సమీక్ష : ప్రియతమా నీవచట కుశలమా – ప్రేయసి కుశలమే కానీ ప్రేమికుడే..

PNK విడుదల తేదీ : 23 మార్చి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : త్రినాథరావు నక్కిన
నిర్మాత : కె. సాంబశివ రావు
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు : వరుణ్ సందేశ్, హసిక, కోమల్ ఘా..

‘మేం వయసుకు వచ్చాం’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతో పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన రెండవ ప్రయత్నంగా చేసిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ సందేశ్, హసిక, కోమల్ ఘా హీరో హీరోయిన్స్ గా ఈ సినిమాని కె. సాంబశివ రావు నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ద్వారా దర్శకుడు ద్వితీయ విగ్నంని విజయవంతంగా దాటాడా లేదా అనేది ఇప్పుడు లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

సినిమా రాజమండ్రి నేపధ్యంలో మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్న అందరి యువకుల్లానే వరుణ్(వరుణ్ సందేశ్) కూడా తన ఫ్రెండ్స్ తో పాటు ఆకతాయిగా తిరుగుతూ జల్సా చేస్తుంటాడు. అలాగే రెండు సంవత్సరాలుగా ప్రీతి(హసిక) అనే అమ్మాయిని ప్రేమిస్తూ రోజూ తన వెంట పడుతుంటాడు. ఒకరోజు ప్రీతి కూడా తనకు కూడా వరుణ్ అంటే ఇష్టమని చెబుతుంది. ఇలా సాఫీగా సాగిపోతున్న వీరిద్దరి ప్రేమాయణం విషయం ప్రీతి నాన్నగారైన రావుకి(రావు రమేష్) తెలుస్తుంది. అప్పుడు ప్రీతికి వేరే అతనితో పెళ్లి చేయాలనుకుంటాడు. అది తెలిసి వీరిద్దరూ లేచిపోవాలనుకుంటారు. ఆ టైములో ప్రీతి వరుణ్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది.

ఆ ట్విస్ట్ నుంచి బయటకి రాలేక బాధపడుతూ కాలం గడుపుతున్న వరుణ్ లైఫ్ లోకి కుందన(కోమల్ ఘా) ప్రవేశిస్తుంది. కుందన వరుణ్ ని ప్రేమిస్తుంది ఆ తర్వాత కొద్ది రోజులకి వరుణ్ కూడా కుందనని ప్రేమిస్తాడు. కొద్ది రోజులకి వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చి విడిపోతారు. అసలు ఏ కారణం వల్ల వీరు విడిపోవాలనుకుంటారు? అలా విడిపోయిన వీరిద్దరూ చివరికి కలిసారా? లేదా? అసలు ప్రీతి వరుణ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేదే మిగిలిన కథ, అది తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్ సెకండాఫ్. సెకండాఫ్ ని ఈ సినిమాకి హార్ట్ అని చెప్పుకోవచ్చు. వరుణ్ సందేశ్ ఫస్ట్ హాఫ్ లో క్లాస్ గా, సెకండాఫ్ లో కాస్త మాస్ లుక్ లో బాగున్నాడు. వరుణ్ సందేశ్ ఎమోషనల్ సీన్స్ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది అవి తప్ప మిగతా సీన్స్ అన్నీ బాగానే చేసాడు. చాలా సైలెంట్ గా ఉండే అమ్మాయి పాత్రలో హసిక నటన బాగుంది. సెకండాఫ్ కి ఈ అమ్మాయి నటన చాలా హెల్ప్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో వచ్చే ‘ప్రీతి ప్రీతి’, ‘ఏవో ఏవో’, ‘నువ్వలా నేనిలా’ పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. ముఖ్యంగా ‘నువ్వలా నేనిలా’ పాటలో ఒకే ఫ్లో లో పాటని ఫినిష్ చెయ్యకుండా మధ్య మధ్యలో కొన్ని సీన్స్ పెట్టడం బాగుంది.

అలాగే వరుణ్ సందేశ్ కి తల్లి తండ్రులుగా నటించిన ప్రగతి, సుభలేక సుధాకర్ల నటన చాలా బాగుంది. సెకండాఫ్ లో చాలా చోట్ల డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్, అవి కొంతమందికి నచ్చకపోయినా డైలాగ్స్ లో నిజాలు చెప్పాడు కనుక మెచ్చుకొని తీరాల్సిందే.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ పెద్ద మైనస్. అక్కడక్కడా చిన్న చిన్న కామెడీ బిట్స్ కాస్త నవ్వించినా మిగతా అంతా రొటీన్ గా, సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త టఫ్ గా ఉండుంటే బాడుండేది. అలాగే కోమల్ ఘా నటన ఈ సినిమాకి మరో మైనస్, ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రీన్ పైన కనిపించే ఈ భామ తన లుక్ మీద తీసుకున్న కేర్ నటన, డైలాగ్ డెలివరీ మీద కూడా తీసుకుని ఉంటే బాగుండేది. అలాగే ఆన్ స్క్రీన్ లో ఆమెకి చెప్పిన డబ్బింగ్ కి, కోమల్ ఘా డైలాగ్ డెలివరీకి అసలు సింక్ అవ్వలేదు. తెరపై చూస్తున్నప్పుడు అది ఇట్టే తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కోమల్ ఘా సాంగ్, సెకండాఫ్ లో వచ్చే న్యూ ఇయర్ సాంగ్, క్రికెట్ గౌండ్ లో వచ్చే ఫైట్ సినిమాకి అసలు అవసరం లేదు. ముఖ్యంగా ఫైట్ పెట్టాలి కదా పెట్టకపోతే బాగోదు కదా అని పెట్టినట్టు ఉంటుంది. ఇవి సినిమా ఫ్లోని కాస్త దెబ్బతీసాయి.

కథలో ట్విస్ట్ లని, సెకండాఫ్ ని బాగానే ప్లాన్ చేసుకున్న డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ ని, సినిమాలో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ని రాసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే డైరెక్టర్ హీరో పాత్రకి కొన్ని కమర్షియల్ హంగులు జోడించాలని చూసాడు, అది పెద్దగా సినిమాకి హెల్ప్ అవ్వలేదు. వరుణ్ – ప్రీతి మరియు వరుణ్ – కుందన మధ్య రొమాంటిక్ ట్రాక్స్ ఇంకాస్త బాగా ఉండుంటే బాగుండేది. హీరో పక్కన ఓ నలుగురు ఫ్రెండ్స్ ని, హీరోయిన్ పక్కన ఓ నలుగురు ఫ్రెండ్స్ ని పెట్టుకొని కూడా కామెడీని పండించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు.

సాంకేతిక విభాగం :

చిట్టిబాబు సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా పాటలను చాలా బాగా షూట్ చేసారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ సెకండాఫ్ లో బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ ని కాస్త ట్రిమ్ చేసి కొంచెం వేగవంతంగా తయారు చేసి ఉండాల్సింది. సాయి కార్తీక్ అందించిన సంగీతంలో పైన చెప్పినట్టు ‘ ప్రీతి ప్రీతి’, ‘ఏవో ఏవో’, ‘నువ్వలా నేనిలా’ పాటలు బాగున్నాయి, అలాగే ఎమోషనల్ సీన్స్, లవ్ సీన్స్ లో అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి బాగా హెల్ప్ అయ్యింది. ‘ప్రీతి ప్రీతి’ సాంగ్ పాటలో వేసిన స్టెప్స్ బాగున్నాయి. డైలాగ్స్ బాగున్నాయి.

ఇదివరకు చెప్పినట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అక్కడ ఇచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ బాగానే ప్లాన్ చేసుకున్న త్రినాథరావు ఫస్ట్ హాఫ్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో విఫలమయ్యాడు. కానీ అతని టేకింగ్ తో దర్శకుడిగా మాత్రం మంచి మార్కులే కొట్టేసాడు. త్రినాథరావు త్వరత్వరగా సినిమా తీయాలని కాకుండా ఒక నెల రోజులు ఎక్కువైనా కథ, స్క్రీన్ ప్లే విషయంలో కాస్త కేర్ తీసుకుంటే మంచి లవ్ స్టొరీలు తీయగల టాలెంట్ అతనిలో ఉంది. కథాపరంగా ఎక్కడా తక్కువ కాకుండా నిర్మాణ విలువలు ఉన్నాయి.

తీర్పు :

యూత్ ఫుల్ ట్రై యాంగిల్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమాకి సెకండాఫ్, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్ హైలైట్స్. చాలా రొటీన్ గా నిధానంగా సాగే ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. డైరెక్టర్ త్రినాథరావు ద్వితీయ విగ్నంని పాసయ్యాడనే చెప్పాలి. యూత్ ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ లవ్ స్టొరీ యూత్ ని బాగానే ఆకట్టుకున్నా, కామెడీ లేకపోవడం, కాస్త రొటీన్ గా ఉండడం వాళ్ళ మిగతా ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :