయి.

దేవుణ్ణి పూర్తిగా వ్యతిరేకించే సాయి కుమార్ సడన్ గా దేవునికి భక్తుడు అవుతాడు. అతనికి దేవుడు ఉన్నాడని ఒక సన్నివేశం ద్వారా కనువిప్పు కలుగుతుంది. కానీ అలా కాకుండా ఎందుకు అతను దేవుణ్ణి నమ్మాడు ? దేవుడు ఉన్నాడనే నిజం తెలుసుకోవడానికి కారణాలు ఏంటి ? అనే అంశాలు ఇంకా బాగా చూపించి ఉంటే సినిమాలో పట్టు ఇంకా పెరిగుండేది.

సాంకేతిక విభాగం :

శ్రీధర్ ఎంచుకున్న సబ్జెక్ట్ నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. తను అనుకున్నది అనుకున్నట్లు ప్రేక్షకులకు చూపించడంలో ఆయన సఫమయ్యాడు. దేవుడు ఉన్నాడు, దేవుని గొప్పదనం గురించి చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా పై లోకంలో చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి.

ఎక్కడా బోర్ కొట్టకుండా, అనవసరమైన సన్నివేశాలు లేకుండా ఎడిటర్ జాగ్రత్త పడ్డాడు. అర్జున్ అందించిన సంగీతం బాగుంది. సుద్దాల అశోక్ తేజ, జొన్నవిత్తుల, కాపర్తి వీరేంద్ర, డా.రాణి పులోమజాదేవి రాసిన పాటల్లో సాహిత్యం బాగుంది.

తీర్పు :

భక్తి భావం ఉన్న మంచి చిత్రం ‘శ్రీ చిలుకూరు బాలాజీ’. తిరుమల వెళ్ళలేని చాలా మంది భక్తులకు చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించవచ్చని, తిరుమలలో కొలువై ఉన్న వేంకటేశ్వరుడు భక్తుల కోర్కెలు తీరుస్తూ వారిని మంచి మార్గంలో నడిపిస్తున్నాడనే సందేశం ఈ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. మంచి భక్తి రస చిత్రం చూడాలనుకోనేవారు ఈ సినిమాను చూడొచ్చు. అంతేగాక చిలుకూరు బాలాజీ దేవాలయం ఎందుకు కొలువై ఉంది, దాని వెనుక చరిత్ర ఏంటి అనే అంశాలు ఈ చిత్రంలో చక్కగా చూపించడం జరిగింది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు